మహిళా అథ్లెట్లు గత రికార్డును బ్రేక్‌ చేసేనా..?

Female athletes Will you break the previous record?– 32మందితో భారత మహిళల బృందం పారిస్‌ పారా
–  ఒలింపిక్స్‌ రేపటి నుంచే..
పారిస్‌: 17వ పారా ఒలింపిక్స్‌లో భారత మహిళా అథ్లెట్లు అత్యధిక పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. 1968నుంచి భారత మహిళా అథ్లెట్లు పారా ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఇప్పటివరకు దక్కింది కేవలం నాలుగు పతకాలే. ఇందులో ఒక్క 2021 టోక్యోలోనే మూడు పతకాలు లభించగా.. అందులో అవని లేఖరే షూటింగ్‌ విభాగంలో ఏకంగా రెండు పతకాలు సాధించడం మరో విశేషం. 2024 పారిస్‌ పారా ఒలింపిక్స్‌లో భారత్‌నుంచి మొత్తం 84మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. వీరిలో 32మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. 1968లో మెక్సికో వేదికగా జరిగిన 3వ పారా ఒలింపిక్స్‌లో భారత్‌నుంచి తొలిసారి 10మంది మహిళా అథ్ల్లెట్లు ప్రాతినిధ్యం వహించారు. ఆ ఒలింపిక్స్‌లో ఒక్క మహిళా అథ్లెట్‌ కూడా పతకాన్ని సాధించలేదు. ఆ తర్వాత 1972(పశ్చిమ జర్మనీ), 1976(కెనడా), 1980(నెదర్లాండ్స్‌).. ఇలా వరుస పారా ఒలింపిక్స్‌లో భారత్‌నుంచి మహిళా అథ్లెట్ల ప్రాతినిధ్యం పెరుగుతున్నా.. పతకాల వేటలో వెనుకబడిపోయారు.
2016 రియోలో తొలిసారి..
2016 రియో పారా ఒలింపిక్స్‌లో మహిళా విభాగంలోభారత్‌కు తొలిసారి ఒక పతకం దక్కింది. షాట్‌పుట్‌లో దీపా మాలిక్‌ సుదీర్ఘ పతకాల సాధన నిరీక్షణకు తెర దించింది. ఆ పారా ఒలింపిక్స్‌లో దీపా మాలిక్‌ షాట్‌పుట్‌ ఎఫ్‌-53 విభాగంలో రజత పతకంతో మెరిసింది. దీంతో పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు మహిళల కేటగిరీలో తొలి పతకం అందించిన మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డుపుటల్లోకెక్కింది.
టోక్యోలో మరో మూడు…
రియో ఒలింపిక్స్‌లో ఒక పతకం సాధించిన జోష్‌తో 2021 టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత మహిళల బృందం ఏకంగా మూడు పతకాలతో మెరిసారు. ఆ ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో అవని లేఖరే ఏకంగా రెండు పతకాలు కైవసం చేసుకోగా.. టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భావినా పటేల్‌ మరో పతకం అందించింది. అవని లేఖరే 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో స్వర్ణం, 50మీ. రైఫిల్‌-3 పొజిషన్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. దీంతో ఒక పారా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు అందించిన భారత మహిళా షూటర్‌గా అవని రికార్డుల్లోకెక్కింది. ఇక భావినా పటేల్‌ టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ సి-4 విభాగంలో రజత పతకం ముద్దాడింది.
2024 పారా ఒలింపిక్స్‌ పారిస్‌ వేదికగా ఆగస్టు 28నుంచి సెప్టెంబర్‌ 8వరకు జరగనున్నాయి.
పారా ఒలింపిక్స్‌లో
మహిళా అథ్లెట్లకు దక్కిన పతకాలు..
2016(రియో) : దీపా మాలిక (రజత
పతకం) షాట్‌పుట్‌ ఎఫ్‌-53
2021(టోక్యో) : అవని లేఖరే (స్వర్ణం) 10మీ.
ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌-1
భావినా పటేల్‌ (రజతం)
టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ సి-4
అవని లేఖరే (కాంస్యం) 50మీ.
రైఫిల్‌-3పొజిషన్‌ ఎస్‌హెచ్‌-1
2024 పారా ఒలింపిక్స్‌లో భారత్‌ ప్రాతినిధ్యం..
క్రీడాంశం పురుషులు మహిళలు మొత్తం
ఆర్చరీ 3 3 6
అథ్లెటిక్స్‌ 28 10 38
బ్యాడ్మింటన్‌ 7 6 13
సైక్లింగ్‌ 1 1 2
జూడో 1 1 2
పారాకనోయింగ్‌ 1 2 3
పవర్‌లిఫ్టింగ్‌ 2 2 4
రోయింగ్‌ 1 1 2
షూటింగ్‌ 7 3 10
స్విమ్మింగ్‌ 1 0 1
టేబుల్‌టెన్నిస్‌ 0 2 2
తైక్వాండో 0 1 1
మొత్తం 52 32 84