హుస్నాబాద్ ఎమ్మెల్యేకు షాక్ తగలనుందా..?

నవతెలంగాణ – హుస్నాబాద్ 
 ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల  హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ వారి వారి అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించింది. ఇదే తరుణంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ కు షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా భూ నిర్వాసితులంతా నామినేషన్ వేనున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టులో నిర్వాసితులు అయినటువంటి గుడాటిపల్లి, తెనుగుపల్లి , సోమాజి తండా  ఇతర తండాల నిర్వాసితులు పరిహారం విషయమై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్,  పశువుల కొట్టాలు, ఇండ్లకు,కొంతమంది భూములకు పరిహారం ఇంకా అందలేదట. అంతేకాకుండా డబుల్ బెడ్ రూమ్ పథకం కింద 5 లక్షల రూపాయలు రావలసిన  ఎవరికి కూడా అధికారులు అందించకపోవడంతో వారు విసుగు చెందారు. అంతేకాకుండా రాత్రికి రాత్రి నిర్వాసితులపై దాడి చేసి  ఇల్లు ఖాళీ చేయించారని, రైతులకు బేడీలు వేయించారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ క్రమంలోనే నిర్వాసితులంతా రహస్యంగా సమావేశమై కామారెడ్డి, నిజామాబాద్ రైతుల మాదిరిగా మూకుమ్మడిగా సతీష్ కుమార్ కు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరి చూడాలి నామినేషన్ వేస్తారా లేదంటే  సతీష్ కుమార్ వారిని బుజ్జగిస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.