కర్నాటకతో నీటి వాటా గురించి కొట్లాడతారా..

కర్నాటకతో నీటి వాటా గురించి కొట్లాడతారా..– సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తరలిపోయే ప్రమాదం
– తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్‌ : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
– గిరిజన పక్షపాతి కేసీఆర్‌ : మంత్రి సత్యవతి రాథోడ్‌
– రాష్టస్థ్రాయి గిరిజనుల, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ- శామీర్‌పేట
‘కాంగ్రెస్‌ గెలిస్తే కర్ణాటకతో నీటి వాటా గురించి కొట్లాడుతారా.. తెలంగాణ నీటి వాటా దక్కాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం. కాంగ్రెస్‌ గెలిస్తే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కర్ణాటకకు తరలిపోతాయి. గిరిజనుల సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తి సీఎం కేసీఆర్‌’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని పుష్ప కన్వెన్షన్‌లో శనివారం మాజీ ఎంపీ ప్రొఫెసర్‌ సీతారాం నాయక్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి గిరిజనులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ముందు.. ఇప్పుడు ఉన్న పరిస్థితిపై గుండెలమీద చేయి వేసుకుని ఆలోచించాలని కోరారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌ద న్నారు. పోడు భూములకు పట్టాలు, రైతుబంధు, రైతుబీమా ఇచ్చి గౌరవించుకున్నామని చెప్పారు. విదేశీ విద్య కోసం విద్యార్థులకు రూ.20 లక్షలు ఇస్తున్నామని, సేవాలాల్‌ మహరాజ్‌, కొమురం భీం జయంతి మహౌత్సవాలను అధికారికంగా జరి పింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఎకరం స్థలంలో గోండులకు గోండు భవన్‌, బంజారాలకు బంజారా భవన్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే విద్యా ఉద్యోగాలకు 10శాతం రిజర్వేషన్‌ ఇచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్‌లో గిరిజనులకు గిరిజన బంధు కూడా కేసీఆర్‌ ఇస్తారని, మళ్లీ బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ప్రభుత్వం వచ్చాక మిగిలిన పోడు భూములకు కూడా పట్టాలిచ్చుకుందామన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. తాము అనుభవిస్తున్న రాజకీయ పదవులు కేసీఆర్‌ దయ, ప్రేమ అన్నారు. గిరిజనులకు కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్‌ కవిత, ప్రొ.సీతారాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యే సత్తన్న, రాష్ట్ర గిరిజన నాయకులు రామచంద్రు నాయక్‌, సూరయ్య, కృష్ణప్రసాద్‌, తెలంగాణ ఉద్యమకారులు సంజీవ్‌ నాయక్‌, మున్సిపల్‌ చైర్మెన్లు, మేయర్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.