కేటీఆర్‌ వచ్చారు.. ఇప్పుడైనా కరుణిస్తారో.. లేదో…?

– భేటీ కోసం అనుయాయులు, ఆశావహుల ఆతృత
– ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మంత్రి
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
ఇరవై రోజుల విదేశీ పర్యటన అనంతరం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఇప్పటి వరకూ ఆయన రాక కోసం ఎదరు చూసిన అనుయాయులు, ఆశావహు లకు ఇప్పుడు ప్రాణం లేచి వచ్చింది. అయితే మంత్రి మాత్రం ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపో వటం గమనార్హం. వాస్తవానికి గత నెల 21న బీఆర్‌ఎస్‌ తొలి జాబితాను ప్రకటించ టానికి రెండు రోజుల ముందే కేటీఆర్‌ అమెరికా బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో జాబితాలో చోటు దక్కని వారు, పోటీ చేయాలని ఆశపడుతున్న యువ నేతలు, ఇతర ఆశావహులు ఆయన తిరిగొచ్చాక చర్చలు, సమాలోచనలు జరిపి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయిం చుకున్నారు. బొంతు రామ్మోహన్‌, బేతి సుభాష్‌రెడ్డి (ఉప్పల్‌), పోచంపల్లి శ్రీనివాసరెడ్డి (జనగామ), నీలం మధు (పటాన్‌చెరు), ఢిల్లీ వసంత్‌ (జహీరా బాద్‌), శశిధర్‌రెడ్డి (కోదాడ) తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. వీరితోపాటు హరీశ్‌రావుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ (జహీరాబాద్‌), పల్లా రాజేశ్వరరెడ్డి (జనగామ) తదితరులు కూడా కేటీఆర్‌ రాక కోసం ఎదురు చూశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితులైన మరికొందరు నేతలు కూడా టిక్కెట్‌ను ఆశించారు. వీరందరూ కేటీఆర్‌ను కలిసేందుకు క్యూ కట్టారు. కానీ ఆయన మాత్రం ఎవ్వరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని తెలిసింది. ఇదే సమయంలో మేఘా లయ సీఎం సంగ్మా గురువారం ప్రగతి భవన్‌కు వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికిన వారిలో కేటీఆర్‌ కూడా ఉన్నారు. మరోవైపు ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పట్నం మహేందర్‌రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందిం చిన సంగతి విదితమే.