రాష్ట్రంలో ప్రభుత్వం ఇండ్లు నిర్మిస్తుందని ఆశతో నిరుపేదలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రకటించిన గృహలక్ష్మి పథకంతో ఆనందపడ్డారు. అయితే ఈ మధ్య కాలంలో పేదలకు ఇల్లు కావాలి అనే డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఇండ్లు, ఇండ్ల స్థలాలకై పోరాటాలు కూడా జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపించడంతో కండ్లు తెరిచిన ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ని తీసుకొచ్చింది. పథకానికి విధివిధానాలు రూపొందించింది. మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.లక్ష చొప్పున రూ.3లక్షలు సాయమంది స్తామని చెప్పింది. మంచిదే కానీ.. ప్రకటించి రెండు నెలలు కావస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ కూడా లబ్దిదారుల ఎంపికకాని, మంజూరు పత్రాలు కాని ఏ ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదు. ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని కట్టడి చేసేందుకు ప్రకటించినట్టుగా ఉంది తప్ప పథకాన్ని వేగవంతంగా అమలు చేయాలని చిత్తశుద్ధి ఉన్నట్లు కనపడటం లేదు. ఎందుకంటే గత పదేండ్లుగా రాష్ట్రం ఏర్పడి నప్పటి నుంచి నేటి వరకు ఏ ఒక్కరికి ఇండ్లు కట్టించిన దాఖలు లేవు. ఈ పదేండ్ల కాలంలో అనేక మందికి వివాహాలు జరిగి ఉమ్మడి కుటుంబాల ద్వారా విడిపోయిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. అలా చూసుకుంటే ప్రతి నియోజక వర్గానికి కనీసం ఏడు నియోజకవర్గాల చొప్పున లెక్కించినా ఇరవై వేల పైచిలుకు ఇండ్లు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా చూస్తే గ్రామానికి గ్రామానికి రెండు లేక మూడు ఇండ్లకంటే ఎక్కువ రావు. దీనికితోడు పథకం అర్హతకు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా ప్రకటించింది. చాలామందికి రేషన్‌కార్డులు లేవు. ప్రభుత్వం ఇదిగో అదిగో ఇస్తున్నామని చెప్పడమే తప్ప ఆ వైపు దృష్టి సారించడం లేదు. నూతన కార్డుల కోసం దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు. ప్రభు త్వం ఇప్పటికైనా రేషన్‌కార్డులతో పాటు అర్హులైన అందరికీ ఆర్థిక సాయం అందించి సొంతింటి కలను నెరవేర్చాలి.
– మట్టిపెళ్లి సైదులు, సెల్ 8106778287