– వైట్‌వాష్ ప్రమాదంలో టీమ్ ఇండియా
– క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన న్యూజిలాండ్
– రేపటి నుంచి భారత్, కివీస్ మూడో టెస్టు
– ఉదయం 9.30 నుంచి జియో సినిమాలో..
స్వదేశంలో 12 ఏండ్లుగా, 18 టెస్టు సిరీస్‌ల్లో టీమ్ ఇండియా అజేయ ప్రస్థానానికి న్యూజిలాండ్ బ్రేక్ వేసింది. బెంగళూర్, పుణె టెస్టుల్లో అసమాన రీతిలో భారత్‌పై పైచేయి సాధించింది. భారత గడ్డపై చారిత్రక తొలి టెస్టు సిరీస్ సాధించిన న్యూజిలాండ్ ఇప్పుడు ఏకంగా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. సొంతగడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ ఎరుగని భారత్ ఇప్పుడు 0-3 ఓటమి ప్రమాదంలో పడింది!.
ఆఖరు టెస్టులో విజయంతో ఊరటతో పాటు విలువైన ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల కోసం టీమ్ ఇండియా ముంబయిలో అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మంచి స్కోర్లతో ఫామ్‌తో, జట్టును గెలుపు బాట పట్టిస్తారనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్, న్యూజిలాండ్ మూడో టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి ఆరంభం.
నవతెలంగాణ-ముంబయి
భారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఎవరూ ఊహించని పరిస్థితులు చివరి టెస్టు ముంగిట నెలకొన్నాయి. శ్రీలంక చేతిలో దారుణ పరాజయం చవిచూసి భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ అచ్చొచ్చిన పరిస్థితుల్లో బెంగళూర్‌లో, ఆత్మవిశ్వాసంతో పుణెలో అద్భుత విజయాలు నమోదు చేసింది. 2-0తో టెస్టు సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకుంది. మూడో టెస్టులో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఆడుతుందని భావించిన టీమ్ ఇండియా.. అందుకు భిన్నంగా వైట్‌వాష్ ప్రమాదం నుంచి తప్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. చిన్నస్వామిలో పేస్, పుణెలో స్పిన్ మ్యాజిక్ నడువగా.. ముంబయిలో బ్యాటర్ల మెరుపులు లాంఛనమేనని తెలుస్తోంది. నవంబర్ 1 నుంచి భారత్, న్యూజిలాండ్ మూడో టెస్టు షురూ కానుంది.
బ్యాటింగ్ మెరుగయ్యేనా?
స్పిన్‌పై టీమ్ ఇండియా బ్యాటర్ల ప్రదర్శన ఆందోళనకరంగా మారింది. టాప్-7 బ్యాటర్లలో యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ మినహా సీనియర్ బ్యాటర్లు అందరూ తేలిపోతున్నారు. టర్న్ పిచ్‌పై స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆపసోపాలు పడుతున్నారు. లోయర్ ఆర్డర్‌లో జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్‌లు స్పెషలిస్ట్ బ్యాటర్ల కంటే మెరుగ్గా స్పిన్‌పై పరుగులు రాబడుతున్నారు. కీలక ఆస్ట్రేలియా పర్యటన ముంగిట విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు స్పిన్ ఫోబియా నుంచి బయటపడాల్సి ఉంది. ముంబయిలో అంచనాలను తగినట్టు రాణిస్తేనే.. భారత్ వైట్‌వాష్ గండం నుంచి గట్టెక్కగలదు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ గొప్ప ఫామ్‌లో ఉన్నారు. స్పిన్, పేస్ తేడా లేకుండా పరుగుల వేటలో ఆకట్టుకుంటున్నారు. చివరి టెస్టులోనూ భారత్‌కు ఈ ముగ్గురి ప్రదర్శన కీలకం. యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తొలిసారి సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. వాంఖడెలో ఎన్నో సెంచరీలు బాదిన సర్ఫరాజ్.. న్యూజిలాండ్‌పై మరో మూడెంకల స్కోరు అందుకుంటాడనే అంచనాలు ఉన్నాయి. స్పిన్ విభాగంలో అశ్విన్, జడేజాలకు తోడుగా అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చే వీలుంది. పేస్ విభాగంలో జశ్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి లభిస్తే హర్షిత్ రానా అరంగేట్రం చేయటం లాంఛనమే. లేదంటే, మహ్మద్ సిరాజ్ స్థానంలో యువ పేసర్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంది.
