– సఫారీతో రెండో టెస్టు నేటి నుంచి
– కేప్‌టౌన్‌లో రోహిత్‌సేనకు కఠిన పరీక్ష
– 2-0 విజయంపై దక్షిణాఫ్రికా గురి
– మ||1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-కేప్‌టౌన్
కొత్త ఏడాది. పాత సవాల్. సఫారీ పర్యటనలో టీమ్ ఇండియా ఎదుర్కొంటున్న విచిత్ర పరిస్థితి. 32 ఏండ్లుగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ విజయం కోసం ప్రయత్నిస్తున్న టీమ్ ఇండియా మరో అవకాశం చేజార్చుకుంది. ఏమాత్రం అచ్చిరాని కేప్‌టౌన్‌లో ఇప్పుడు సిరీస్ కాపాడుకునే పరీక్షకు సిద్ధమైంది. ఆతిథ్య దక్షిణాఫ్రికా 2-0 టెస్టు సిరీస్ విజయం కోసం బరిలోకి దిగుతుండగా.. భారత్ 1-1తో సిరీస్‌ను సమం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు సమరం నేటి నుంచి ఆరంభం.
సఫారీ సవాల్‌లో మరో అంకానికి రంగం సిద్ధం. భారత్, దక్షిణాఫ్రికా కేప్‌టౌన్ వేదికగా నేటి నుంచి రెండో టెస్టులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుణుడి అంతరాయం, సఫారీ సారథికి గాయం.. ఇవేవీ సెంచూరియన్‌లో టీమ్ ఇండియా పరాజయాన్ని నిలువరించలేదు. బాక్సింగ్ డే టెస్టులో భారత్‌పై మూడు రోజుల్లోనే ఇన్నింగ్స్ విజయం అందుకున్న దక్షిణాఫ్రికా అదే ఉత్సాహంతో న్యూలాండ్స్ సమరానికి సై అంటోంది. అవమానకర ఓటమికి 2 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత జతకలవటం టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ. ఇటీవల విదేశీ గడ్డపై అసమాన ఫలితాలు సాధించిన టీమ్ ఇండియా అదే నమ్మకంతో నేడు కేప్‌టౌన్‌లో ఫైట్‌కు సై అంటోంది. ఇక్కడ ఆడిన ఆరు మ్యాచుల్లో భారత్‌కు ఒక్క విజయమూ దక్కలేదు.
భారత్‌కు చావోరేవో
కేప్‌టౌన్‌లో భారత్‌కు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణం. సెంచూరియన్‌లో పోరాడకుండానే చేతులెత్తేసిన రోహిత్‌సేన న్యూలాండ్స్‌లో నయా చరిత్ర లిఖించేందుకు ఎదురు చూస్తోంది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ విజయం అందుకోని ఏకైక ఆసియా జట్టుగా టీమ్ ఇండియా ఇప్పటికే చెత్త రికార్డును అక్కున చేర్చుకుంది. సిరీస్ దక్కే అవకాశాలు లేకపోయినా.. కనీసం చేజారకుండా చూసుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. బ్యాటింగ్ లైనప్‌లో విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ మినహా అందరూ నిరాశపరిచారు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లు రాణిస్తే మంచి స్కోరు సాధించవచ్చు. శ్రేయస్ అయ్యర్ సహజంగా షార్ట్ బంతులకు తడబడుతాడు. కానీ సెంచూరియన్‌లో ఫుల్ బంతులకు వికెట్ చేజార్చుకున్నాడు. ఫుల్ షాట్లతో కండ్లుచెదిరే సిక్సర్లు సంధించే అయ్యర్ లోపం దిద్దుకుంటే కేప్‌టౌన్‌లో సత్తా చాటగలడు. ఇక బంతితో బుమ్రా, సిరాజ్‌కు సహకారం అందించే మూడో పేసర్ కరువయ్యాడు. ప్రసిద్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్‌లు దారుణంగా విఫలమయ్యారు. తొలి టెస్టులో ధారాళంగా పరుగులు ఇచ్చారు. కేప్‌టౌన్‌లో ఇద్దరినీ పక్కనపెడతారా? లేదంటే ఒకరినే మార్చుతారా? అనేది ఆసక్తికరం. ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్ రూపంలో ఫామ్‌లో ఉన్న పేసర్లు అందుబాటులో ఉన్నారు.
