అయినా…తీరు మారుతుందా?

But...is that changing?ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సేకరించటం, ప్రచురించటం, ప్రసారం చేయడం మీడియా బాధ్యత. ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం వాటిల్లకుండా ఎక్కడ, ఏం జరుగుతుందో తెలుసు కోవడం ప్రజల హక్కు. పౌరులకు ఉన్న సమాచార హక్కును, దాన్ని నెరవేర్చేందుకు దోహదపడే మీడియా స్వేచ్ఛను తగిన విధంగా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ, పాలక యంత్రాంగాలది. కానీ, అందుకు భిన్నంగా వ్యవహరించే ప్రభుత్వాల నుంచి, నిజాలను మాట్లాడితే సహించలేని పాలకుల నుంచి సహకారాన్ని కాక, పచ్చి నిరంకుశ ధోరణులను ఎదుర్కోవాల్సి వస్తోంది. మోడీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి దేశంలో పత్రికా స్వేచ్ఛ మంటగలిసిందని అంతర్జాతీయ ప్రెస్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐపీఐ) బుధవారం చేసిన వ్యాఖ్యలు తాజా పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కలానికి సంకెళ్లు వేస్తూ భావస్వేచ్ఛను నిర్వీర్యం చేస్తోంది. అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ మీడి యా మీద, పౌర సంస్థల మీద ఉక్కుపాదం మోపు తున్నది. జర్నలిస్టులపై దాడుల విషయంలో 12వ వరస్ట్‌ కంట్రీగా భారత్‌ నిలిచిందని ఇంవ్యూనిటీ సూచీ-2023 గుర్తుచేసింది. పాత్రికేయులకు రక్షణ కల్పించ డంలో గత రెండు పాలనా కాలాల్లోనూ విఫలమైన మోడీ ప్రభుత్వం.. కనీసం ఈసారైనా పటిష్ట చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రాధాన్య తివ్వాలని ఐపీఐ కోరింది. జర్నలిస్టులపై దాడులు, హత్యల కేసుల్లో విచారణను సమగ్రంగా, విశ్వసనీయంగా, పారదర్శకంగా జరిపించాలని విజ్ఞప్తి చేసింది.
ఒక సమాచారం ఇవ్వడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా? లేక ఆ సమాచారాన్ని వెల్లడించే హక్కును నిషేధించటం వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానాన్ని వివేకంతో, విచక్షణతో బేరీజు వేసిన తరువాతనే మీడియాపై చర్యలకు పూనుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలోనే వ్యాఖ్యానించింది. మీడియాపై కత్తి కట్టి, పత్రికాస్వేచ్ఛను కర్కశంగా అణచివేస్తున్న పాలకులు ఆ వ్యాఖ్యలనెప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. తమకు వ్యతిరేకంగా ఒక్క గొంతూ వినిపించకూడదను కోవడం, బలవంతాన నొక్కే యాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ‘ఐపీఐ’ ఆందోళన వ్యక్తం చేసింది.
హత్రాస్‌ ఘోరాన్ని కవర్‌ చేయటానికి వెళ్లబోతుంటే జర్నలిస్టు కప్పన్‌పై ఉపా కేసు బనాయించి రెండేళ్ల పాటు జైల్లో ఉంచిందీ ప్రభుత్వం. అన్నదాతల ఆందోళనకు మద్దతుగా మాట్లాడిందని సామాజిక కార్యకర్త దిశా రవిని తీవ్రంగా వేధించింది. రైతు ఉద్యమ వార్తలను రాసినందుకు న్యూస్‌క్లిక్‌ సంపాదకుడు ప్రబీర్‌ పుర్కాయస్త తదితరులపై దేశద్రోహ కేసులు బనాయించి, జైల్లో పెట్టింది. ప్రజల పక్షాన రాసిన, మాట్లాడిన అనేకమంది జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను వెంటాడి వేధించటం, దాడులు చేయించటం, తీవ్రమైన కేసులు మోపటం వంటి కక్షపూరిత చర్యలతో భయోత్పాతం సృష్టించటం ఒక విధానంగా కొనసాగిస్తోంది. మోడీ పాలనలో మీడియా స్వేచ్ఛ గణనీయంగా క్షీణించిందంటానికి ఇంతకంటే ఉదాహరణలు ఇంకేం కావాలి. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ చర్యలను ఏడాది క్రితమే సిఫార్సు చేసినప్పటికీ ఆ దిశగా పురోగతి శూన్యం అని ఐపీఐ విచారాన్ని వెలిబుచ్చింది.
బీజేపీని విమర్శించే మీడియా సంస్థలు, జర్నలిస్టులను న్యాయ చిక్కుల్లో పడవేస్తున్నారు. జర్నలిస్టులను బెదిరించే పరంపర ఇలాగే కొనసాగితే ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టింగ్‌ దెబ్బతింటుంది. వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరలించే విధంగా మీడియాను మోడీ ప్రభుత్వం లొంగదీసుకుంటోంది. సామాజిక, ఆర్ధిక నమస్యలు, పేదరికం, నిరుద్యోగం, పిల్లల్లో పౌష్టికాహార లోపం, రైతాంగం వెతలు, ఆరోగ్యభద్రత, నాణ్యమైన విద్య తదితర సమస్యలు అత్యధిక మీడియాలో కనిపించడం లేదు. ప్యాషన్‌, పెరేడ్లు, క్రికెట్‌, సినిమాల వార్తలకే విశేష ప్రాధాన్యతనిస్తూ తమ ఉనికిని కాపాడుకుంటున్న పరిస్థితి నెలకొంది.
దేశంలో మీడియా స్వేచ్ఛ ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలి. అది యాజమాన్యాలకు స్వేఛ్చగాÛ కాకుండా.. అంతిమంగా సమాజానికి మేలు చేయాలని ఐపీఐ అభిపాయ్రపడింది. భావప్రకటన, పత్రికాస్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కులు. వాటిని తొక్కిపెట్టాలనుకోవడం నియంతృత్వానికి దారితీస్తుంది. హిట్లర్‌ వంటి నియంతలు ఇలాంటి చర్యలకే పాల్పడి, చరిత్ర హీనులుగా మిగిలి పోయారు. కేంద్ర పాలకులు కూడా ఆ దిశగానే పరుగులు పెడుతున్నారు. పత్రికా స్వేచ్ఛ ద్వారానే ప్రజాస్వామ్యం సమర్థంగా పనిచేయగలదని మోడీ ప్రభుత్వం తెలుసుకోవాలి. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం పత్రికలకు, పాత్రికేయులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రజల భావాలకు అద్దం పట్టే పత్రికల స్వేచ్ఛ ప్రజలందరిదీ. దీనిని కాపాడుకోవటం మనందరి బాధ్యత.