– నేడు భారత్, పాకిస్థాన్ సూపర్ 4 పోరు
– విజయంపై టీమ్ ఇండియా గురి
మధ్యాహ్నాం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
భారత్, పాకిస్థాన్ సమరం. అదే జోరు, అంతకుమించిన ఉత్సాహం. భారీ అంచనాలు, భావోద్వేగాలతో పాటు వరుణుడు సైతం దాయాదుల ఢకిీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు!. కొలంబోలో నేడు భారత్, పాకిస్థాన్ సూపర్ 4 సమరానికి సై అంటుండగా.. మ్యాచ్‌కు తీవ్ర వర్షం సూచనలు ఉన్నాయి. పొరుగు దేశాల పోటీ చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ఆశలపై నీళ్లు చల్లేందుకు వరుణుడూ ఎదురు చూస్తున్నాడా?! భారత్, పాకిస్థాన్ ఆసియా కప్ సూపర్ 4 పోరు నేడు.
నవతెలంగాణ-కొలంబో
ప్రపంచ క్రికెట్ దాయాదులు భారత్, పాకిస్థాన్. ఈ రెండు జట్లు బరిలో నిలిస్తే.. ఉత్కంఠ, నాటకీయత, భావోద్వేగాలు ఆకాశాన్ని అంటుతాయి. ఆసియా కప్ సూపర్ 4 దశ అందుకు మినహాయింపు కాదు. గ్రూప్ దశలో వరుణుడి రంగప్రవేశంతో అసంపూర్తిగా ముగిసిన మ్యాచ్ ఇరు జట్లను నిరాశకు గురి చేసినా.. నేడు సూపర్ సమరంతో ఆ లోటు భర్తీ చేసేందుకు రోహిత్, బాబర్ సేనలు రంగం సిద్ధం చేసుకున్నాయి. 90 శాతం వర్షం సూచనలు ఉండటంతో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డే సైతం కేటాయించారు. దీంతో వరుణుడు అడ్డుతగిలినా.. సోమవారం మ్యాచ్ మళ్లీ మొదలు కానుంది.
రాహుల్‌కు చోటుందా?!
గ్రూప్ దశ మ్యాచులకు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్.. నేడు పాక్‌తో పోరుకు అందుబాటులో ఉన్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టి రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇదే సమయంలో పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా సైతం తిరిగి జట్టుతో చేరాడు. దీంతో బుమ్రా కోసం పేస్ విభాగంలో ఎవరు తమ స్థానం త్యాగం చేస్తారనే ఆసక్తి సైతం నెలకొంది. మహ్మద్ షమి బెంచ్‌కు పరిమితం అవుతాడా, లేదంటే మరో పేసర్‌ను తప్పిస్తారో చూడాలి. బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి సహా శ్రేయస్ అయ్యర్‌లు పాకిస్థాన్ పేసర్లకు దాసోహం అయ్యారు. నేడు సూపర్ 4 మ్యాచ్‌లో భారత టాప్-4 బ్యాటర్లు ప్రతీకార ఇన్నింగ్స్‌లు ఆడాలని ఎదురు చూస్తున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో జట్టులో నిలిచినా.. బుమ్రాకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో జులై తర్వాత తొలిసారి బుమ్రా వన్డేలో బౌలింగ్ చేయనున్నాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు పాక్‌పై మాయజాలం చేస్తారేమో చూడాలి.
పాక్‌కు పేసర్లే అండ
పాకిస్థాన్‌కు ఆ జట్టు పేసర్లే గొప్ప బలం. లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కొవటంలో భారత బ్యాటర్ల బలహీనత అందరికీ తెలిసిందే. నాణ్యమైన పేసర్లతో కూడిన పాకిస్థాన్.. ఆ బలహీనతను ప్రతిసారీ సొమ్ముచేసుకుంటుంది. షహీన్ షా అఫ్రిది, హరీశ్ రవూఫ్, నసీం షాలు మంచి ఫామ్‌లో ఉన్నారు. సీమ్‌తో షహీన్ షా, స్పీడ్‌తో రవూఫ్ మెరుస్తుండగా.. ఈ రెండింట మేళవింపుతో నసీం షా జోరు చూపిస్తున్నాడు. నేటి మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌కు ఈ ముగ్గురు పేసర్లే కీలకం కానున్నారు. కొత్త బంతితో పవర్‌ప్లేలో, డెత్ ఓవర్లలోనే షహీన్ షా పెద్దగా ప్రభావం చూపించటం లేదు. దీంతో కొత్త బంతితో షహీన్ షాను నిలువరిస్తే.. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు పరుగుల వేటపై దృష్టి సారించవచ్చు. అందుకే ఆరంభంలోనే భారత్‌ను దెబ్బతీయాలనే వ్యూహంతో పాకిస్థాన్ కనిపిస్తుంది. కెప్టెన్ బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్ సహా ఇమామ్ ఉల్ హాక్ ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్ ఫకర్ జమాన్ సైతం ఫామ్‌లోకి వస్తే పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ సైతం బలోపేతం కానుంది.
వర్షార్పణమేనా?! :
2019 వరల్డ్‌కప్ తర్వాత తొలిసారి భారత్, పాకిస్థాన్‌లు ఓ వన్డేలో తలపడటం ఈ ఆసియాకప్‌లోనే. కానీ గ్రూప్ దశ మ్యాచ్‌లో దాయాదుల సమరం అసంపూర్తిగా ముగిసింది. ఎడతెగని వర్షంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీంతో అభిమానులు, ప్రసారదారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోమారు దాయాదులు ధనాధన్‌కు సిద్ధమవుతుండగా.. వరుణుడు అడ్డుగా నిలుస్తున్నాడు. నేడు కొలంబోలో 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నాం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుండగా.. ఆ సమయానికి జోరు వాన కురిసే ప్రమాదం ఉంది. వర్షం ముప్పుతోనే భారత్, పాక్ సూపర్ 4 సమరానికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రత్యేకంగా రిజర్వ్ డే కేటాయించింది. అయితే, ఆదివారంతో పాటు సోమవారం సైతం ఇక్కడ అంతే తీవ్ర వర్షం సూచనలు ఉన్నాయి. సోమవారం సైతం 80-90 శాతం వర్షం కురువనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రిజర్వ్ డే లభించినా.. భారత్,పాకిస్థాన్ సూపర్ 4 సమరం జరిగేనా? అనే అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి!.
తుది జట్లు (అంచనా)
భారత్ : శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ : ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్, బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఆగా సల్మాన్, ఇఫ్తీకార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షహీన్ షా అఫ్రిది, నషీం షా, హరీశ్ రవూఫ్.