– ధరణి కమిటీ నిర్ణయించిన ఉమ్మడి సర్వేపై అనుమానాలు
– గతంలోనూ ఫలితమివ్వని జాయింట్ సర్వే
– సమగ్ర భూ సర్వేనే పరిష్కారం అంటున్న నిపుణులు
– కమిటీ సభ్యుల మధ్య కొరవడిన సమన్వయం
– మధ్యంతర నివేదిక మరింత ఆలస్యమయ్యే అవకాశం
– కమిటీ తీరుపై సర్కార్ ఆసంతృప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టా ఉంది. కాని మోఖమీద భూమి లేదు. ఎందుకంటే ఈ భూమి మాదంటూ అటవీ అధికారులు సదరు పట్టాదారున్ని తరిమి, కందకం తవ్వి కంచె కట్టారు. ఎదురు తిరిగితే కేసులు పోలీసు స్టేషన్లు.. అయినా పంచాయితి తెగలేదు. చివరికి ఉమ్మడిగా రెండూ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. ఇది మా భూమని రెవెన్యూ శాఖ అధికారులు, ఇది మా భూమని అటవీ శాఖ అధికారులు…. మా సర్వే కరెక్టంటే… మా సర్వే కరెక్టని ఇరు వర్గాల వాదులాట… పాతికేండ్ల క్రితం పలు గ్రామాల్లో అటవీ రెవెన్యూ భూ వివాదాల పరిష్కారం కోసం చేపట్టిన జాయింట్ సర్వే సంగతులివి…. కొంత మంది స్థానిక అధికారులను మేనేజ్ చేసుకుని ఉపశమనం పొందారే తప్ప ఇప్పటికీ గ్రామాల్లో సమస్య అలాగే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఈ సమస్య పరిష్కారానికి గతంలో విఫలమైన ఉమ్మడి సర్వేనే చేపడుతామని ప్రకటించింది. ఈ సర్వేపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నారు. సమగ్ర భూ సర్వే చేపడితే గాని సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావని భూ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో అటవీ, రెవెన్యూ శాఖల మద్య ఎన్ని ఎకరాల భూమి వివాదంలో ఉందనే సమాచారం రెవెన్యూశాఖ వద్ద గాని, ఇతర ప్రభుత్వ శాఖ వద్దగాని లేదు. స్వచ్ఛంద సంస్థలు, ఇతర భూ నిపుణుల అంచనా ప్రకారం తెలంగాణలో దాదాపు 2 లక్షల ఎకరాలు ఈ రెండు శాఖల మద్య వివాదంలో ఉన్నాయి. చాలా వరకు అసైన్మెంట్ భూముల్లోనే ఈ వివాదం ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యేల అధ్యక్షతన అప్పుడున్న అసైన్మెంట్ కమిటీలు మూడు దఫాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు స్థానిక పరిస్థితులను బట్టి 20 గుంటల నుంచి 2 ఎకరాల వరకు భూమిని పంపిణీ చేశారు. వాటికి లావోణీ పట్టాలు ఇచ్చిన రెవెన్యూశాఖ అధికారికంగా హద్దులు చూపించలేదు. లావోణీ పట్టాలు పొందిన వారికి స్థానిక పట్వారీలు ఇదే నీ సరిహద్దు అంటూ ఖాళీ ఉన్న స్థలాలను చూపించారు. భూమిని సాగు చేసే క్రమంలో అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. సదరు భూమి అటవీ శాఖకు చెందినది అంటూ చాలా గ్రామాల్లో నిరుపేదలు, చిన్న సన్నకారు రైతులను బెదిరించి, కేసులు పెట్టి బలవంతగా కందకాలు తవ్వడం, కంచెలు వేయడం లాంటి చర్యలు చేపట్టారు. తమకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టా ఉందంటూ లబ్ది దారులు ఎమ్మార్వో, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు. దాంతో కొన్ని ప్రాంతాల్లో అధికారులు జాయింట్ సర్వే చేపట్టారు. ఆ సర్వేలో ఇరు శాఖల మధ్య సయోద్య కుదరక పోవడంతో 30 ఏండ్లుగా సమస్య కొలిక్కి రాలేదు.
అటవీ భూముల గుర్తింపులో ఏక పక్షం
రాష్ట్రంలో 1930కి ముందు నిజాం హయంలో సమగ్ర భూసర్వే చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సర్వే జరగలేదు. ఆ తర్వాత పలుమార్లు సర్వే కోసం సర్కార్ విఫలయత్నం చేసింది. పాత రెవెన్యూ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 95 శాతానికి పైగా భూములకు టిపనీ ఉంది. అయితే చాలా భూములు ఎందుకు వివాదంగా మారాయనేది చర్చనియాంశంగా మారింది. అటవీ శాఖ అధికారుల తీరుతోనే వివాదాలు ఎక్కువయ్యాయని విమర్శలు ఉన్నాయి. అటవీ భూములు నిర్దారించేందుకు చాలా ప్రాంతాల్లో సరైన హద్దులు లేవు. దాంతో రిజర్వు ఫారెస్టు హద్దులు గుర్తించడం కష్టంగా మారింది. అటవీ అధికారుల సర్వే మెకానిజం ప్రకారం ఏక పక్షంగా గుర్తించారు. అయితే రెవెన్యూశాఖ ఇవేమి పట్టించుకోకుండా పట్టాలు పంపిణీ చేయడంతోనే సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమయ్యాయనే అభిప్రాయాలు ఉన్నాయి.
మధ్యంతర నివేధిక మరింత ఆలస్యం
ధరణి కమిటీ ఇప్పటి వరకు ఐదు సార్లు సమావేశాలు నిర్వహించింది. అందులో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన సమస్యలను రెండు భాగాలుగా విభజించింది. చిన్న సమస్యలను తహసిల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకు, రెండవ స్థాయిలో కలెక్టర్లకు ఈ బాధ్యతలను అప్పగిస్తే కొంతవరకు తగ్గుతాయని కమిటీ ప్రాథమికంగా గుర్తించింది. వీటి పరిష్కారానికి ఈ నెలాఖరులోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని భావించినప్పటికీ ఇప్పట్లో అది సాధ్యం కాదని తెలుస్తోంది. వీటికి తోడు కమిటీ సభ్యుల మద్య సమన్వయం లేక పోవడం కూడా ఆలస్యానికి కారణమని భావిస్తున్నారు. కమిటీ పనితీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వం సైతం అసంతృప్తిగా ఉందని సమాచారం.
సమగ్ర భూసర్వేనే సమస్యకు పరిష్కారం
సమగ్ర భూసర్వే జరిపితే తప్ప రాష్ట్రంలో భూముల సమస్యకు పరిష్కారం లభించదు. ఎందుకంటే భూమి హద్దులు, గుర్తించకుండా ధరణిలో ఎన్ని మార్పులు చేసినా ప్రయోజనం ఉండదు. ఒక వైపు భూ సర్వే చేస్తూనే ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలి. అసైన్మెంట్ ల్యాండ్‌కు సంబంధించి మోఖమీద భూమి ఉండి పట్టాలు లేని వారికి, పట్టాలు ఉండి మోఖ మీద భూమి లేని వారికి సమగ్ర సర్వే జరిపి భూములు కేటాయించాలి. ఆ తర్వాత మిగులు భూమి ఉంటే ఇతర పేదలకు పంచాలి.
సాదిక్ అలీ, హైకోర్టు న్యాయవాది, భూ నిపుణులు