– మలేషియాతో భారత్ ఢీ నేడు
– గచ్చిబౌలిలో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్
– రాత్రి 7.30 నుంచి స్పోర్ట్స్18లో..
నవతెలంగాణ-హైదరాబాద్
భారత ఫుట్‌బాల్‌కు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. జనవరిలో వరుసగా రెండోసారి ఆసియా కప్‌లో పోటీపడిన భారత్.. జూన్‌లో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్ నుంచి నిష్క్రమించింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లోనూ దిగజారిన ‘బ్లూ టైగర్స్’.. సొంతగడ్డపై ఇంటర్‌కాంటినెంటల్ కప్‌ను సైతం చేజార్చుకుంది. కొత్త కోచ్ మనాలో మార్కెజ్‌పై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ.. జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరిసారి భారత ఫుట్‌బాల్ జట్టు మైదానంలోకి రానుంది. హైదరాబాద్‌లోని జిఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో నేడు మలేషియాతో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తలపడనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో మలేషియా, భారత్‌లు ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆసక్తిగా మారింది.
కుర్రాళ్లకు సవాల్
కోచ్ మనాలో మార్కెజ్ గత నాలుగేండ్లుగా హైదరాబాద్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. హైదరాబాద్ ఎఫ్‌సీ కోచ్‌గా మనాలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టైటిల్ సాధించాడు. కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పించి, ఫలితాలు రాబట్టడం మనాలో శైలి. కానీ ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో ఆ ప్రయోగం ఆశించిన ఫలితాలు అందించలేదు. అయినా, మనాలో మార్కెజ్ శైలిలో మార్పులేమీ రాలేదు. గత మ్యాచుల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని, కఠోర సాధన చేస్తున్న భారత జట్టు ఈ ఏడాదిని విజయంతో ముగించాలని ఎదురు చూస్తోంది. నేడు మలేషియాతో మ్యాచ్‌లో మైదానంలో ఆటగాళ్ల మార్పును మనాలో ఏ విధంగా చేస్తాడనే ఆసక్తి కనిపిస్తోంది. ‘మలేషియా భిన్నమైన జట్టు. ఈ సవాల్‌కు భారత్ కొత్తగా సన్నద్ధమైంది. గతంలో చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకున్నాం. ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొంటామనే దీమా ఉంది. చివరగా భారత్ ఇక్కడ మ్యాచ్‌కు అభిమానులతో స్టేడియం నిండిపోయింది. నేడు మలేషియాతో మ్యాచ్‌కు సైతం అభిమానుల నుంచి అదే స్థాయిలో మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను’ అని మనాలో మార్కెజ్ అన్నారు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ 125వ స్థానంలో, మలేషియా 133వ స్థానంలో కొనసాగుతున్నాయి. భారత కోచ్ మనాలో, మలేషియా కోచ్ మార్టిన్‌లు స్పెయిన్‌లోని బార్సిలోనా నగరానికి చెందిన వ్యక్తులు కావటం విశేషం.
ఘనంగా ఏర్పాట్లు
భారత్, మలేషియా ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌కు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) ఘనంగా ఏర్పాట్లు చేసింది. గతంలో ఇంటర్‌కాంటినెంటల్ కప్‌కు ఆతిథ్యం అందించిన గచ్చిబౌలి స్టేడియం ఇప్పుడు ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌కు అంతకుమించి ముస్తాబైంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌రెడ్డి ఇరు జట్ల ఆటగాళ్లతో కరచాలనం చేసి మ్యాచ్‌ను ఆరంభించనున్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుండగా.. సాయంత్రం 5.15 గంటల నుంచి స్టేడియంలో సంగీత కచేరి నిర్వహించనున్నారు.