ఇబ్రహీం నిర్గుణ్ రాసిన ‘నన్ను నాకు ఇచ్చేస్తారా’ అనే కవితను కవిసంగమం ఫేస్‌బుక్ గ్రూపులో చదివాను. విప్లవకవిత్వం, సామాజిక నేపథ్యంలో కవిత్వం రాసే ఈ కవి ప్రేమ కవితను ఇలా రాయటం నన్ను ఆకర్షించింది. తన కవితను నా పరిశీలనతో ఈ వారమిలా క్లిక్ మనిపిస్తున్నా. ఈ కవి ఇప్పటివరకు రెండు కవితా సంపుటులు వెలువరించాడు. అవి ఇప్పుడేమి రహస్యం కాదు, బహిరంగ ప్రకటన. ‘నన్ను నాకు ఇచ్చేస్తారా’ అంటున్న నిర్గుణ్ కవితను పరిశీలిద్దాం.
ఈ కవితకు పెట్టిన శీర్షిక ప్రియుడికి తన ప్రేమపై తనకెంత నమ్మకముందో తేటతెల్లం చేస్తుంది.
కవితలోపలికి తొంగి చూస్తే ప్రేమలో ఎంతో గాఢత, స్వచ్ఛత కనిపిస్తుంది. ‘నన్ను నాకు ఇచ్చేస్తారా’ అని శీర్షికను పెట్టడంలో కవి సాధించిన కొత్త ఒరవడి కనబడుతుంది.
కవితలోని మొదటి, రెండు స్టాంజాలలో పరిశీలిస్తే ఇక్కడ ప్రియుడు పూర్తిగా ఆమెలో ఐక్యమైన భావన కనిపిస్తుంది. సాధారణంగా కెమెరా క్లిక్ మంటుంది. ఎవర్ని చూసినా, ఎప్పుడు చూసినా. కానీ అతడి ప్రతిబింబం ఆమెలో కనిపించేంతలా క్లిక్ మన్నదంటే ఇక్కడ వాడింది ప్రేమ పూత పూసుకున్న విలక్షణ కెమెరా కావచ్చు. ఈ వస్తునిర్వహణలో కవి కవిత ఆత్మను దొరకబుచ్చుకున్న కెమెరా వాడాడు.
కవి, ప్రియుడు ఒకరేనా అనే సందేహం రావచ్చు. కవి ఏ రూపాన్నయినా ధరించే సమర్థుడు. అమ్మ కవితలో అమ్మ పాత్ర పోషిస్తాడు. వ్యక్తి అణచివేయబడుతున్నప్పుడు ఆ వ్యక్తిలోకి దూరి మాట్లాడుతాడు. ఊహాప్రేయసితో ముచ్చటిస్తాడు. కవిత్వపరంగా చూస్తే నేను, కవి చాలాసార్లు వేరు వేరు. నేను అనే పదం ఒక్కోసారి స్వానుభవం కావచ్చు.
మూడవ స్టాంజాలో ప్రేమ తీవ్రతను చూపించటానికి కవి రాసిన ఈ వాక్యాలు ప్రియున్ని, ప్రేయసి అతని లోంచి దూరం చేసి తనలో కలుపుకుందని తెలుపుతున్నాయి. వాస్తవానికి గుండెకాయను కోసిస్తే బతకరన్న విషయం అందరికీ తెలుసు. ప్రేయసి ప్రేమకు కొలబద్దగా కవి వాడిన వాక్యం అతిశయోక్తి (ష్ట్రyజూవతీ bశీశ్రీవ)లా కనబడ్డ ఆ ప్రేమను పొందుతున్న ప్రియుడి హృదయంలోంచి చూసినప్పుడు సర్వసాధారణం. ఇంకాస్త లోపలికెళ్ళి పరిశీలిస్తే కొంతమంది అంటున్న మాటలు అప్పుడప్పుడు వినబడుతున్నాయి.
