దళితుల జీవన స్థితిగతుల్లో మార్పు తేచ్చేందుకని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దళితులకు మూడెకరాల భూపంపిణీ’ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. మూడెకరాల భూమిచ్చి విద్యుత్, బోరుబావులు ఏర్పాటు చేసి నిమ్న వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచుతామని ప్రకటించిన పథకం ఆటకెక్కింది.గత సర్కార్ చెప్పినట్టు మెరుగైన సమాజం పక్కనబెడితే దళితుల జీవితాల్లో పెద్దగా మార్పులేమీ రాలేదు. గతంలోనే ఈ పథకం సరిగా అమలు చేయకపోవడం పట్ల అనేక విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంపై తన వైఖరిని ప్రకటించలేదు. తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల్లో దళితుల జనాభా ఎనభై లక్షల పైమాటే. మొత్తం రాష్ట్ర జనాభాలో దళితుల జనాభా ఇరవై మూడు శాతం. అరవై కులాలకు పదిహేను శాతం రిజర్వేషన్లు అమలవుతోంది. అయితే రాష్ట్రం ఆవిర్భవించాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల 242 కుటుంబాలకు 15వేల ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేసినట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది.ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల్లో సాగుకు యోగ్యమైన భూమి కోనుగోలు చేసి ఇవ్వాలని ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా సగానికి పైగా సాగుకు అనుకూలంగా లేని రప్పలు, రాళ్లు, బీడు భూములు పంపిణీ చేశారు.దీంతో దళితులు సాగు చేయకుండా పడావు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. విభజనతో పది జిల్లాలు కాస్త ముప్తై మూడు జిల్లాలు ఏర్పాటు కావడంతో అమాంతం భూముల ధరలు అనూహ్యంగా పెరిగిన క్రమంలో దళితులకోసం భూములు కొనుగోలు చేయలేమని తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ ప్రకటించింది. దీంతో అట్టహసంగా ప్రారంభించిన దళితులకు మూడెకరాల భూపంపిణీ అర్ధాంతరంగా ఆగిపోయింది. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడు నెలలు కావస్తోంది. దళితులకు మూడెకరాలు భూపంపిణీపై నేటికీ ఒక విధాన ప్రకటన చేయలేదు. ఈ పథకం కొనసాగుతుందా? లేదా అనే విషయమై దళితుల్లో ఆందోళన నెలకొంది.
– గుర్రం రాంమోహన్ రెడ్డి, 7981018644న