కాళేశ్వరం ముంచనుందా..?

Kaleswaram Will you dip..?– వేగుల నివేదికతో బీఆర్‌ఎస్‌ గాబరా
– ప్రభుత్వంపై ప్రభావం
– ఆ నలుగురిలో కలవరం
సాధారణంగా అధికారంలో ఉన్న ఏపార్టీ అయినా ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు తన నిఘావర్గాల(ఇంటెలిజెన్స్‌)తో సర్వేలు చేయించుకుంటుంది. వేగులకు తరచుగా పనిచెబుతుంటుంది. పనితీరు, పథకాల అమలు, మంత్రులు, ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో నెలకొన్న అభిప్రాయాలు, సచివాలయం, హెచ్‌వోడీల్లోని అధికారిక కార్యక్రమాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తుంది. కనీసం నెలలో రెండు, మూడుసార్లు అయినా ఇంటెలిజెన్స్‌వర్గాలకు ఆయా టాస్క్‌లు ఇస్తుంది. ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా ఉంటుంది. ఆ నిఘా వర్గాల సమాచారాన్ని విశ్లేషించుకుంటుంది. ఇప్పుడు ఆ నిఘావర్గాల నివేదికే అధికార పార్టీని కలవరపరుస్తున్నట్టుగా తెలుస్తోంది.
బి.బసవపున్నయ్య
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న నిర్మాణ పగుళ్లు బీఆర్‌ఎస్‌ చాపకిందికి నీళ్లు తేనున్నాయని ఇంటెలిజెన్స్‌ నివేదిక చెబుతున్నట్టుగా ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే దక్షిణ తెలంగాణలో గులాబీ సర్కారుపై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో, లక్ష్మిబ్యారేజీలో చోటుచేసుకున్న నిర్మాణ అవకతవకలు ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావమే చూపనున్నాయనే నిఘావర్గాల హెచ్చరికలు ప్రభుత్వాధినేతకు వెళ్లాయి. ఈనేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో కీలకమైన ఆ నలుగురూ కలవరపడుతున్నట్టుగా సమాచారం. రిటైర్డ్‌ ఇంజినీర్లు సైతం కాళేశ్వరం నిర్మాణం విషయంలో ఇటు సాగునీటి శాఖను, అటు ప్రభుత్వాధినేతలను తప్పుబడుతున్నారు. బ్యారేజీ నిర్మాణం ప్రమాణాల ప్రకారం కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం కొనసాగిందనీ, అక్కడ ఇంజినీర్లు నామమాత్రమే అయ్యారనే ప్రచారం జలసౌధలో జోరుగానే వినిపిస్తున్నది.. చేతులు కాలాక ఆకులుపట్టుకుంటే ఏం లాభం ? వినాల్సిన సమయంలో వినకుండా అంతా అయ్యాక ఇప్పుడు గగ్గోలు పెడితే ప్రయోజనం ఏంటనే ప్రశ్నలు విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. కాళేశ్వరాన్ని కేవలం రెండేండ్లల్లో పూర్తిచేసి చరిత్ర సృష్టించామని జబ్బలు చరుచుకుంటున్న లార్సన్‌ అండ్‌ టూబ్రో(ఎల్‌అండ్‌టీ) కంపెనీ ఇప్పుడు నెత్తినోరూ కొట్టుకుంటున్నది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌ ప్రకారమే తామ నిర్మించామని పైకి చెబుతున్నా, అంతర్గతంగా సాగునీటి ఇంజినీర్లతో మరోరకమైన వాదనలకు దిగినట్టు సమాచారం. నష్టాన్ని తాము భరించి త్వరలో సంబంధిత పిల్లర్లను పున:నిర్మిస్తామని అంటున్నా ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదనే సమాచారం కూడా ఇంటెలిజెన్స్‌ నుంచి పెద్దాయనకు చేరింది. బ్యారేజీ నిర్మాణంలో చోటుచేసుకున్న సాంకేతిక, నిర్మాణ లోపాలు ఇప్పుడు ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌కు పరీక్ష పెడుతున్నాయి. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మెన్‌ అనిల్‌జైన్‌ జలసౌధలో తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌, కాళ్వేశరం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. ఆ సమావేశంలో వాతావరణాన్ని బట్టి లక్ష్మిబ్యారేజీకి స్వల్ప మరమ్మత్తులు కాకుండా భారీగానే చేయాల్సి ఉంటుందనీ, వందల కోట్ల వ్యయం కానుందనే గుసగుసలు జలసౌధలో చోటుచేసుకుంటున్నాయి. అలాగే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ప్రభావం ప్రజలపై పెద్దగా పడలేదని ప్రభుత్వానికి వేగుల సమాచారం అందజేసినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్‌ ఇటీవల ‘ నేను ఓడిపోతే రెస్ట్‌ తీసుకుంటా..” అని ప్రచారసభల్లో చెప్పడం కూడా తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేశాయని వేగుల నుంచి వినికిడి. ఇకపోతే మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆంధ్రాలోని అమరావతి పరిస్థితే ఎదురవుతుందని చెప్పడం కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ చర్చకు దారితీసిందని తెలిసింది. సెంటిమెంట్‌ను క్యాష్‌చేసుకోవడంలో తొలినుంచే అందెవేసిన చేయి అయిన బీఆర్‌ఎస్‌ నేతలు, ఇప్పుడు కొన్ని విషయాల్లో తడబడటానికి ప్రజల్లో చోటుచేసుకుంటున్న విభిన్న పరిణామాలే కారణమని చెబుతున్నవారూ ఉన్నారు.