ప్రేమ కవితలు రాసేటప్పుడు కవి ప్రేమికుడు కావాలా? పేదరికంలో ఉన్న వ్యక్తుల సమూహం గురించి రాసినప్పుడు కవి కటిక పేదరికాన్ని అనుభవించిన వాడే కావాలా? అని. ఇలాంటి ప్రశ్నలు సాహిత్యదృష్టి కోణాన్ని మరల్చుతున్నాయి. కవిని, కవిత్వాన్ని పక్కకు పెట్టి వ్యక్తి నేటివిటీని ఆరాధించటం వైపుగా అడుగులేస్తున్నాయి. సాహిత్యానికది మంచిది కాదేమో. నేను బోధిస్తున్న ప్రస్తుత పదవతరగతి పాఠంలో సామల సదాశివ రాసిన ‘యాది’ వ్యాసంలోని వాక్యాలు గుర్తుతెచ్చుకున్నప్పుడు ఈ ప్రశ్నలకు కొద్దిగా సమాధానం దొరికినట్టవుతుంది. మీర్ తఖీమీర్ అనే ఉర్దూ కవి కవిత్వం రాయడానికి మసీద్ మెట్ల ముందు కూర్చొని భిక్షమెత్తుకునే వాళ్ళను పరిశీలించి స్థానిక భాషా పదాలను జోడించి కవిత్వం రాసేవాన్ని అన్నాడు. అక్కడే అతను కూర్చొని భిక్షమెత్తుకొని అనుభవించి రాయాలి అనుకోవడం పైన ప్రశ్నలకు సమాధానాలు వెతకాలన్నంత వెర్రితనం. ఇదంతా ఎందుకంటే కవే ఈ కవితలోని ప్రేమికుడు కావాల్సిన అవసరం లేదన్న చిన్న వాదన.
చివరి స్టాంజాలో కవి అతనిలో ఆమె, ఆమెలో అతను ఎంతగా లీనమయ్యారో చెప్పకనే చెబుతున్నాడు.ఆ గాఢతతో కూడిన ప్రేమతత్వం నుండి బయటికి తీసుకురావడం ఎవరితరం కాదనే తెలిసి ముగింపు వాక్యాల కూర్పు అంతదృఢంగా, నేర్పుగా చేసుంటాడు. ఈ ముగింపు వాక్యాల పటిష్టత ఎంతలా ఉందంటే ఆమె గుండెనుండి అతన్ని తీయలేనంతగా. ఆమె కళ్ళల్లోనే అతన్ని ప్రతిబింబాన్ని వెతుక్కోవాలన్నంతగా. ఆమె గుండె ఆమెకివ్వటమనే మాటలోనే ఆమె, అతను ఎంతలా దగ్గరయ్యారో తెలుస్తుంది.
ప్రతిస్టాంజాను మనం వేరు వేరుగా చదువుకున్నప్పుడు ఓ మినీ కవిత దర్శనమిస్తుంది. ఈ కవితలో ప్రత్యేకత ఏమిటంటే సమన్వయం ఎక్కడా దెబ్బతినలేదు. నిజానికి ఈ కవి ఎర్రటి కిరణాలను కవితల్లోకి ఒంపటం చాలా సార్లు చూశాను. వెన్నెలధారలను కూడా కురిపించగలడని దీంతో పూర్తిగా అవగతమయింది. ఈ కవి అగ్గిని రాజేయగలడు, అమృతాన్ని కురిపించగలడు.
– తండా హరీష్
8978439551
నన్ను నాకు ఇచ్చేస్తారా
1. ఆమె
కళ్ళలో నా ప్రతిబింబం
కనిపించింది
2. కెమెరా
క్లిక్ మన్నట్లే
కనురెప్పలు క్లిక్ మన్నాయి
3. ఎంతకీ
నన్ను బయటకు రానివ్వదు
అడిగితే తెలీదంటుంది
ఇవ్వమంటే ఇవ్వలేనంటుంది
కొంచెం కోపంగానే ఇమ్మనడిగా
గుండెకాయ కోసిచ్చింది
4. మీరెవరైనా
నన్ను బయటకు తీసి
నాకు నన్ను ఇచ్చేస్తారా!!
ఆమె గుండె
ఆమెకిచ్చేస్తాను..
– ఇబ్రహీం నిర్గుణ్