ఇక్కడే ముగిస్తారా?

ఇక్కడే ముగిస్తారా?  సిరీస్‌ విజయంపై రోహిత్‌సేన గురి
–  అఫ్గాన్‌తో భారత్‌ రెండో టీ20 నేడు
– రాత్రి 7 నుంచి జియోసినిమాలో..
నవతెలంగాణ-ఇండోర్‌ : మొహాలిలో చలిలో స్వల్ప స్కోర్లు నమోదు కాగా.. నేడు ఇండోర్‌లో వెచ్చని వాతావరణంలో భారీ స్కోర్లు లాంఛనమే. టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్‌ నేడు విజయంతో ఇక్కడే సిరీస్‌ విజయం ముగించాలని భావిస్తోంది. రోహిత్‌ శర్మకు తోడు విరాట్‌ కోహ్లి, యశస్వి జైస్వాల్‌ సైతం నేడు బరిలోకి దిగనున్నారు. ఇండోర్‌ టీ20లో భారత్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ లేకపోయినా.. అఫ్గాన్‌ జట్టు బలంగానే ఉంది. గ్లోబల్‌ టీ20, టీ10 లీగ్‌ల్లో క్రీయాశీలంగా ఆడే అఫ్గాన్‌ క్రికెటర్లు పొట్టి ఫార్మాట్‌లో బలమైన జట్టే. సిరీస్‌పై ఆశలు నిలుపుకునేందుకు అఫ్గాన్‌ నేడు అమీతుమీ తేల్చుకోనుంది.
విరాట్‌ వస్తున్నాడు : 14 నెలల విరామం అనంతరం విరాట్‌ కోహ్లి టీ20ల్లో ఆడనున్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. నేడు ఇండోర్‌లో టాప్‌ ఆర్డర్‌లో బ్యాట్‌ పట్టనున్నాడు. రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా వస్తాడా? నం.3 బ్యాటర్‌గా కనిపిస్తాడా అనేది చూడాలి. కోహ్లి, యశస్వి జైస్వాల్‌ రాకతో టాప్‌ ఆర్డర్‌లో ఇద్దరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. శుభ్‌మన్‌ గిల్‌, తిలక్‌ వర్మలకు తుది జట్టులో చోటు ఉండకపోవచ్చు. శివం దూబె, వాషింగ్టన్‌ సుందర్‌లతో బౌలింగ్‌ విభాగం బలం పెరగటంతో పాటు బ్యాటింగ్‌ లోతు పెరిగింది. నం.8 వరకు భారత్‌కు బ్యాటింగ్‌ బెంగ ఉండదు. నేటి మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.