గిరిజనం బాధలు తీరేనా..?

the tribe Will the suffering end?– ఆదివాసీ పల్లెల్లో మౌలిక వసతులు కరువు
– పోడు భూములకు పూర్తిగా దక్కని పరిష్కారం
– భగీరథ వచ్చినా.. అందని తాగునీరు
– రోడ్డు మార్గాలు లేక ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి
– ఏండ్లు గడుస్తున్నా సమస్యలకు లభించని పరిష్కారం
– నేడు కేస్లాపూర్‌లో గిరిజన దర్భార్‌.. హాజరుకానున్న మంత్రి సీతక్క
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, ఇంద్రవెల్లి
ఆదివాసులు అధికంగా నివసించే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటికీ వారిని మౌలిక వసతుల కొరత వెంటాడుతోంది. ఆదివాసుల జీవన స్థితిగతుల్లో మార్పులు రావడం లేదు. వారి అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఉన్నా పరిస్థితులు ఏమీ మారడం లేదు. ఏండ్లుగా పోడు భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులకు ఆ భూమిపై సంపూర్ణ హక్కులు లభించడం లేదు. గత ప్రభుత్వం కొందరికి హక్కు పత్రాలు పంపిణీ చేసినా.. అనేక మందిని విస్మరించింది. మరోపక్క ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు, వాగులపై వంతెనలు లేక అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి. సోమవారం కేస్లాపూర్‌లో గిరిజన దర్భార్‌ జరగనుంది. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ(సీతక్క) హాజరుకానున్న నేపథ్యంలో ఇప్పటికైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గిరిజనులు ఆశిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1509 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో సగానికి పైగా పంచాయతీలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పడినా.. గిరి గ్రామాల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. ఇప్పటికీ అనేక పల్లెలకు రోడ్డు మార్గం లేదు. వాగులు, వంకలు దాటుతూ అతి కష్టం మీద సమీప గ్రామాలు, మండల కేంద్రాలకు వెళ్తుంటారు. వర్షాకాలంలో వాగులు పొంగిపొర్లడంతో వాటిని దాటలేక అనేక మంది గర్భిణీలు మార్గమధ్యలోనే ప్రసవించిన ఘటనలున్నాయి. గిరిజన దర్భార్‌ సందర్భంగా గత ప్రభుత్వం జిల్లాలో రూ.340కోట్లతో గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లను నిర్మిస్తామని హామీనిచ్చినా.. పూర్తిస్థాయిలో నెరవేరలేదు.
పోడుకు దక్కని పరిష్కారం..!
ఆదివాసీ గిరిజనుల జీవనాధారమైన పోడు భూములకు సంపూర్ణ హక్కుల లభించడం లేదు. గత ప్రభుత్వం 47వేల హక్కుపత్రాలు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ, ఉమ్మడి జిల్లాలో 66వేల మందికి పైగా లబ్దిదారులు 1.46లక్షల ఎకరాల కోసం దరఖాస్తులు చేసుకోగా.. సుమారు 20వేల మందికి మాత్రమే పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. మరోపక్క హక్కుపత్రాల్లో తప్పులు దొర్లడంతో లబ్దిదారుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అనేక మందికి ఎకరాల్లో ఉన్న భూమిని గుంటల్లో పేర్కొనడంతో పంట రుణాలు, రైతుబంధు వంటి పథకాలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు జీఓ 3ని యథావిధిగా అమలు చేయాలని ఆదివాసులు డిమాండ్‌ చేస్తున్నారు. టైగర్‌ జోన్‌ పేరిట గిరి గ్రామాలను ఇతర చోటకు తరలించారని.. వాటిలో కనీస సౌకర్యాలు కల్పించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
తాగునీటికి తప్పని తిప్పలు..!
గత ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధనీటిని అందించేందుకు మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చింది. మారుమూల పల్లెల్లో కూడా ట్యాంకులు నిర్మించి పైప్‌లైన్లు వేసి ఇంటింటికీ నల్లాలు బిగించారు. కానీ నీటి సరఫరాలో అంతరాయం కలుగుతూనే ఉంది. అనేక పల్లెల్లో రెండు, మూడ్రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుండటంతో గిరిపుత్రులు ఇప్పటికీ చెలిమెలు, వాగులు, బావుల మీదనే ఆధారపడాల్సి వస్తోంది. తరుచూ తాగునీటి సమస్య తలెత్తుతోందని ఇంద్రవెల్లి, ఉట్నూర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు పలుమార్లు జడ్పీ సమావేశాల్లో ప్రస్తావించినా సమస్య పరిష్కారం కావడం లేదనే విమర్శలున్నాయి. మరోపక్క చారిత్రక సంపదకు నిలయంగా ఉన్న గోండు రాజుల కోటలు ఆనవాళ్లు కోల్పోతున్నాయని వాటిని అభివృద్ధి చేయాలని, ఆదివాసీ పుణ్యక్షేత్రాలను పరిరక్షించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.
ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలు నెరవేర్చాలి
ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు కొత్త ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం వీరి అభివృద్ధికి అనేక హామీలిచ్చి విస్మరించింది. విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతులపై దృష్టిసారించాలి. ఐటీడీఏ కేంద్రంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు ఇంజినీరింగ్‌ కళాశాల, యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో బెల్టు షాపులు మూసేయాలి. ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.
పూసం సచిన్‌, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి