– లోతుగా అధ్యయనం
– కాళేశ్వరం బ్యారేజీల్లో అనేక లోపాలు: అధికారులు, ఇంజినీర్ల భేటీలో ఒక్కొక్కటిగా వెలుగులోకి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒకటి కాదు, రెండు కాదు అనేక లోపాలు బయటపడుతున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నియమిత నిపుణల కమిటీ మలిదఫా పర్యటనలో సాంకేతిక అంశాలు కమిటీ దృష్టికొస్తున్నాయి. స్థలం మార్పిడి దగ్గర నుంచి మొదలెడితే నిర్మాణానికి అనుసరించాల్సిన మెథడాలజీలోనూ ఘోరమైన తప్పులు దొర్లినట్టు తెలిసింది. కమిటీ చైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వలోని నిపుణుల కమిటీ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, సెంట్రల్ డిజైన్ బృందాలతో విడివిడిగా విచారిస్తున్న క్రమంలో ప్రాజెక్టు పనికి వస్తుందా ? రాదా ? అనే అనుమానాలు నిపుణుల కమిటీకి వచ్చినట్టు సమాచారం. కమిటీ మూడు రోజుల రాష్ట్ర పర్యటన గత శుక్రవారం ముగిసింది. రెండు రోజులు హైదరాబాద్‌లోని జలసౌధలో అధికారులతో సమావేశమయ్యారు. మాజీ ఈఎన్సీలు సి.మురళీధర్‌రావు, నల్లా వెంకటేశ్వర్లును సైతం విచారించింది. ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఈఎన్సీ జనరల్ బి అనిల్‌కుమార్‌తోనూ చర్చించారు. పర్యటనకు వచ్చిన తొలిరోజే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోనూ భేటి అయ్యారు. వీరందరితోనూ సమావేశమై వివరాలు తెలుసుకున్న తర్వాత ప్రాథమిక నివేదిక నెలరోజుల్లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదని సాగునీటి శాఖ అధికారులే అంటున్నారు. జలసౌధలో దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఒక్కొక్కటిగా విస్తుపోయే అంశాలు బయటకు వస్తుండటంతో నిపుణుల కమిటీ నెలరోజుల్లో నివేదిక ఇచ్చే విషయమై పునరాలోచిస్తున్నట్టు తెలిసింది. దాదాపు 19 రకాల సమాచారాన్ని ప్రభుత్వాన్ని అడిగిన విషయం విదితమే. ఇప్పటికే దాదాపు అంతా ఇచ్చినట్టు తెలిసింది. కాగా ప్రాజెక్టు నిర్మాణంలో ప్రాథమిక సూత్రాలను బీఆర్‌ఎస్ సర్కారు పాటించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల మధ్య నిర్మాణంలో అనేక తేడాలు ఉన్నట్టు కమిటీ గుర్తించినట్టు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చోటుచేసుకున్న పొరపాట్లు, తప్పుల మూలంగా మొత్తం ప్రాజెక్టే ప్రశ్నార్థమయ్యే అవకాశాలు లేకపోలేదని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ డిజైన్ ఇంజినీర్లతో బేటి సందర్భంగా కీలకమైన విషయాలు బయటకొచ్చాయని తెలిసింది. ఇదిలావుండగా విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్‌రతన్‌తోనూ నిపుణుల బృందం భేటి అయింది. వాళ్ల దృష్టికొచ్చిన సాంకేతిక అంశాలను ఆరా తీసినట్టు సమాచారం. డీపీఆర్‌కు కేంద్ర జలసంఘం ఆమోదం లేకుండానే నిర్మాణ కంపెనీ ఒప్పందం చేసుకోవడం వెనుక కారణాలను అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. మూడు బ్యారేజీలకు చెందిన అపరేషన్, నిర్వహణ అంశాలపై చర్చించినట్టు సమాచారం.