సిరీస్‌ పట్టేస్తారా?

తొలి టెస్టు నుంచి విరాట్‌ కోహ్లి లేడు. బ్యాటింగ్‌ లైనప్‌ బలహీనంగా కనిపించినా.. భారత్‌ నెట్టుకొచ్చింది. ఇప్పుడు రాంచి టెస్టుకు జశ్‌ప్రీత్‌– 3-1 ఆధిక్యంపై భారత్‌ గురి
–  సిరీస్‌ సమంపై ఇంగ్లాండ్‌ ఆశలు
–  నేటి నుంచి నాలుగో టెస్టు పోరు
తొలి టెస్టు నుంచి విరాట్‌ కోహ్లి లేడు. బ్యాటింగ్‌ లైనప్‌ బలహీనంగా కనిపించినా.. భారత్‌ నెట్టుకొచ్చింది. ఇప్పుడు రాంచి టెస్టుకు జశ్‌ప్రీత్‌ బుమ్రా దూరం. బ్యాట్‌తో, బంతితో అత్యుత్తమ ఆటగాళ్ల సేవలు లేకుండా సిరీస్‌ను ఇక్కడే సొంతం చేసుకోవాలని టీమ్‌ ఇండియా సిద్ధమవుతోంది. బజ్‌బాల్‌ మేనియాలో ఇప్పటివరకు సిరీస్‌ ఓటమి ఎరుగని ఇంగ్లాండ్‌.. రాంచిలో లెక్క సరి చేయాలనే ఆలోచనలో ఉంది. స్పిన్‌ స్వర్గధామ పిచ్‌పై భారత్‌, ఇంగ్లాండ్‌ నాల్గో టెస్టు సమరం నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-రాంచి : భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ ఆసక్తికర దశకు చేరుకుంది. తొలి టెస్టు ఓటమి నుంచి పుంజుకున్న భారత్‌ వరుసగా రెండు టెస్టుల్లో ఘన విజయాలు సాధించింది. ఇప్పుడు రాంచిలో హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. బజ్‌బాల్‌ మంత్ర నమ్ముకున్న ఇంగ్లాండ్‌ ఏ దశలోనూ ఓటమిని అంగీకరించదు. 3-1తో సిరీస్‌పై భారత్‌ కన్నేయగా.. 2-2తో లెక్క సమం చేయాలని ఇంగ్లాండ్‌ సిద్ధమవుతోంది. విరాట్‌ కోహ్లి, జశ్‌ప్రీత్‌ బుమ్రా లోటును ఇంగ్లాండ్‌ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది. ఓటమి నైరాశ్యం దరిచేరని ఇంగ్లాండ్‌ రాంచిలో గట్టి పోటీ ఇవ్వాలని చూస్తుంది. రాంచిలోనే భారత్‌కు సిరీస్‌ దక్కుతుందా? ధర్మశాల వరకు ఇంగ్లాండ్‌ సిరీస్‌ను తీసుకెళ్లగలదా? ఆసక్తికరం.
అతడికి ఎదురేది?! : భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. మూడు టెస్టుల్లో 109 సగటుతో 545 పరుగులు చేశాడు. మరో బ్యాటర్‌ యశస్వి గణాంకాలకు చేరువలో లేడు. రెండు ద్వి శతకాలు బాదినా.. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కలేదనే విమర్శ వినిస్తుంది. 81 స్ట్రయిక్‌రేట్‌తో దండయాత్ర చేస్తున్న యశస్వి.. ఇప్పటికే 22 సిక్సర్లతో టెస్టు క్రికెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గత టెస్టుల మాదిరిగానే రాంచిలోనూ భారత బ్యాటింగ్‌ బలంగా ఏమీ కనిపించటం లేదు. కానీ యశస్వి జైస్వాల్‌కు శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ సహా సర్ఫరాజ్‌ జత కలవటంతో బ్యాటింగ్‌ లైనప్‌ కుదుటపడింది. అరంగ్రేట ఆటగాళ్లు ద్రువ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ మెప్పించారు. రాంచిలో భారత్‌ను ఎదురించేందుకు ఇంగ్లాండ్‌ ముందుగా యశస్వి జైస్వాల్‌ను ఎలా ఆపాలో తెలుసుకోవాలి. జశ్‌ప్రీత్‌ బుమ్రా లేని వేళ ముకేశ్‌ కుమార్‌ తోడుగా మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌లు స్పిన్‌ మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఆ ఇద్దరు మెరిస్తే..! : ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ మంత్ర భారత్‌లో కాసింత పని చేసింది. కానీ ఆ జట్టు ఎక్స్‌ ఫ్యాక్టర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో, ప్రధాన బ్యాటర్‌ జో రూట్‌ అంచనాలను అందుకోలేదు. బెన్‌ డకెట్‌, ఒలీ పోప్‌, బెన్‌ స్టోక్స్‌ నిలకడగా రాణించినా.. మిడిల్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. జో రూట్‌ మూడు టెస్టుల్లో 77 పరుగులే చేయగా.. జానీ బెయిర్‌స్టో 102 పరుగులు సాధించాడు. వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు బెన్‌ ఫోక్స్‌ చూసుకుంటున్నా.. జానీ బెయిర్‌స్టో పరుగుల వేటలో దారుణంగా విఫలమయ్యాడు. జో రూట్‌, జానీ బెయిర్‌స్టోపై జట్టు మేనేజ్‌మెంట్‌ అపార నమ్మకం ఉంది. ఇప్పుడు కెప్టెన్‌, కోచ్‌ నమ్మకాన్ని నిలబెట్టే అవకాశం జో రూట్‌, జానీ బెయిర్‌స్టోల ముందుంది. రాంచిలో ఈ ఇద్దరు రాణిస్తే ఇంగ్లాండ్‌ మంచి పోటీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జాక్‌ క్రావ్లీ, బెన్‌ డకెట్‌ దూకుడుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. లేదంటే, ఈ ఓపెనర్లు వేగంగా మ్యాచ్‌ను లాగేసుకుంటారు. పేసర్‌ మార్క్‌వుడ్‌ స్థానంలో ఒలీ రాబిన్సన్‌, స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ స్థానంలో షోయబ్‌ బషీర్‌ ఇంగ్లాండ్‌ తుది జట్టులోకి వచ్చారు.
పిచ్‌, వాతావరణం : తొలి మూడు టెస్టుల కంటే మెరుగైన స్పిన్‌ వికెట్‌ రాంచిలో సిద్ధమైంది. రెండో రోజు నుంచే ఇక్కడ స్పిన్‌ ప్రభావం ఆశించవచ్చు. పిచ్‌కు ఓ వైపు ఎక్కువ పగుళ్లు కనిపిస్తున్నాయి. బ్యాటర్లకు ఇక్కడ టర్న్‌ను ఎదుర్కొవటం సవాల్‌గా నిలువనుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. టెస్టు మ్యాచ్‌లో మూడు, ఐదో రోజు వర్షం సూచనలు ఉన్నాయి.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌.
ఇంగ్లాండ్‌ : జాక్‌ క్రావ్లీ, బెన్‌ డకెట్‌, ఒలీ పోప్‌, జో రూట్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), బెన్‌ ఫోక్స్‌ (వికెట్‌ కీపర్‌), టామ్‌ హర్ట్‌లీ, ఒలీ రాబిన్సన్‌, జేమ్స్‌ అండర్సన్‌, షోయబ్‌ బషీర్‌.