– రైల్వే బోర్డుపై పీపుల్స్ కమిషన్ ఆగ్రహం
– పరిశీలించాలంటూ కాగ్‌కు లేఖ
న్యూఢిల్లీ : లాభాలు ఆర్జిస్తున్న నాలుగు ఉత్పత్తి యూనిట్లను ప్రయివేటీకరించేందుకు రైల్వే బోర్డు చేసిన ప్రతిపాదనపై పీపుల్స్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని పరిశీలించాలని కాగ్‌ను కోరింది. చెన్నరు (తమిళనాడు)లోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, లాతూర్ (మహారాష్ట్ర)లోని మరట్వాడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వారణాసి (ఉత్తరప్రదేశ్)లోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్, దాహోద్ (గుజరాత్)లోని రైల్వే వర్క్‌షాపును విదేశీ ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీపుల్స్ కమిషన్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జీసీ ముర్ముకు ఓ లేఖ రాసింది.
ఈ నాలుగు యూనిట్ల పనితీరుపై ముందుగానే సమగ్ర ఆడిట్ నిర్వహించాలని, లేనిపక్షంలో అవి ప్రయివేటు సంస్థల చేతుల్లోకి వెళతాయని, ఫలితంగా రైల్వే శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆ లేఖలో పీపుల్స్ కమిషన్ వివరించింది. పీపుల్స్ కమిషన్‌లో ఈఎంఎస్ శర్మ, ప్రభాత్ పట్నాయక్, అదితి మెహతా, థామస్ ఇసాక్ వంటి ప్రముఖ విద్యావేత్తలు, న్యాయకోవిదులు, మాజీ అధికారులు, కార్మిక సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉన్నారు. బోగీలు, లోకోల ఉత్పత్తిలో దేశీయ, విదేశీ బహుళజాతి సంస్థలకు ప్రవేశం కల్పించడానికి రైల్వే బోర్డు ఆతృత ప్రదర్శిస్తున్నదని పీపుల్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి, ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తూ వ్యూహాత్మక పనులను విచక్షణారహితంగా ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పీఎస్‌యూల్లో ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తోంది. దీంతో ఆ సంస్థలు ప్రయివేటు కంపెనీలకు తలుపులు తెరిచి వాటిని ఆహ్వానిస్తున్నాయి. మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆస్తులను దోచుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి. ప్రయివేటు బిడ్దర్లతో పోటీ పడే శక్తిని కోల్పోయేలా చేస్తున్నాయి’ అని పీపుల్స్ కమిషన్ ఆ లేఖలో వివరించింది.
ఒకవైపు ప్రభుత్వ రంగ యూనిట్లను ప్రయివేటు పరం చేస్తూ మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ‘ఆత్మనిర్భర భారత్’ అంటూ డొల్ల కబుర్లు చెబుతున్నారని పీపుల్స్ కమిషన్ ఎద్దేవా చేసింది. రైల్వే ఉత్పత్తి యూనిట్లు ఎంతో కాలంగా స్వావలంబన సాధిస్తున్నాయని, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తు చేసింది. అలాంటి వాటిని ఏ బాధ్యతాయుత ప్రభుత్వమైనా మరింత బలోపేతం చేస్తుందని, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం వాటిని ప్రయివేటుకు అప్పగించాలని చూస్తోందని కాగ్‌కు రాసిన లేఖలో పీపుల్స్ కమిషన్ విమర్శించింది.