లంకను దాటేస్తారా?

Skip Lanka?– భారత్‌కు నేడు కీలక మ్యాచ్‌
దుబాయ్ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా మరో కీలక సవాల్‌కు సిద్ధమైంది. గ్రూప్‌-లో రెండు మ్యాచులు ఆడిన భారత్‌ ఓ మ్యాచ్‌లో విజయం సాధించి, మరో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. న్యూజిలాండ్‌ చేతిలో భారీ ఓటమితో హర్మన్‌ప్రీత్‌ సేన నెట్‌ రన్‌రేట్‌ భారీగా దెబ్బతింది. తర్వాతి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. దీంతో నేడు శ్రీలంకతో సమరంలోనే భారీ విజయం సాధించి నెట్‌ రన్‌రేట్‌ను మెరుగు పర్చుకోవటంపై భారత్‌ గురి పెట్టింది. ఇక్కడి పిచ్‌లు చాలా నెమ్మదిగా ఉన్నాయి. టీమ్‌ ఇండియా దూకుడు శైలికి సరిపోవటం లేదు. టాప్‌ ఆర్డర్‌లో కీలక బ్యాటర్లు తొలి పది ఓవర్లలోనే నిష్క్రమిస్తే మిడిల్‌ ఆర్డర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భిన్నమైన ప్రణాళిక అమలు చేసి సక్సెస్‌ అయ్యారు. కానీ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఎక్కువ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. నేడు శ్రీలంకతో మ్యాచ్‌లో బ్యాటర్లు కాస్త వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. షెఫాలీ వర్మ, మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సహా జెమీమా రొడ్రిగస్‌ భారత్‌కు కీలకం కానున్నారు. పేసర్లు అరుంధతి రెడ్డి, రేణుక సింగ్‌ సహా స్పిన్నర్‌ దీప్తి శర్మ శ్రీలంకతో మ్యాచ్‌ ఫలితాన్ని ప్రభావితం చేయనున్నారు. భారత్‌, శ్రీలంక మహిళల పోరు నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది.