జానపద కళారూపాల్లో సామూహిక నత్యాల్లో మతపరమైన, కులపరమైన కళారూపం గొరవయ్యల నత్యం. 12 వ శతాబ్దం నాటి వీరశైవారాధన గొరవయ్యల పుట్టుకకు కారణమని పండితుల అభిప్రాయం. మైలార దేవుడు రాక్షసులను చంపడానికి వేసుకున్న వేషమే గొరవయ్యలు వేసుకుంటారు. కంబళితో చేసిన పెద్ద అంగరఖా. ఇది మెడ నుండి పాదాలదాకా ఉంటుంది. నడుముకు పట్టీ, ఎలుగుబంటి చర్మంతో చేసిన ఎత్తైన టోపీ, మెడలో కంటె, గవ్వల దండ, కుడి చేతిలో డమరుకం, ఎడమ చేతిలో పిల్లంగోవి, నడుముకు జింక చర్మంతో చేసిన బండారు తిత్తి. ఈ వేషంతో వీరు వీధుల్లో తిరుగుతూ ఇల్లిల్లు తిరుగుతూ భిక్షాటన చేస్తారు. జమ్మలమడుగు ప్రాంతంలో దసరా ఉత్సవాల్లో భాగంగా గొరవయ్యలు నత్య ప్రదర్శనలు ఇస్తారు.
కురవల చరిత్ర- సంస్కృతి గురించి వివరంగా చర్చించిన నవల రాసాని ‘కపిరి’. ఇందులో దేవుడిని నమ్ముకున్న కొంతమంది కురవలు శివరాత్రికి ముందు శివదీక్ష తీసుకుంటారని చెబుతున్నా, ఈ గౌరవ దీక్షను కుల పెద్ద నిర్ణయించిన ఏ రోజైనా తీసుకోవచ్చు. అదే పలస్తరం ( పర స్థలం) గా పిలుచుకునే వలస దీక్ష. ఇది ఒక పవిత్ర దీక్ష. ఈ దీక్ష తీసుకున్న వాళ్లను గొరవయ్యలు అంటారు. వీరు ఆడోళ్ళు వండిన కూడు స్వీకరించకూడదు. ధాన్యం మాత్రమే తీసుకోవాలి. తప్పుడు పనులు చేయకూడదు. తప్పుడు మాటలు మాట్లాడకూడదు.
గొరవయ్య వేషధారణ ఎలా ఉంటుందంటే- గొరవయ్యగా మారిన రాయప్ప ఆరు మూర్ల అడ్డపంచెను తీసి గోసి పోసి నడుముకు బిగించుకుంటాడు. పీటపై ఉన్న గజ్జల్ని తీసి కాళ్లకు కట్టుకుంటాడు. ఆ తర్వాత దండం పైన నుంచి గాడా గుడ్డతో కుట్టి ఉన్న చొక్కా తీసి తొడుక్కుంటాడు. పీట పైనున్న కంబడి గౌనుని తీసి దానిపైన తొడుక్కుంటాడు. పొడుగు చేతుల ఆ గౌను రెక్కల వైపు ఎర్రటి గుడ్డ పీలికలతో కుట్టిన త్రిశూలం నిగనిగలాడుతుంది. దానిపైన మెడ పట్టిలు, రొమ్ము మీదుగా గవ్వల పట్టీ బిగించుకుంటాడు. నడుముకు వెడల్పాటి బెల్టులా కుట్టిన ఎర్రటి గుడ్డను బిగిస్తాడు. ఎలుగ్గొడ్డు కుళాయిని చేతుల్లోకి తీసుకొని, కళ్ళకు అద్దుకొని” జై మార్తాండ మైలార లింగేశ్వర” అని తల పైన పెట్టుకుంటాడు. అది సరిగ్గా తలకు సరిపోయింది. మెడకు బండారు జోలెను, సంకకు మరో జోలిని తగిలించుకుంటాడు. ఆ తర్వాత ఎడమ చేతికి నిలువు పిల్లంగట్టె ని తీసి పట్టుకొని ఢమరుకాని చేతుల్లోకి ఎత్తుకొని, దానికి శిరస్సును తాకించి ”ఓం కాలభైరవ! సిద్దేశ్వరా” అని మనసులో శివుని స్మరించి డబడబక్క్ డబడబక్క్ అంటూ ఢమరుకం ఒకసారి వాయించి ”ఇది మన ఆచారం, మన సంప్రదాయం” అంటూ శివరాత్రికి ఐదు ఆరు నెలల ముందు నుంచి గొరవయ్యలు పరస్తలం(వలస) యలబారుతారు. పల్లె పల్లె తిరుగుతా, గింజలు అడుక్కుంటా శివరాత్రి నాటికి తంబళ్లపల్లి మల్లన్న కొండకు పోయి, ఆడ బండ పైన రెడ్డెమ్మ పాడవంలో పాలు తాగి కపిరి కడుక్కొని, మల్లన్న స్వామిని దర్శించుకొని దీక్ష వదిలి రావాలి. ఇందులో కురవ గొరవయ్యలు ఎలుగుబంటి చర్మంతో చేసిన కుళాయిని ధరిస్తే , మాదాసి కురవలలోని గొరవయ్యలు ఉన్నికుళాయి ధరిస్తారని క్షేత్ర పర్యటనల ద్వారా తెలిసిన విషయాన్ని రచయితగా రాసాని నిర్ధారిస్తున్నారు.
