– పుణెరితో తెలుగు టైటాన్స్ ఢీ నేడు
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ గత రెండు సీజన్లలో 44 మ్యాచుల్లో నాలుగు విజయాలే సాధించిన తెలుగు టైటాన్స్.. ఈ సీజన్లో అంచనాలను నిలబెట్టుకుంది!. సొంతగడ్డపై జరుగుతున్న తొలి అంచె మ్యాచుల్లో ఏకంగా నాలుగు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో తొలి అర్థభాగంలోకి అడుగుపెట్టింది. పవన్ సెహ్రావత్, ఆశీష్ నర్వాల్ కూతలో టైటాన్స్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. దీంతో తెలుగు టైటాన్స్‌పై అభిమానుల్లో మరోసారి అంచనాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ వేదికగా టైటాన్స్ తన చివరి మ్యాచ్‌ను నేడు ఆడనుంది. డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్‌తో టైటాన్స్ నేడు తలపడనుంది. టాప్ గేర్‌లో ఉన్న పల్టన్‌ను టైటాన్స్ నిలువరించి విజయంతో సొంతగడ్డ అంచెను ముగించేందుకు ఎదురుచూస్తుంది.