– సిరీస్ విజయంపై భారత్ గురి
– భారత్, జింబాబ్వే నాల్గో టీ20 నేడు
– సాయంత్రం 4.30 నుంచి సోనీస్పోర్ట్స్‌లో..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ చాంపియన్ టీమ్ ఇండియా.. జింబాబ్వేపై పొట్టి సిరీస్‌పై కన్నేసింది. ఐదు మ్యాచుల సిరీస్‌ను నేడు నాల్గో మ్యాచ్‌లోనే ముగించాలని ఎదురుచూస్తుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న శుభ్‌మన్ గిల్ సేన.. 3-1తో టీ20 సిరీస్ సాధించాలని అనుకుంటుంది. తుది జట్టు కూర్పు గిల్‌కు సవాల్‌గా మారనుండగా.. భారత్, జింబాబ్వే నాల్గో టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-హరారే
టీ20 సిరీస్ సొంతం చేసుకోవటమే లక్ష్యంగా నేడు జింబాబ్వేతో నాల్గో మ్యాచ్‌కు టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. కానీ ఇదే సమయంలో శుభ్‌మన్ గిల్ నాయకుడిగా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందరికీ తుది జట్టులో చోటు ఉండాలనే తాపత్రయంలో మూడో టీ20లో జట్టు సమతూకం దెబ్బతిన్నది. నేడు అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా.. బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, బౌలర్ల ఎంపికలో వివేకం చూపించాల్సి ఉంటుంది. మరోవైపు జింబాబ్వే సైతం మరోసారి సంచలనం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
మార్పులు అవసరమే!
తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి గిల్ సేన వేగంగా పుంజుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు నమోదు చేసింది. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివం దూబె తుది జట్టులో రావటం జట్టును బలోపేతం చేసింది. కానీ ఇదే సమయంలో బ్యాటింగ్ లైనప్ ఓపెనర్ల మయంగా మారింది. యశస్వి జైస్వాల్, గిల్, రుతురాజ్, అభిషేక్ శర్మలు టాప్-4లో బ్యాటింగ్ చేశారు. సంజు శాంసన్, రింకూ సింగ్ వరుసగా నం.5, నం.6 స్థానాల్లో ఆడారు. దీంతో బౌలింగ్ లైనప్‌పై ఒత్తిడి పెరిగింది. అభిషేక్ శర్మ, శివం దూబె పరుగుల నియంత్రణ పాటించలేదు. దీంతో ఏడు ఓవర్లలో 39/5తో నిలిచిన జింబాబ్వే ఏకంగా 20 ఓవర్లలో 159/6తో మెరుగ్గా ముగించింది. డెత్ ఓవర్లలో బౌలర్లు మెరిసినా.. నేడు తుది జట్టులో మరో బౌలర్ అవసరం. టాప్-4లో ఓ బ్యాటర్‌పై వేటు వేసి.. అదనపు బౌలర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్‌లతో పాటు రవి బిష్ణోరు, వాషింగ్టన్ సుందర్ అంచనాలను అందుకున్నారు. భారత్ నేడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
పుంజుకుంటారా?
ఆతిథ్య జింబాబ్వే మరో విజయంపై కన్నేసింది. ఆ జట్టులో బ్యాటింగ్ లైనప్ నిలకడగా రాణించటం లేదు. టాప్‌లో మెరిస్తే.. మిడిల్‌లో చేతులెత్తేస్తున్నారు. మిడిల్‌లో రాణిస్తే.. టాప్ నిరాశపరుస్తుంది. బ్యాటర్లు సమిష్టిగా ఆడితే మరో విజయం సాధించగలమనే నమ్మకం ఆ జట్టులో ఉంది. భారత స్పిన్నర్లు రవి బిష్ణోరు, వాషింగ్టన్ సుందర్ ఓవర్లను కాచుకుని.. ఇతర బౌలర్లపై ఎదురుదాడి చేసేందుకు ఆ జట్టు ప్రణాళిక రచిస్తోంది. కెప్టెన్ సికిందర్ రజా స్థాయికి తగ్గ ప్రదర్వన చేయాల్సి ఉంది. బ్రియాన్ బెనెట్, మేయర్స్, కాంప్‌బెల్ సహా క్లైవ్ రాణిస్తున్నారు. బౌలర్లు సైతం కలిసికట్టుగా ఒత్తిడి పెంచితే.. భారత్‌ను స్వల్ప స్కోరుకు పరిమితం చేయవచ్చని జింబాబ్వే భావిస్తోంది.
పిచ్, వాతావరణం
హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ విలక్షణంగా స్పందిస్తుంది. ఆరంభంలో పేస్, బంతి మెత్తబడిన తర్వాత స్పిన్‌కు అనుకూలిస్తుంది. బ్యాటర్లు పిచ్‌ను అర్థం చేసుకోకుండా ఎదురుదాడి చేస్తే.. మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్‌కు స్పిన్నర్లు రవి బిష్ణోరు, వాషింగ్టన్ సుందర్ ఓవర్లు కీలకం కానున్నాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది.
ఆటగాళ్ల రొటేషన్?!
భారత్, జింబాబ్వే సిరీస్ షెడ్యూల్‌ను కాస్త కఠినంగా రూపొందించారు. తొలి రెండు మ్యాచులను వరుస రోజుల్లో షెడ్యూల్ చేయగా.. చివరి రెండు మ్యాచులను వరుసగా శని, ఆదివారాల్లో నిర్వహించనున్నారు. దీంతో ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి అందించటం కోసం టీమ్ ఇండియా రొటేషన్ పాలసీ అమలు చేసే అవకాశం ఉంది. నేడు ఆడిన ఆటగాళ్లకు చివరి మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచన డ్రెస్సింగ్‌రూమ్‌లో కనిపిస్తుంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, రింకూ సింగ్, శివం దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోరు, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్.
జింబాబ్వే: వెస్లీ, మారుమని, బ్రియాన్ బెనెట్, డయాన్ మేయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జొనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండె, వెల్లింగ్టన్ మసకద్జ, బ్లెస్సింగ్ మజరబాని, రిచర్డ్, చతార.