జోరుమీదున్న న్యూజిలాండ్
శ్రీలంక చేతిలో 0-2తో సిరీస్ ఓటమి. కెప్టెన్ రాజీనామాతో కొత్త నాయకత్వం. స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయంతో దూరం. ఈ పరిస్థితుల్లో భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్.. ఎవరూ ఊహించలేని చరిత్ర సృష్టించింది. బెంగళూర్ టెస్టులో గెలుపుతో 36 ఏండ్ల తర్వాత తొలిసారి భారత్‌లో టెస్టు విజయం రుచి చూసిన కివీస్.. పుణె టెస్టులో విజయంతో చారిత్రక తొలి టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వాంఖడెలో గెలుపుపై కన్నేసిన న్యూజిలాండ్ ఏకంగా క్లీన్‌స్వీప్ విజయం కోసం ఎదురుచూస్తుంది. ఇక్కడి పిచ్‌లపై కివీస్ బ్యాటర్లు మెరుగ్గా ఆడుతున్నారు. టామ్ లేథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్ సహా రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్ నిలకడగా రాణిస్తున్నారు. పేసర్లు మాట్ హెన్రీ, టిమ్ సౌథీలకు తోడు స్పిన్నర్లు శాంట్నర్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్‌లు మాయ చేస్తున్నారు. బ్యాటర్లు, పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణించటం న్యూజిలాండ్ విజయాన్ని సాధ్యం చేసింది. అదే ఫార్ములాతో వాంఖడె టెస్టులోనూ న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది.
స్పిన్ సవాల్
వాంఖడె ఎర్రమట్టి పిచ్‌పై స్పిన్ సవాల్‌కు రంగం సిద్ధమైంది. భారత స్పిన్నర్ల కంటే న్యూజిలాండ్ స్పిన్నర్లు పుణెలో మెరుగైన ప్రదర్శన చేశారు. మన బ్యాటర్లు స్పిన్ పిచ్‌పై పూర్తిగా తేలిపోయారు. వాంఖడెలో భారత బ్యాటర్లతో పాటు స్పిన్నర్లు సైతం కఠిన పరీక్ష ఎదుర్కొవాల్సి ఉంది. శాంట్నర్, అజాజ్, ఫిలిప్స్‌లను భారత బ్యాటర్లు ఏ మేరకు ఎదుర్కొంటారో చూడాలి. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్‌ను అశ్విన్, జడేజా, అక్షర్ త్రయం తక్కువ స్కోరుకు మాయ చేయగలదా? ఆసక్తికరం. చివరగా 2021 డిసెంబర్‌లో వాంఖడెలో భారత్, న్యూజిలాండ్ ఓ టెస్టు మ్యాచ్‌లో తలపడ్డాయి. అశ్విన్ మ్యాజిక్‌తో భారత్ తిరుగులేని విజయం సాధించింది. కానీ కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ తొలి ఇన్నింగ్స్‌లో పది వికెట్లు సహా ఓవరాల్‌గా 14 వికెట్లతో మెరిశాడు. దీంతో ఈ ఇద్దరు స్పిన్నర్లపై నేటి మ్యాచ్‌లో ఫోకస్ నెలకొంది.
పిచ్, వాతావరణం
వాంఖడెలో ఎర్రమట్టి పిచ్ సిద్ధం చేశారు. ఎర్రమట్టి సహజంగా పేస్‌ను అనుకూలం. పిచ్ తొలి రోజు బ్యాటర్లకు.. రెండో రోజు నుంచి స్పిన్‌ను సహకరించేలా రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. మూడో రోజు నుంచి ఈ పిచ్‌పై టర్న్‌ను ఎదుర్కొవటం బ్యాటర్లకు సవాల్ కానుంది. టాస్ కీలక పాత్ర పోషించనుంది. తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఇరు జట్లు మొగ్గుచూపుతున్నాయి. ముంబయి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. ఐదు రోజుల పాటు టెస్టు మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జశ్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రానా.
న్యూజిలాండ్ : టామ్ లేథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఓరౌర్క్.