విద్యార్థి జీవితానికి చదువు ఎంతో సార్ధకతనిస్తుంది. అభ్యసన అనంతరం ఉద్యోగం, ఉపాధి ఏదోటి చేసుకొని జీవించడానికి ఉపయోగపడుతుంది. అలాంటి దాంట్లో వత్తివిద్య(ఒకేషనల్ ఎడ్యుకేషన్) ముందంజలో ఉంటుంది. ఇందులో అధ్యాపకుల బోధన కీలకమైంది. అభ్యాసకుడికి నైపుణ్యం, ప్రతిభను మెరుగుపరిచేలా బోధన కృషి జరుగుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల వృత్తి విద్యా అధ్యాపకులు తమ వత్తినే కాపాడుకునే అయోమయంలో పడ్డారు. నిత్యజీవితంలో ఉపాధి చూపించే కోర్సులు బోధిస్తూ.. సమాజంలో నిరుద్యోగాన్ని తగ్గించే తమపైనే సర్కారు చిన్నచూపు చూస్తోంది అని ఆవేదన చెందుతున్నారు. మంత్రులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన తమ సమస్య కొలిక్కి రావటం లేదని వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా తమ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు 2016లో జీవో తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీలో 1,1600 మంది రెగ్యులరైజేషన్‌కు అసెంబ్లీ ఆమోదించింది. కానీ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా 5,500 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తూ జీఓను విడుదల చేసింది. గత 23 ఏండ్లుగా ప్రభుత్వ కళాశాలలో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. వారికి ఉపాధి కల్పించే కోర్సులు బోధించే, ప్రభుత్వ కళాశాలలను కాపాడుతున్న తమకు, సాంక్షన్ పోస్టుల్లో పనిచేస్తూ జీఓ నెంబర్12, 101, 109, 483ల ప్రకారం అన్ని రకాల విద్యా అర్హతలు కలిగి ఒకేషనల్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను(411)ని పోస్టులు లేవనే కారణంతో రెగ్యులరైజేషన్ మొదటి లిస్టులో కలపకుండా వదిలేశారని వారు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి స్టేట్ బైఫర్కిషన్ జరిగిన సందర్భంలో కమల్నాథన్ కమిటీ (ఏపీ, టీఎస్ పోస్టుల విభజనకు సంబంధించినది) తెలంగాణ రాష్ట్రానికి ఒకేషనల్ విభాగంలో 842 జూనియర్ అధ్యాపక పోస్టులను కేటాయించింది.ఈ పోస్టులను అవసరానికి అనుగుణంగా కన్వర్షన్ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ అధికారులు వాటిని చేయలేక, పోస్టులు లేవని సమాధానం చెబుతున్నారు. మొదటి లిస్టు ఇస్తున్న సందర్భంలో మిగిలిన కాంట్రాక్టు అధ్యాపకులు అధికారులను, ప్రభుత్వ పెద్దలను కలువగా 15 రోజల్లో రెండో లిస్టును విడుదల చేస్తామని సర్కారు హామీ ఇచ్చింది. కానీ 4నెలలు గడుస్తున్నా.. సమస్యకు పరిష్కారం లభించలేదు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో రెగ్యులర్‌గా చదివి ఉద్యోగాలు రెగ్యులర్ కాకపోవడం వలన సమాజం, తోటి అధ్యాపకుల నుంచి ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంటూ మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా వృత్తివిద్య అధ్యాపకులు క్రమబద్ధీకరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. – తలారి గణేష్