చక్కెర వివాదం పరిష్కార మయ్యేనా?

Will the sugar dispute be resolved?–  భారత్‌-బ్రెజిల్‌ చర్చలు ప్రారంభం
జెనీవా : పంచదారకు సంబంధించిన వాణిజ్య వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం భారత్‌-బ్రెజిల్‌ పరస్పర చర్చలను ప్రారంభించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటిఒ)లో ఈ చర్చలు ప్రారంభమయ్యాయని, ఇథనాల్‌ ఉత్పత్తి సాంకేతితను బ్రెజిల్‌ భారత్‌తో పంచుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. పంచదార, ఇథనాల్‌ ఉత్పత్తిలో ప్రపంచంలోనే బ్రెజిల్‌ అగ్రస్థానంలో ఉంది. అలాగే ఇథనాల్‌ ఉత్పత్తికి సంబంధించిన సాంకేతికత విషయంలోనూ బ్రెజిల్‌ ముందు ఉంది. ఇప్పటికే కొన్ని రౌండ్ల చర్చలు జరిగాయని, ఇథనాల్‌ సాంకేతికతను భారత్‌తో పంచుకోవడానికి బ్రెజిల్‌ సిద్ధంగానే ఉందని అధికారి చెప్పారు. వాహనాలకు ఉపయోగించే పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం ద్వారా చమురు దిగుమతులను తగ్గించుకోవాలని భారత్‌ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌లో 20 శాతం వరకూ ఇథనాల్‌ కలపడానికి కొన్ని వాహనాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 2025 నాటికి అన్ని వాహానాలకు 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను ఉపయోగించాలని లక్ష్యాన్ని నిర్థేశించింది. కాగా, ఇథనాల్‌ సాంకేతికతను బ్రెజిల్‌ అందిస్తే, అందుకు ప్రతిగా భారత్‌ ఏదైనా ఆఫర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర దేశాలతో ఉన్న పంచదారకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవడానికి బ్రెజిల్‌ తరహా విధానాన్ని అనుసరించాలని భారత్‌ భావిస్తున్నట్లు సమాచారం. భారత్‌లో చెరుకు రైతులకు ఇస్తున్న సబ్సీడీలు ప్రపంచ వాణిజ్య నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని బ్రెజిల్‌, ఆస్ట్రేలియా, గ్వాటెమాల వంటి దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌ ఇస్తున్న మద్దతు చర్యలు ప్రపంచ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని 2021 డిసెంబరు 14న డబ్ల్యూటిఒ వివాద పరిష్కార ప్యానెల్‌ కూడా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై గత ఏడాది జనవరిలో డబ్ల్యూటిఎ అప్పీలేట్‌ బాడీ వద్ద భారత్‌ అప్పీల్‌కు వెళ్లింది. అయితే ఈ అప్పీలేట్‌ బాడీలో సభ్యుల నియామకంలో వివాదం ఏర్పడ్డంతో ఈ తీర్పు పెండింగ్‌లో ఉండిపోయింది. డబ్ల్యూటిఒలో సభ్య దేశాల మధ్య ఏర్పడిన వివాదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంది. తరువాత ఈ విషయాన్ని సంస్థకు తెలియజేయవచ్చు.