ఎల్గర్ ఎదురుచూపులు
తెంబ బవుమాకు గాయంతో రెండో టెస్టులో సారథ్య పగ్గాలు వీడ్కోలు హీరో డీన్ ఎల్గర్‌కు దక్కాయి. సెంచూరియన్‌లో భారీ సెంచరీతో అదరగొట్టిన ఎల్గర్.. సిరీస్‌ను సఫారీ పరం చేశాడు. ఇప్పుడు రెండో టెస్టులోనూ ఆ ప్రదర్శన పునరావృతం చేస్తే.. 2-0తో ఎదురులేని విజయంతో సిరీస్ వశం కానుంది. కెరీర్ చివరి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఎల్గర్.. మరింత ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాడు. యువ క్రికెటర్లు అంచనాలు అందుకోవటం ఎల్గర్ గ్యాంగ్‌కు అదనపు బలం. అరంగ్రేటంలోనే డెవిడ్ బెడింగ్‌హామ్, బర్గర్‌లు రాణించారు. బర్గర్ పదునైన పేస్‌కు భారత బ్యాటర్లు తడబడ్డారు. డెవిడ్ బ్యాట్‌తో, వికెట్ల వెనకాల గ్లౌవ్స్‌తో ఆకట్టుకున్నాడు. కీగన్ పీటర్సన్, హమ్జాలు సైతం రాణిస్తే సఫారీ శిబిరంలో సమస్యలు కనిపించవు. టాప్ ఆర్డర్‌లో ఎల్గర్ సహా మార్క్‌రామ్, టోనీ మంచి ఫామ్‌లో ఉన్నారు. కగిసో రబాడ, బర్గర్, మార్కో జాన్సెన్‌లకు లుంగిసాని ఎంగిడి తోడైతే కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా పేస్ దాడిని ఎదుర్కొవటం అంత సులువు కాదు. స్పిన్ అనుకూలత దృష్ట్యా కేశవ్ మహరాజ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం
న్యూలాండ్స్ గ్రౌండ్ కొత్త క్యూరేటర్ చేతుల్లోకి వెళ్లింది. భారత్, దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్‌కు కాస్త ఎక్కువ పచ్చికను పిచ్‌పై ఉంచారు. ఆరంభంలో పేసర్లకు గొప్ప అనుకూలత ఉండనుంది. పిచ్‌పై పచ్చికతో పాటు పగుళ్లు సైతం ఉంటాయని తెలుస్తోంది. మ్యాచ్ సాగుతున్న కొద్ది స్పిన్నర్లకు పిచ్ నుంచి సహకారం దక్కవచ్చు. టెస్టు మ్యాచ్‌కు వర్షం సూచనలు లేవు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. బలంగా వీచే గాలులు బ్యాటర్లు, బౌలర్ల ఎదురుదాడి ప్రణాళికలను ప్రభావితం చేయనున్నాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా/రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్.
దక్షిణాఫ్రికా : డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఎడెన్ మార్క్‌రామ్, టోనీ డీ జార్జి, కీగన్ పీటర్సన్, హమ్జా, డెవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెనె (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్/ ఎంగిడి, కగిసో రబాడ, బర్గర్.
0/6
కేప్‌టౌన్ దక్షిణాఫ్రికాకు కంచుకోట. ఇక్కడ టీమ్ ఇండియా ఆరు టెస్టుల్లో పోటీపడింది. ఆరుసార్లూ విజయ వేటలో నిరాశే ఎదురైంది. ఆరు టెస్టుల్లో నాలుగింట సఫారీ జట్టు విజయం సాధించగా.. రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి. అయినా, న్యూలాండ్స్ పిచ్‌పై భారత్‌కు ఓ అనుకూలత ఉంది. ఇక్కడ పిచ్ పగుళ్లు తేలి స్పిన్ బాగా ఉపకరిస్తుంది. గతంలో ఇక్కడ హర్బజన్ సింగ్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. భారత్ అశ్విన్, జడేజాలతో బరిలోకి దిగితే.. ఎదురుదాడి వ్యూహం ఫలించేందుకు అవకాశాలు ఎక్కువ. ఈ టెస్టులో రోహిత్‌సేన నెగ్గితే.. కేప్‌టౌన్ కోటను బద్దలుకొట్టడమే కాదు సఫారీ గడ్డపై సరికొత్త రికార్డు నమోదు కానుంది!.