నెగ్గుతుందా..వీగుతుందా..?

Navatelangana,Adilabad,Telugu News,Telangana, నేడే మున్సిపల్‌ వైస్‌ ఛైర్మెన్‌పై అవిశ్వాస సమావేశం శ్రీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలు
– వేడెక్కిన ఆదిలాబాద్‌ మున్సిపల్‌ రాజకీయం శ్రీ రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ
ఆదిలాబాద్‌ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మెన్‌పై అవిశ్వాస సమావేశం ప్రక్రియ సమయం రానే వచ్చింది. నేడు ఉదయం 11గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలో ఈ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ వ్యవహారానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీలు ఎవరికి వారు ఈ అవిశ్వాసాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆదిలాబాద్‌ రాజకీయాలు వేడెక్కాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా..వీగిపోతుందా అనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఇదే ప్రధాన అంశంగా చర్చలు సాగుతుండటం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే క్యాంపులకు వెళ్లిన ఆయా పార్టీలకు చెందిన కౌన్సిలర్లు నేటి ఉదయం జిల్లా కేంద్రానికి తిరిగి వచ్చి ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఎటువైపు మొగ్గుచూపుతారోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ పురపాలక రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. బీఆర్‌ఎస్‌ తరపున కౌన్సిలర్‌గా గెలిచి వైస్‌ ఛైర్మెన్‌గా పదవిలో కొనసాగుతున్న జహీర్‌రంజానీ ఇటీవల అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో ఆయన్ను పదవి నుంచి దింపేసేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీలు నిర్ణయించాయి. ఆయనపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన కౌన్సిలర్లు 33మంది సంతకాలతో జిల్లా కలెక్టర్‌కు తీర్మాణం ప్రతిని అందించారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ఈ నెల 18న అవిశ్వాస తీర్మాన సమావేశానికి తేదీ ఖరారు చేశారు. అవిశ్వాసం నెగ్గి వైస్‌ ఛైర్మెన్‌ను పదవి నుంచి దించేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రయత్నం చేయగా.. అవిశ్వాసం వీగిపోయేలా కాంగ్రెస్‌ అదే పట్టుదలతో ఉంది. ఈ వ్యవహారాన్ని మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. కౌన్సిలర్లను కాపాడుకోవడంలోనూ ప్రధాన పార్టీలు దృష్టిసారించడం చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల క్రితమే బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లగా.. బీజేపీ, కౌన్సిలర్లు కూడా ఇటీవల శిబిరాలకు తరలివెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వీరంతా సమావేశంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం జిల్లా కేంద్రానికి రానున్నారు.
సర్వత్రా ఉత్కంఠ..!
పురపాలక ఉపాధ్యక్షుడిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణం నెగ్గుతుందా..వీగిపోతుందా అనే అంశం జిల్లావ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటిలో 49వార్డులు ఉండగా ఇందులో 24మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, 11మంది బీజేపీ, కాంగ్రెస్‌ 05, ఎంఐఎం 05మంది, స్వతంత్ర కౌన్సిలర్లు మరో నలుగురు విజయం సాధించారు. ఇందులో వివిధ పార్టీలకు చెందిన కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఇద్దరు కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన కాపీపై సంతకం చేసిన వారు ఉండగా.. మరో ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌ నుంచి తిరిగి బీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 13మంది కౌన్సిలర్లు ఉండగా ఎంఐఎంకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు తటస్థంగా ఉండనున్నట్లు తెలిసింది. మరోపక్క బీఆర్‌ఎస్‌కు 19మంది, బీజేపీకి ఎమ్మెల్యేను కలుపుకొంటే 10మంది, కాంగ్రెస్‌ నుంచి సంతకాలు చేసిన వారు ఇద్దరు, కాంగ్రెస్‌ నుంచి తిరిగి బీఆర్‌ఎస్‌ శిబిరానికి వచ్చిన ముగ్గురు కౌన్సిలర్లతో ప్రస్తుతం వీరి సంఖ్య 34కి చేరినట్లు తెలిసింది. అవిశ్వాసం నెగ్గాలంటే 33మంది సభ్యుల బలం ఉంటే సరిపోతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎవరు ఎటు వైపు మద్ధతు తెలుపుతారనే విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారుతోంది.ఉదయం 11గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.