– జట్టులోకి యశస్వి, సంజూ, దూబె
– ఆధిక్యంపై టీమ్ ఇండియా గురి
– నేడు జింబాబ్వేతో మూడో టీ20 పోరు
– సాయంత్రం 4.30 నుంచి సోనీస్పోర్ట్స్‌లో..
జింబాబ్వేతో తొలి మ్యాచ్‌లో కంగుతిన్నప్పటికీ.. ఒక్కరోజులోనే సత్తా చాటి సిరీస్ సమం చేసింది శుభ్‌మన్ గిల్ సేన. పొట్టి పోరులో ఇప్పుడు ఆధిక్యంపై కన్నేసిన టీమ్ ఇండియా నేడు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. టీ20 ప్రపంచకప్ చాంపియన్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు నేడు మూడో టీ20కి అందుబాటులో ఉండనున్నారు. టీమ్ ఇండియాకు ఇది అదనపు బలం కానుండగా.. ఆతిథ్య జింబాబ్వేకు ఆందోళన రెట్టింపు చేయనుంది. భారత్, జింబాబ్వే మూడో టీ20 నేడు .
నవతెలంగాణ-హరారే
భారత్, జింబాబ్వే టీ20 సిరీస్ ఆసక్తికరంగా మారుతుంది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సహా రవీంద్ర జడేజాలు పొట్టి ఫార్మాట్‌కు దూరమయ్యారు. ఈ ముగ్గురు క్రికెటర్ల స్థానాలను భర్తీ చేసేందుకు యువ క్రికెటర్లు ఈ సిరీస్ నుంచే ప్రయత్నాలు మొదలెట్టారు. అభిషేక్ శర్మ, రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివం దూబెలు సైతం నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రావటంతో భారత్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఆతిథ్య జింబాబ్వే సైతం మెరుగ్గానే కనిపిస్తోంది. కాస్త విలక్షణంగా స్పందిస్తున్న హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్‌పై పరుగుల వేట, వికెట్ల జాతర సవాల్‌గా మారింది. తొలి మ్యాచ్ స్ఫూర్తితో జింబాబ్వే ఆటగాళ్లు సైతం ఉత్సా హంగానే కనిపిస్తున్నారు. సీనియర్ క్రికెటర్లు అందు బాటులో లేకపోయినా.. కుర్రాళ్లు మెరుగ్గా ఆడు తున్నారు. భారత్, జింబాబ్వే మూడో టీ20 నేడు.
ఆ ముగ్గురు వచ్చారు
2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయం సాధించిన జట్టు స్వదేశంలో భారీ సంబురాల్లో మునిగితేలింది. ఆ జట్టులోని ముగ్గురు క్రికెటర్లు నేడు మూడో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ సంజు శాంసన్ సహా ఆల్‌రౌండర్ శివం దూబె నేడు బరిలోకి దిగనున్నారు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివం దూబెలలో దూబె ఒక్కడే వరల్డ్‌కప్ తుది జట్టులో నిలిచాడు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్‌లకు సత్తా చాటే అవకాశం రాలేదు. దీంతో జింబాబ్వేతో సిరీస్‌లో దంచికొట్టేందుకు ఎదురుచూస్తున్నారు. జైస్వాల్ కోసం టాప్-3 బ్యాటింగ్ లైనప్‌లో ఒకరు బెంచ్‌కు పరమితం కానున్నారు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్థానంలో సంజు శాంసన్ ఆడనున్నాడు. శివం దూబె నేరుగా తుది జట్టులోకి రానున్నాడు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, రతురాజ్ గైక్వాడ్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. సంజు శాంసన్, శివం దూబెలతో మిడిల్ ఆర్డర్ సైతం బలోపేతంగా మారింది. అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. రవి బిష్ణోరు స్పిన్ మ్యాజిక్‌తో జింబాబ్వే బ్యాటర్లకు ఉచ్చు బిగిస్తున్నాడు. రింకూ సింగ్, వాషింగ్టన్ సైతం కీలకం కానున్నారు.
పోటీ ఇవ్వగలరా?
భారత్‌తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు..జింబాబ్వేపై ఎవరికీ ఎటువంటి అంచనాలు లేవు. కానీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే అద్భుతం చేసింది. శుభ్‌మన్ గిల్ సేనకు గట్టి షాక్ ఇచ్చి 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ సికిందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బ్రియాన్ బెనెట్, జొనాథన్ కాంప్‌బెల్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. దూకుడుగా ఆడుతూ.. బౌలర్ల ప్రణాళిలకలను తారుమారు చేస్తున్నారు. బ్యాటింగ్ లైనప్‌లో సహచర ఆటగాళ్లు సైతం అంచనాల మేరకు రాణిస్తే గట్టి పోటీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. స్పిన్ ఎదుర్కోవటంలో జింబాబ్వే బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. నేటి మ్యాచ్‌లోనూ రవి బిష్ణోరు నాలుగు ఓవర్లను ఆడటం జింబాబ్వేకు కఠిన సవాల్ కానుంది.
పిచ్, వాతావరణం
హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ బ్యాటర్లకు సవాల్ విసురుతుంది. పిచ్ నుంచి మంచి పేస్ లభించనుంది. ఆరంభంలో పేస్, అదనపు బౌన్స్‌తో పవర్‌ప్లేలో పరుగుల వేట కాస్త కష్టం. కానీ బంతి పాతబడిన తర్వాత.. పరుగుల వేట బ్యాటర్లకు సులభతరం కానుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భారత్, జింబాబ్వే మూడో టీ20కి ఎటువంటి వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ సమాచారం.
తుది జట్లు (అంచనా) :
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబె, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోరు, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
జింబాబ్వే: ఇన్నోసెంట్, వెస్లీ, బ్రియాన్ బెనెట్, సికిందర్ రజా (కెప్టెన్), జొనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మాదాండె (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జ, ల్యూక్ జాంగ్వే, బ్లెస్సింగ్ ముజరబాని, టెండారు చతార.