సింగరేణికి బలం అవుతా..

Will Singareni be strong..– కొత్త గనుల నిర్మాణానికి ఏర్పాట్లు
– మన బొగ్గుకు మంచి డిమాండ్‌
– ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న థర్మల్‌ పవర్‌ ఉత్పత్తి
– డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాలి
– వర్క్‌ కల్చర్‌ పెరిగితేనే అది సాధ్యం
– స్థానిక యువతకు ఉపాధి కల్పన కార్యక్రమాలు
– స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ ప్రోగ్రాంపై అధ్యయనం : ‘నవతెలంగాణ’తో సింగరేణి సంస్థ సీఎండీ బలరాం
”బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఖ్యాతి పొంది, దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ మనుగడ కోల్పోకుండా ఆ సంస్థను కాపాడుకునే బలాన్ని అవుతా.. ప్రపంచ వ్యాప్తంగా థర్మల్‌ పవర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. దేశంలో సింగరేణి బొగ్గుకు మంచి డిమాండ్‌ ఉంది. శతాబ్దాధిక చరిత్ర కలిగిన సింగరేణి కాపాడుకునేలా రక్షణ చర్యలు చేపడతా” అని సింగరేణి సంస్థ సీఎండీ బలరాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఈ సంస్థ రెండో సీఎండీగా బాధ్యతలు చేపట్టి, గనుల పరిశీలన, కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు మొదటిసారిగా రామగుండం ప్రాంతానికి వచ్చిన బలరాంతో ‘నవతెలంగాణ’ ముఖాముఖి నిర్వహించింది.
నవతెలంగాణ – కోల్‌సిటీ
నవతెలంగాణ : సింగరేణిలో మీరు గుర్తించిన సమస్యలు ?
సీఎండీ : సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటు అవసరం. ఇప్పుడు ఉన్న గనుల నుంచి 2029 -30 వరకు బొగ్గు ఉత్పత్తి చాలా అధిక స్థాయిలో ఉంటుంది. 80 నుంచి 90 మిలియన్‌ టన్నుల వరకు ఉత్పత్తి కొనసాగి.. అనంతరం ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పటిలోగా కొత్త గనులను గుర్తించాలి. కొత్తగనుల నిర్మాణంపై అధ్యయనం కొనసాగుతోంది. ఇప్పటికే ఇల్లందు, కోయగూడెం, శ్రావణపల్లి, సత్తుపల్లి ప్రాంతాన్ని సందర్శించి కొత్త బొగ్గు బ్లాకుల నిర్మాణంపై పరిశీలన చేస్తున్నాం. ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే గనుల వేలానికి వెళ్లే ఆలోచన సైతం చేస్తున్నాం. నష్టాలు లేకుండా సంస్థను నడిపించేలా కృషి చేస్తున్నాం. రష్యా, ఉక్రెయిన్‌తోపాటు యూరోపియన్‌ దేశాల్లో ప్రస్తుతం థర్మల్‌ పవర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ నెలకొంది.
నవతెలంగాణ: గత ప్రభుత్వం సింగరేణికి పెట్టిన బకాయిలపై దృష్టి సారించారా?
సీఎండీ : గత ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసిన విద్యుత్‌తోపాటు బొగ్గుకు సంబంధించిన బకాయిలు రావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వంతో చర్చించాం. మంత్రుల ఆధ్వర్యంలో సమీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. ప్రస్తుతం ఎప్పటికప్పుడూ ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు అందుతోంది.
నవతెలంగాణ : సింగరేణి గనులను పెంచుకునే అవకాశం ఉందా?
సీఎండీ : తెలంగాణలోని కొత్త బొగ్గు గనుల ఏర్పాటు, బొగ్గు వెలకితీతపై హక్కు ఇక్కడి స్థానిక సంస్థ అయిన సింగరేణికే ఉంటుందని నిజాం హయాంలో చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయి. ఆ మేరకు కృషి చేస్తే కొత్త గనులకు అవకాశం ఉంది. చాలా బొగ్గు బ్లాకులు మనకు అందుబాటులో ఉన్నాయి. కోయగూడెంలాంటి ప్రాంతంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం. బయటవారి కంటే సింగరేణి బొగ్గును ఉత్పత్తి చేయడం ఇక్కడ చాలా సులువు. పాత గనులకు అనుబంధంగా చాలా కొత్త బ్లాకులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉపాధి, బొగ్గుకు కొదువలేదు. ఒరిస్సా ప్రభుత్వం అక్కడి నైనీ బొగ్గు బ్లాకులను సింగరేణి ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.
నవతెలంగాణ : కార్మికుల సంఖ్యను పెంచేందుకు ఏ చర్యలు చేపట్టబోతున్నారు?
సీఎండీ : అండర్‌ గ్రౌండ్‌ గనుల్లోనే కార్మికుల సంఖ్య అధికంగా ఉంది. ఈ మైన్లలో ఆదాయం కంటే బొగ్గు ఉత్పత్తికే అధిక వ్యయం అవుతోంది. రూ.10 వేలు ఖర్చు చేస్తే రూ.4వేలలోపే ఆదాయం వస్తోంది. కోల్‌ ఇండియాలో సైతం రోజురోజుకూ కార్మికుల సంఖ్య తగ్గుతోంది. ప్రత్యమ్నాయ ఉపాధి, ఆదాయ వనరుల మార్గాలను అన్వేషిస్తున్నాం. దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. కార్మికులు వర్క్‌ కల్చర్‌ను అలవర్చుకొని, పనిలో నాణ్యత పెంచితే సంస్థను అందరం కలిసి కాపాడుకోవచ్చు.