గొరవయ్యలు భక్తుల కోరికపై వాళ్ళ ఇండ్లకు వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఒగ్గు సేవలు జరిపించి, వాళ్ళు ఇచ్చే దక్షిణల్ని తీసుకొని దీవెనలు పలికి పోతుంటారు. పూజా కార్యాలు లేని సమయంలో ఒక్కొక్కరుగా గాని గుంపు గుంపుగా గాని భిక్షాటనకు పోతుంటారు.
తర తరానికి గొరవయ్యల సంఖ్య తగ్గిపోతూ, ఈ కాలానికి కొన్ని పదుల మందే మిగిలారు. వాళ్ళ సంఖ్యను పెంచాల్సిన బాధ్యత గణాచారిది. ఈ సంప్రదాయమే కురవల ఉనికిని చాటుతుంది. ఈ సంప్రదాయమే ఆదికాలం నుంచి వస్తున్న శివ తత్వాన్ని తెలియజేస్తుంది.
వీరి సంప్రదాయాన్ని తద్వారా, వీరి ఐక్యతను దెబ్బతీయడానికి అగ్రవర్ణాల వారు పన్నని కుట్ర లేదు. తమ చెప్పు చేతుల్లో లేని కురవగొల్లల్ని దెబ్బ కొట్టడానికి, వారి ప్రత్యేక సంస్కతికి చెందిన గొరవ సంప్రదాయాన్ని దెబ్బ కొట్టాలని శ్రీశైలంలోను, తంబళ్లపల్లి మల్లన్న గుడిలోనూ దేవాదాయ శాఖ వారి సహకారంతో ఒక కొత్త జీవో సష్టించగలిగారు. అదేమిటంటే అరుదైన గొరవ జానపద సాంస్కతిని రక్షించడం ప్రభుత్వం వంతనీ, అందులో భాగంగా ప్రతి గొరవయ్యకు సంవత్సరానికి ?1000 శివరాత్రి రోజున ఇప్పిస్తామనీ, అయితే అది కేవలం 50 మందికేనని చట్టం. దీనితో కొన్ని వేల మంది ఉన్న గొరవయ్యల్లో కేవలం 50 మందికిప్పించడం వెనక ఉన్న కుట్ర, సంస్కతి పేరుతో ఒకటిగా ఉన్న వారి ఆచారాన్ని దెబ్బ కొట్టి వారి ఐక్యతను విచ్చిన్నం చేయడం, వాళ్ళ అస్తిత్వాన్ని లేకుండా చేయడం. పైకి జానపద సంస్కతి సంరక్షణ, లోపల దాని నాశనానికి పథకాలు వేయడం.
