ఓట్లు పడేనా… ఓట్ల లెక్క  కుదిరేనా..?

– మద్దతుదారులతో  వివిధ పార్టీల  నేతల  సమాలోచనలు,
 – కుల,  మహిళ , యువజనుల  ఓటు బ్యాంకుపై  పకడ్బందీగా వ్యూహం, మద్దతుదార్ల ఓట్ల లెక్కల్లో నేతలు,
– గత ఎన్నికల్లో నియోజకవర్గాల్లో పోలైన వాటిపై పోస్టుమార్టం,
– బూత్ స్థాయి నుండే అనుకూల- ప్రతికూల లెక్కలు.
నవతెలంగాణ-సూర్యాపేట:  అసెంబ్లీ బరిలో నిలిచే వివిధ పార్టీల నేతలు లెక్కల్లో బిజీబిజీగా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎన్ని ఓట్లతో విజయం సాధించాం, ఎన్నింటి తో ఓడిపోయామనే విషయంపై బేరీజు వేసుకుంటున్నారు. అప్పుడు ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఇంకెన్ని రాబడితే గెలుస్తామనే విషయంపై సహచరులతో ,మద్దతు దారులతో సమాలోచనలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో సహకరించిన వారిని దగ్గరికి చేసుకుంటూ ముందుకెళుతున్నారు. కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళల ఓట్లు ఎన్ని అనే దానిపై ఆరా తీస్తున్నారు. బూతు స్థాయి పై దృష్టి సారించి వాలంటీర్లను నియమించుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏ వర్గం నుండి మద్దతు లభించింది, కుల ఓట్లు ఎన్ని, యువజన, మహిళల నుండి లభించిన మద్దతు ఎన్ని.. అనే ఓట్ల లెక్కల్లో నేతలు బిజీ గా మారుతున్నారు. గత ఎన్నికల్లో మద్దతు పలికిన వర్గాల వారిని మళ్లీ మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో తమ మద్దతు ల ఓట్ల లెక్కలు పక్కాగా ఉండేలా నేతలు పక్క వ్యూహం  తో అడుగులు వేస్తుండడంతో పాలిట్రిక్స్ హిట్ ఎక్కుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో నేతల ప్రచారం ప్రతి ఇంటికి చేరుతుంది. జిల్లాలో ప్రతిపక్ష అభ్యర్థులు అధికారపార్టీకి దీటుగా ప్రచారాన్ని చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓటర్ల మనస్సును కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నుతున్నారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లను కాపాడుకుంటూ కొత్త ఓటుబ్యాంకును సృష్టించుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఆయా పార్టీలు సొంత బలంతో పాటు కుల సంఘాల ఓట్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మహిళ ,యువజన ఓట్లను కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో పోలైన ఓట్లపై బూతుల వారీగా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. బూతు స్థాయిలో ఎక్కడ  మైనస్ ఉన్నదో మరెక్కడ ప్లస్ ఉన్నదో అంటూ ఓట్ల కూడికలు, తీసివేతల్లో నేతల అనుచరులు, మద్దతుదారులు యమ బిజీగా మారిపోయారు .ప్రతి పోలింగ్ బూత్ నుండి నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారు .పోలింగ్ బూత్ లో ఉన్న ఓటర్ల కులాలను, వయస్సు లను, మహిళలు ,యువకులను ఇలా రకరకాలుగా విభజించి వాలంటీర్లను నియమించుకుంటున్నారు. ప్రధానంగా జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గంలో ఓట్ల లెక్కల్లో చీలికలు ఏర్పడనున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గుంట కండ్ల జగదీశ్ రెడ్డి 68,650 ఓట్లు రాగా 37. 34% ఓట్ల శాతం నమోదయ్యాయి.  ఈసారి కూడా ఆయన బిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రధానంగా ఈసారి ఓట్లలో చిలిక ఏర్పడే అవకాశం ఉందని ఆ పార్టీ ఆశ పెట్టుకుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలతో పాటు చీలికలు, పేలికలు, అసంతృప్తులు తనతనకు కలిసొస్తాయని జగదీశ్ రెడ్డి భావిస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉనికిలేని బీజేపీ తనకు పోటీ కాదని ఆయన పలుమార్లు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇది గాక ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో తాను కనిపిస్తానని ఆ రకంగా ప్రజల ఓట్లు తనకే పడతాయనే ధీమాలో  ఉన్నారు. అదేవిధంగా రైతులకు ఇస్తున్న 24 గంటల విద్యుత్, రైతు పెట్టుబడి సాయం,సంక్షేమ పథకాలు తన విజయానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయని జగదీశ్ రెడ్డి భావిస్తున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల బరిలో రాం రెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేయగా 62,683  ఓట్లు పోలవగా 34.1 శాతం ఓట్లు నమోదయ్యాయి. గతంలో ఓట్లు పోలయ్యే దాన్నిబట్టి అవన్నీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అని, అధికార పార్టీ వ్యతిరేకత తనకూ కలిసి వస్తుందని దామోదర్ రెడ్డి పేర్కొంటున్నారు. అదేవిధంగా దళితులు, నిరుద్యోగ యువత,మైనార్టీలు, మహిళలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  నియోజకవర్గంలో పార్టీ ఓటు బ్యాంకు క్యాడరు చెక్కుచెదరలేదని ఈసారి ఓట్ల మెజారిటీ పెరిగి గెలుపు సునాయాసం అంటున్నారు. అదేవిధంగా తమ్ముడు పటేల్ రమేష్ రెడ్డి మద్దతుతో పాటు కాంగ్రెస్, సీపీఐ, టీజేయస్,వై.యస్.ఆర్.సి.పి పార్టీల  ఓటు బ్యాంకులు కలిపితే గెలుపు ఖాయమంటున్నారు. ఇకపోతే గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంకినేని వెంకటేశ్వరరావు కు39,240 ఓట్లు పడగా 21. 35% శాతం ఓటు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో లభించిన ఆదరణ నేడు లభిస్తుందా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. అదేవిధంగా బీజేపీపై జీఎస్టీ ,నోట్ల రద్దు ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది గాక దళిత, గిరిజన, ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దాడులు కలిసి రాని అంశాలుగా పరిగణించాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఇది గాక బిజెపిలోని పాత నాయకులు సహకారం అంతంతమాత్రంగానే ఉన్నది. కాగా పార్టీ కంటే కూడా కేవలం తన చరిష్మాతో పాటు సంకినేని వెంకటేశ్వరరావు అనే పేరు ను చూసి ఓట్ల ని వేయాలని ఆయన మద్దతుదారులు, అభిమానులు కోరుతున్నారు. ఇక ఈ సారి నూతనంగా బహుజన సమాజ్ పార్టీ బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగింది.వట్టే జానయ్య యాదవ్ బిఎస్పి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ,ఎస్సి,ఎస్టీ, మైనార్టీ  వర్గాల ఓట్లతో పాటు ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, యువకుల ఓట్లతో పాటు ప్రభుత్వం పై వ్యతిరేకత కలిసి వచ్చే అంశాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నడూ కూడా బీసీ వర్గాలకు పోటీచేసే అవకాశం రాలేదని అగ్ర వర్ణాల మధ్య పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థి అయిన తనకు ఓటు వేయాలని ఆయన ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ రకంగా నియోజకవర్గంలో  చతుర్ముఖ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈసారి జరిగే ఎన్నికల పోరు “బాహుబలి” సినిమాను తలపించేలా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరి ఎత్తులు  వారే రూపొందించుకొని ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరి ఈసారి ప్రజల తీర్పు ఏ విధంగా ఉండ నున్నదో వేచి చూడాలి.