నవతెలంగాణ: కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏ చర్యలు తీసుకోబోతున్నారు?
సీఎండీ : కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్‌ గ్రీవెన్స్‌ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాం. దీంతో కార్మికులు ఎవరూ కొత్తగూడెం వరకు వచ్చే అవసరం ఉండదు. శిథిలమైన క్వార్టర్లను పరిశీలించాం. రామగుండం రీజియన్‌ పరిధిలో 4వేల వరకు శిథిలమైన క్వార్టర్లు ఉన్నాయి. 18వందల వరకు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. వాటిపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తాం.
నవతెలంగాణ : సింగరేణి ఆస్పత్రులపై ఆధునికీకరణకు ఎం చేయబోతున్నారు.
సీఎండీ : సింగరేణి ఆస్పత్రుల్లో ఉన్న సౌకర్యాలను మరింత మెరుగు పర్చుతాం. ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్‌ చేసే కేసులను తగ్గించేలా సూపర్‌ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం. దీనికి అనుగుణంగా క్యాథల్యాబ్‌, ఈఎమ్‌ఆర్‌ ఐ, సిటీ స్కాన్‌, కార్డియాలజీ లాంటి సేవలు అందేలా గోదావరిఖని, కొత్త గూడెంలో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టేలా చర్య తీసుకుంటాం. ఆరు నెలల్లో దీనిని అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం.
నవతెలంగాణ : 80శాతం స్థానికులకే కాంట్రాక్టు ఉద్యోగాలు ఎలా అమలు చేయబోతున్నారు ?
సీఎండీ : ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా 80 శాతం కాంట్రాక్టు ఉద్యోగాలను స్థానికులకు ఇస్తాం. దానికి అనుగుణంగా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ ప్రొగ్రాంలను రూపొందిస్తున్నాం. దీనిలో భాగంగా నవభారత్‌, జీఎంఆర్‌ సంస్థలు చేపడుతున్న కొన్ని కార్యక్రమాలను పరిశీలించాం. వాటిలో హౌస్‌ హోల్డ్‌ సర్వీసెస్‌లో భాగంగా ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, ప్లంబర్‌, ఆర్క్‌ అండ్‌ గ్యాస్‌ వెల్డింగ్‌, ఏసీ, రిఫ్రిజిరేషన్‌ రిపేరింగ్‌, మోటర్‌ మెకానిక్‌, డీటీపీ, బ్యూటీఫికేషన్‌, ఎంబ్రాయిడరీ, సోలార్‌ టెక్నీషియన్‌, డ్రోన్‌ టెక్నీషియన్‌, జ్యూట్‌ బ్యాగుల తయారీ, అర్టిఫిషియల్‌ ఇంటిలెజెన్సీ, సోలార్‌ టెక్నీషియన్‌, ఈవీ వెకిల్స్‌, ఆటో క్యాడ్‌ లాంటి 20కోర్సులను గుర్తించాం దానికి అనుగుణంగా 10కోర్సులను మొదట ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని యువతకు స్టైఫండ్‌ సైతం అందేలా చర్య తీసుకుంటాం.
సింగరేణి ఆర్జీ-1 ఏరియాలో పర్యటించిన సీఎండీ – ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి :సీఎండీ ఎన్‌.బలరాం నాయక్‌
సింగరేణి సీఎండీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎన్‌.బలరాంనాయక్‌ పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీ-1 ఏరియాలో శనివారం విస్తృతంగా పర్యటించారు. ఆయనను బంగ్లాస్‌ ఏరియా వద్ద ఆర్జీ-1 జీఎం చింతల శ్రీనివాస్‌ పూలబొకే అందజేసి, శాలువాతో సన్మానించారు. అనంతరం జీడీకే-2వ భూగర్భ గనికి వెళ్లి అక్కడ బొగ్గు ఉత్పత్తి, రక్షణ చర్యల గురించి చర్చించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం సంస్థ ఎల్లప్పుడూ పాటు పడుతుందని, ఉద్యోగుల అవసరాలకు తగ్గట్టు అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతుందని అన్నారు. కార్మికులకు శాశ్వత తాగునీటి కోసం త్వరలో రాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్‌ నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు.
సంస్థ ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి మ్యాపు ద్వారా చర్చించారు. నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. ఆర్జీ 1, 2, 3, ఎఎల్‌పీ, శ్రీరాంపూర్‌ ఏరియాల జీఎంలతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను తెలుసుకొని సూచనలు, సలహాలు ఇచ్చారు.వారి వెంట జీఎం పర్సనల్‌ (ఐఆర్‌పీఎం) బి.హనుమత్‌రావు,ఆర్జీ-2 జీఎం ఎల్‌వీ. సూర్యనారాయణ, ఆర్జీ-3 జీఎం ఎన్‌.సుధాకర్‌ రావు, ఎపీఎ జీఎం కె.వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం సంజీవ రెడ్డి, జీఎం సేఫ్టీ ఆర్జీ రీజియన్‌ ఎస్‌.సాంబయ్య, ఎస్‌ఓటు జీఎం రాం మోహన్‌, ఎజీఎం పర్సనల్‌ లక్ష్మి నారాయణ, ఇతర అధికారులు తదితరులున్నారు.