– గెలుపే లక్ష్యంగా టీమ్ ఇండియా
– స్పిన్ సవాల్‌కు కివీస్ సిద్ధం
– నేటి నుంచి భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు
– ఉదయం 9.30 నుంచి జియో సినిమాలో..
స్వదేశంలో టీమ్ ఇండియాకు కఠిన సవాల్. సొంతగడ్డపై టీమ్ ఇండియా 0-1తో వెనుకంజ వేయటం చాలా అరుదు. 2017లో ఆస్ట్రేలియా… 2021, 2024లో ఇంగ్లాండ్‌లు భారత్‌ను తొలి టెస్టులో ఓడించి ఇరకాటంలో పడేశాయి. న్యూజిలాండ్ తాజా సిరీస్‌లో ఆ పని చేసింది. బెంగళూర్ భారత్‌కు భంగపాటు మిగిల్చి.. స్వదేశీ సిరీస్‌లో రోహిత్‌సేనను ఒత్తిడిలోకి నెట్టేసింది.
ఓవైపు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు, మరోవైపు స్వదేశంలో వరుస సిరీస్ విజయాల రికార్డుకు గండం నేపథ్యంలో విజయమే లక్ష్యంగా టీమ్ ఇండియా నేడు పుణె టెస్టులో బరిలోకి దిగుతోంది. భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-పుణె
రోహిత్ శర్మ, గౌతం గంభీర్ జోడీ తొలిసారి ఐదు రోజుల ఆటలో విషమ పరీక్ష ఎదుర్కొంటున్నారు. బెంగళూర్‌లో ఊహించని ఓటమి ఎదురుకాగా టీమ్ ఇండియా ఇప్పుడు స్పిన్ పిచ్‌పై కన్నేసింది. స్పిన్ పిచ్ అండతో సిరీస్ సమం చేయాలనే ఆలోచనలో ఉన్న టీమ్ ఇండియా.. నేడు పుణెలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గతంలోనూ స్వదేశీ టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా 0-1తో వెనుకంజ వేసినా.. గతంలో నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భారత్ పుంజుకుంది. కానీ న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల సిరీస్ కావటంతో టీమ్ ఇండియా కాస్త ఒత్తిడిలో కనిపిస్తుంది. భారత్‌లో అరుదైన టెస్టు సిరీస్ వేటలో న్యూజిలాండ్ ఉండగా.. సొంతగడ్డ అనుకూల పరిస్థితుల్లో సిరీస్‌ను సమం చేయాలని భారత్ ఎదురు చూస్తుంది. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టులో నేటి నుంచి ఢకొీట్టనున్నాయి.
సమిష్టిగా మెరవాల్సిందే
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆధునిక క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరొందినా.. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఆడిన టెస్టుల్లో టీమ్ ఇండియా స్వల్ప స్కోర్లు నమోదు చేయటం గమనార్హం. బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్, విరాట్ కోహ్లి బాధ్యత చాలా తక్కువైంది. యువ ఆటగాళ్లు పరుగుల వేటలో దూసుకెళ్తున్నారు. సీనియర్లుగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అంచనాల మేరకు రాణించటం లేదు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ సహా రిషబ్ పంత్‌లు బ్యాటింగ్ లైనప్‌లో కీలకం. ఇటీవల టీమ్ ఇండియా బ్యాటర్లు సైతం స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవటం లేదు. కివీస్ శిబిరంలో అజాజ్ పటేల్, మిచెల్ శాంట్నర్‌లు గతంలో భారత్‌ను ఇరకాటంలో పడేశారు. ఇక్కడ ఆసీస్ స్పిన్నర్లు భారత్‌ను ఇబ్బంది పెట్టారు. అటువంటి పరిస్థితి పునరావతం కాకుండా బ్యాటర్లు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో అశ్విన్, జడేజా, కుల్దీప్ బ్యాటింగ్ నైపుణ్యం ఈ టెస్టులో భారతకు ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది.
స్పిన్ సవాల్‌కు సిద్ధమేనా?
విదేశీ గడ్డపై న్యూజిలాండ్‌కు అరుదుగా స్వదేశీ పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై కివీస్ చారిత్రక విజయం సాధించింది. కానీ పుణె టెస్టులో కివీస్‌కు అసలైన సవాల్ ఎదురు కానుంది. ఉపఖండపు ర్యాంక్ టర్నర్ పిచ్ ఇక్కడ సిద్ధం చేశారు. శ్రీలంకలో స్పిన్ పిచ్‌లపై న్యూజిలాండ్ బ్యాటర్లు తేలిపోయారు. పుణె స్పిన్ పిచ్‌పై అశ్విన్, జడేజా, కుల్దీప్‌లను ఎదుర్కొవటం న్యూజిలాండ్‌కు కఠిన సవాల్ కానుంది. కివీస్ శిబిరంలో రచిన్ రవీంద్ర, టామ్ లేథమ్‌లు స్పిన్‌ను బాగా ఆడగలరు. డెవాన్ కాన్వే, డార్లీ మిచెల్, విల్ యంగ్‌లు స్పిన్‌ను ఏ విధంగా ఆడతారో చూడాలి. మిచెల్ శాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, అజాజ్ పటేల్‌లు స్పిన్ బాధ్యతలు చూసుకోనుండగా.. మాట్ హెన్రీ, టిమ్ సౌథీలు పేస్ విభాగం చూసుకోనున్నారు.
సర్ఫరాజ్‌కే మొగ్గు
టీమ్ ఇండియా తుది జట్టు ఎంపికలో ఆరో బ్యాటర్ కోసం గట్టి పోటీ నెలకొంది. మెడ నొప్పితో తొలి టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ నేడు పుణె టెస్టుకు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. బెంగళూర్‌లో శుభ్‌మన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో చెలరేగాడు. కెఎల్ రాహుల్ తొలి టెస్టులో విఫలమయ్యాడు. ఇప్పుడు గిల్ నేరుగా తుది జట్టులోకి రానుండగా.. కెఎల్ రాహుల్‌ను పక్కనపెట్టి సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంచుకునే వీలుంది. స్పిన్ విభాగంలో జడేజా, అశ్విన్‌లకు తోడుగా కుల్దీప్ యాదవ్ మాయ చేయనున్నాడు. జశ్‌ప్రీత్ బుమ్రా పేస్ బాధ్యతలు తీసుకోనుండగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లలో ఒకరు రెండో పేసర్‌గా జట్టులో నిలువనున్నారు.
పిచ్, వాతావరణం
పుణె పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం కానుంది. చిన్నస్వామి పిచ్ పేసర్లను అనుకూలించటంతో పుణెలో పిచ్‌ను టర్న్‌కు అనుకూలంగా సిద్ధం చేసేందుకు.. భారత్ తహతహలాడింది. పిచ్‌పై లో బౌన్స్, అదిరే టర్న్ ఉండనుంది. మ్యాచ్ సాగుతున్న కొద్ది పిచ్‌పై తిరిగే బంతిని ఎదుర్కొవటం మరింత కష్టతరం అవనుంది. పుణెలో రానున్న ఐదు రోజుల పాటు ఎటువంటి వర్షం సూచనలు లేవు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/ఆకాశ్ దీప్.
న్యూజిలాండ్: టామ్ లేథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్.