ఈసారైనా ఓట్లు రాల్చేనా?

Will the votes be cast this time?– 50 రోజులు..40 సభలంటూ బీజేపీ హడావిడి
– 2018లో అగ్రనేతలు ప్రచారం చేసినా డిపాజిట్లు గల్లంతు
– రాష్ట్రానికి మళ్లీ క్యూ కట్టనున్న కేంద్ర మంత్రులు, సీఎంలు
– త్వరలో యూపీ, అస్సాం సీఎంల రాక
నవతెలంగాణ- హైదరాబాద్‌
ప్రధాని మోడీ.. కేంద్ర మంత్రి అమిత్‌షా వరుస పర్యటనలతో రాష్ట్రంలో హడావిడి చేస్తున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు, అధ్యక్షుడి మార్పు తర్వాత పడినపోయిన గ్రాఫ్‌ను జాకీలు పెట్టి మరీ లేపాలని చూస్తున్నారు. 50 రోజులు..40 సభలంటూ సుడిగాలి పర్యటనలకు తెరలేపారు. అయినా, క్షేత్రస్థాయిలో పట్టులేమి ఆ పార్టీని కలవరపెడుతున్నది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు బీజేపీ పాలితరాష్ట్రాల ఇతర సీఎంలు, కేంద్ర మంత్రుల పర్యటనలు, సభలు తమకు ఓట్లు రాలుస్తాయని రాష్ట్ర నాయకత్వం కొండంత ఆశలు పెట్టుకున్నది. తెలంగాణలో 2018 ముందస్తు ఎన్నికల్లో మోడీ, అమిత్‌షా, గడ్కరీ, నడ్డా, యోగీ ఆదిత్యనాథ్‌, తదితర అగ్రతనేతలు, కేంద్ర మంత్రులతో ఇలాగే ఎన్నికల ప్రచారంలో తెగ తిప్పించారు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే మోడీ, అమిత్‌షా, యోగి పర్యటించిన నియోజకవర్గాల్లోనూ బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. 2014లో ఏడు శాతం ఓట్లతో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీకి 2018కి వచ్చేసరికి ఓట్ల శాతం కూడా తగ్గింది. ఆ ఎన్నికల్లో 6.98 శాతం ఓట్లతో ఒక స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత దుబ్బాకలో అధికార పార్టీలో గ్రూపు తగాదాలు, ఎంఐఎం హ్యాండివ్వడం, వంటి కారణాలతో పాటు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సొంత బలంతో రెండు వేల ఓట్ల లోపు ఓట్లతోనే గెలిచారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ నుంచి అన్యాయంగా బయటకు గెంటేశాడు అనే ఒకే ఒక్క సానుభూతి, సొంత పలుకుబడితో ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో విజయం సాధించారు. అంతేగానీ, ఈ రెండు ఉప ఎన్నికల్లో బీజేపీని చూసి జనం ఓట్లేయలేదనీ, వ్యక్తిగత ఇమేజ్‌తో వారిని ప్రజలు ఆదరించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని అదే పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి మునుగోడు ఉప ఎన్నికలో ఆయన్నే తమ పార్టీ అభ్యర్థిగా పోటీచేయించిన కమలం పార్టీ చావుదెబ్బ తిన్న విషయం విదితమే. అమిత్‌షా వచ్చి ప్రచారం చేసినా అక్కడ ఆపార్టీ గెలవలేదు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి పడ్డ ఓట్లు నాలుగు శాతానికి మించలేదు. ఈ ఎన్నికల్లో కేంద్రమంత్రులు తెగ హడావిడి చేసినా బీజేపీకి ఓటు షేరింగ్‌ ఏమాత్రం పెరగలేదు.
ఈసారీ అలాగేనా?
తాజాగా 50 రోజులు..40 పర్యటనలు, బహిరంగ సభలు అంటూ బీజేపీ రాష్ట్రంలో మళ్లీ తెగ హడావిడి చేస్తున్నది. షెడ్యూల్‌ రాగానే అన్ని పార్టీల కంటే ముందే తొలిసభను ఆదిలాబాద్‌లో నిర్వహించింది. అగ్ర నేతలను పూర్తిగా రంగంలోకి దింపాలని భావిస్తోంది. త్రిమూర్తుల(ప్రధాని మోడీ, అమిత్‌ షా, నడ్డా) పర్యటనలు ఇక నిత్యం ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర మంత్రులతో ఒక్కో రోజు రెండు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేలా బీజేపీ ప్లాన్‌ చేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఈనెల 14వ తేదీన రంగారెడ్డి అర్బన్‌ జిల్లా శేరిలింగంపల్లితో పాటు గ్రేటర్‌ పరిధిలోని మరో నియోజవర్గంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పర్యటించనున్నారు. 15న కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి ముషీరాబాద్‌తో పాటు మరో నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. 16న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ హుజూరాబాద్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల సభల్లో పాల్గొంటారు. 19న మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రి నారాయణస్వామి పర్యటిస్తారు. భారీ బహిరంగ సభలతో శ్రేణుల్లో జోష్‌ తీసుకురావాలని బీజేపీ ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించడంలేదు. 2018లో లాగానే ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ జోష్‌తో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ అమాతం పడిపోయిన సంగతి తెలిసిందే. నేతల అధిపత్యపోరు, అధ్యక్ష మార్పుతో పార్టీ మరింత పతనమైంది. అదే సమయంలో బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. నేతల మధ్య సమన్వయం లేకుండా, పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టులేకుండా వలస నేతల తోక పట్టుకుని ముందుకెళ్లడం ఏటికి ఎదురీదటం లాంటిదేనని బీజేపీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. గతంలో అగ్రనేతలు పర్యటించిన అనేక నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కని విషయం విదితమే. కొన్ని చోట్ల నోటా కంటే తక్కువ ఓట్లు పడటం గమనార్హం.