బీజేపీలో చేరగానే నీతిమంతులవుతారా?

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నేరేడుచర్
అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేలు, మంత్రులు.. పలువురు రాజకీయనాయకులు బీజేపీలో చేరితే వారంతా నీతిమంతులవుతారా అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి ప్రశ్నించారు. శనివారం ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆదివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలోని అరిబండి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్పందిస్తూ ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఏ రాష్ట్రంలో జరగలేదన్న ప్రధాని మోడీ కేంద్రంలో ఉన్నది వారి ప్రభుత్వమే కదా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. దేశంలోని అన్ని రకాల వస్తువులపై జీఎస్టీని ఇష్టమొచ్చిన రీతిలో పెంచుకుంటూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. బ్యాంకుల్లో రూ.లక్షల కోట్లు అప్పులు తీసుకుని ఎగవేతకు పాల్పడే వారికి కేంద్రం అండగా నిలిచిందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు అదాని ఆస్తి రూ.40 వేల కోట్లు ఉండేదని, ఇప్పుడు రూ.11లక్షల కోట్లకు చేరిందన్నారు. 60,70 ఏండ్లుగా ప్రజలంతా ఏర్పాటు చేసుకున్న పబ్లిక్‌ సెక్టార్లను బడా కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా అమ్మేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రానప్పుడు దేశంలో రూ.60 లక్షల కోట్ల అప్పు ఉండగా, నేడు రూ.1.47లక్షల కోట్లకు చేరిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను కూల్చడమే ధ్యేయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడంతో పాటు మతవిధ్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణలో బలపడాలని చూస్తున్నారన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన తెలంగాణ ప్రజలు ఇలాంటి వారిని దగ్గరకు రానివ్వరని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని నడపాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మల్లు గౌతమ్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్‌, మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, కుంకు తిరుపతయ్య, నీలా రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.