రేవణ సిద్దేశ్వరుడి కాలం నుండి ఇప్పటివరకు గొరవయ్యలు అంటే ఎంతో భక్తి గౌరవం ఉండేది. గొరవయ్యలు వీధిలోకి వచ్చి ఆట ఆరంభించినారంటే చాటలు చాటలుగా ధాన్యం వచ్చి పడేది. జనాల నుంచి గొరవయ్యలు పూజలు అందుకునేవాళ్లు. కాలం మారిపోయింది. కరువుల మీద కరువులు వచ్చి పడతున్నాయి. వ్యవసాయం దెబ్బతినిపోయింది. చదువులు ఎక్కువైపోయాయి. కులవత్తులు, కులాచారాలు జనాలు వదిలేస్తా ఉన్నారు. కులవత్తుల స్వరూప స్వభావాలే మారిపోయాయి. అన్ని కులాల వాళ్ళు ముందుకెళ్ళిపోతా ఉంటే సంచార జాతులుగానే ఉండిపోయేట్టుగా చేసి ఈ ఆచారాన్ని పట్టుకొని ఇంకా వేలాడడం ఎందుకు? ”మన పిల్లలు బాగా చదువుకోవాలి, పైకి ఎదగాలి. అందరి చేత ఇంకా తక్కువగా చూడబడే ఈ గొరవ దీక్షలతో, ఈ వలస జీవనంతో ఏం పని? ఎంత కాలమని ఎక్కడేసిన కంబళి లాగానే బతకాలి. మారాల్సింది, మనము మారాల్సిందే అంతగా కావాలంటే ఆ ఆచారాన్ని కళగా మార్చుకుందాం. పండుగల్లో, పబ్బాలలో, వేడుకల్లో ప్రదర్శిస్తా నిలబెట్టుకుందాం. ఆ కళకు జాతీయస్థాయిలో, ఇంకా కావాలంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేట్టుగా చేసుకుందాం” అని తీర్మానించుకోవడంతో ఈ నవల ముగుస్తుంది.
గొల్లలను, కురుమలను కలిపి మొదటి నుండి గొల్ల కురుమలుగానే పిలుస్తుంటారు. వీళ్లు ఒకే కుదురు నుండి వచ్చిన అన్నదమ్ములని కుల పురాణాలు కూడా నొక్కి చెబుతుంటాయి. బర్లు, ఆవులు మేపే వాళ్లను గొల్లలని-.గొర్రెలను మేపే వాళ్లను కురమలని ప్రత్యేకంగా వ్యవహరిస్తుంటారు. ఆవులు బర్లను మేపుకునే గొల్లలు ఆర్థికంగా బలపడటంతో వ్యాపార, రాజకీయ రంగాలలోకి దూసుకు రాగలిగారు. కురుమల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి లాగే ఉండిపోయింది. దాంతో గొల్లలు తాము అధికులమనీ, కురమలు తమకంటే కింది జాతి వాళ్ళనే వాదనను ముందుకు తెచ్చారు. అందువల్ల గొల్లలు,కురుమల మధ్య కంచం పొత్తు, మంచం పొత్తు లేకుండా పోయింది.
”కపిరి” నవల లో కురుమ కదిరప్ప, గొల్ల పాలేటమ్మ ప్రేమించుకుంటారు. పెళ్లి చేయమని పెద్దలను అడిగితే కులభేదంతో నిరాకరించడంతో పాలేటమ్మ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. కదిరప్ప చంపాడని భావించిన గొల్లలు అతడిని కొట్టి చంపేస్తారు. ఈ హత్యను కుల పరంగా సమర్ధించుకోవడం ఎంతటి విషాదం!
కురవలు ఒకపక్క జీవాలు మేపుకుంటా, మరో పక్క సేద్యాలు చేసుకుంటా దుడ్లకు ధాన్యాలకు కొదవ లేకుండా సుభిక్షంగా బతుకుతున్నారని ఓర్వలేని ఊరు పెద్దలు గొల్లలు, కురుమల మధ్య- కురవలు,వడ్డెబోయిల మధ్య విభేదాలు సష్టించి వాళ్లను బద్ధ శత్రువులుగా తయారుచేస్తారు. చివరకు ఎన్నికల సమయంలో తామంతా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి అంతా కలిసి పోతారు.
గొల్ల కురుమల నుండి – కురుమలను బీసీ బీలో చేర్చి, గొల్లలను బీసీ డీలో చేర్చిన ప్రభుత్వం వారు కురువలలో నుండి మాదాసి కురవలను విడదీసి ఎస్సీ జాబితాలో చేర్చడం విచిత్రం. ఎస్సీలలో చేర్చినప్పటికీ వారికి కుల సర్టిఫికెట్లు కానీ, ఇతర బెనిఫిట్ లు కానీ అందజేయకపోవడం మరో విచిత్రం.
కె.పి.అశోక్ కుమార్
9700000948