– నేటి నుంచి సిడ్నీలో ఆఖరు టెస్టు పోరు
– 2-2తో సిరీస్ నిలుపుకోవాలని భారత్ తపన
– 3-1 విజయంపై కంగారూల గురి
– ఉదయం 5 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ప్రపంచ వన్డే చాంపియన్, ప్రపంచ టెస్టు చాంపియన్ ఆస్ట్రేలియా. కానీ పదేండ్లుగా ఆ జట్టుకు అందని ద్రాక్షగా మిగిలింది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. సిడ్నీలో కనీసం డ్రా ఆసీస్‌కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు ఈ ఫార్మాట్‌లో ఆధిపత్యం తిరిగి దక్కనుండగా.. భారత్ కచ్చితంగా నెగ్గితేనే ప్రతిష్టాత్మక ట్రోఫీని నిలుపుకోగలదు.
ప్రపంచ క్రికెట్‌ను ఉర్రూతలూస్తున్న భారత్, ఆసీస్ టెస్టు సమరం ఆఖరు అంకానికి చేరుకుంది. ఊహించని మలుపులు తిరుగుతూ, మైదానం వెలుపలా వాతావరణం వేడెక్కిస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టు నేటి నుంచి సిడ్నీలో ఆరంభం కానుంది. ఓ వైపు భారత శిబిరంలో లుకలుకలు వినిపిస్తుండగా.. ఆసీస్ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా సిడ్నీ సవాల్ నేటి నుంచి షురూ.
నవతెలంగాణ-సిడ్నీ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంతిమ ఘట్టానికి చేరుకుంది. పెర్త్‌లో టీమ్ ఇండియా సూపర్ విక్టరీ సాధించగా.. ఆడిలైడ్‌లో ఆసీస్ లెక్క సమం చేసింది. బ్రిస్బేన్‌లో వరుణుడు ఆట ఆడుకోగా.. బాక్సింగ్ డేలో కంగారూల పంచ్ విసిరారు. ఇప్పుడు సవాల్ సిడ్నీకి చేరుకుంది. పదేండ్లుగా ఊరిస్తున్న టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ఆతిథ్య ఆస్ట్రేలియా ఉత్సాహంగా కనిపిస్తోంది. మరోవైపు, 1-2తో సిరీస్‌లో వెనుకంజ వేసిన భారత్.. డ్రెస్సింగ్‌రూమ్‌లో అంతర్గత విభేదాల వార్తలతో నైరాశ్యంలో పడింది!. ఈ పరిస్థితి ఆసీస్‌కు మరింత మేలు చేయగలదు. గాయాలతో భారత్ నుంచి ఆకాశ్ దీప్, ఆసీస్ నుంచి మిచెల్ మార్ష్‌లు సిడ్నీ టెస్టుకు దూరమయ్యారు. ఆసీస్ జట్టులో ఒక్క మార్పు ఉండనుండగా.. భారత్ తుది జట్టులో కనీసం రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
తొలి ఇన్నింగ్స్ బలహీనత!
సిరీస్‌లో వెనుకంజ వేసిన టీమ్ ఇండియా సిడ్నీ టెస్టు ముంగిట తీవ్ర ఒత్తిడిలో పడింది. మెల్‌బోర్న్‌లో చివరి సెషన్లో ఏడు వికెట్లు కోల్పోయి చేజేతులా ఓటమిపాలైన భారత్.. సిడ్నీలో లెక్కలు సరి చేయటంపై దృష్టి సారించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా విఫలం అవుతుంది. ఈ సిరీస్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ సగటు 22.40. భారత్ నెగ్గిన పెర్త్ టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది. దీంతో, తొలుత భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 300-350 పరుగులు చేయటంపై ఫోకస్ పెట్టాలి. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మాత్రమే సిరీస్‌లో నిలకడగా పరుగులు సాధించారు. సిడ్నీ టెస్టులో ఈ ఇద్దరికి ఇతర బ్యాటర్లు జతకలిస్తే.. ఆసీస్‌ను ఓడించటం పెద్ద విషయం కాబోదు. కానీ, డ్రెస్సింగ్‌రూమ్‌లో విభేదాల వార్తలు అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి. చీఫ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్‌ల మధ్య విభేదాలు పొడచూపాయని వార్తలు వస్తున్నాయి. జట్టులోని సీనియర్ ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. ఇది మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఇక, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ మళ్లీ ఓపెనింగ్ చేయనుండగా.. శుభ్‌మన్ గిల్ జట్టులోకి రానున్నాడు. సిడ్నీలో గిల్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేయగా.. కోచ్ గంభీర్ స్వయంగా అతడిని పర్యవేక్షించాడు. ఆకాశ్ దీప్ స్థానంలో మరో పేసర్ ఆడనుండగా.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా భీకర ఫామ్‌లో ఉండగా.. అతడికి మరో ఎండ్ నుంచి మద్దతు లభించటం లేదు. మహ్మద్ సిరాజ్ సిడ్నీలోనైనా మెరిస్తే వికెట్ల వేటలో బుమ్రాకు ఊరట దక్కనుంది.
కంగారూల జోష్
ఆస్ట్రేలియా సిడ్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ గ్రౌండ్‌లో భారత్ రికార్డు సైతం పేలవంగా ఉంది. ఫామ్‌లో లేని ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరమైనా.. బ్యూ వెబ్‌స్టర్‌కు అరంగేట్ర అవకాశం దక్కనుంది. ఓపెనర్ శామ్ కాన్‌స్టాస్, వెబ్‌స్టర్‌లు భారత్‌ను ఎదుర్కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కెప్టెన్ పాట్ కమిన్స్ బంతితో, బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. ఆల్‌రౌండ్ షోతో మెల్‌బోర్న్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. గత టెస్టులో ట్రావిశ్ హెడ్ విఫలమైనా.. సిడ్నీలో అతడు భారత్‌కు ప్రమాదకరమే. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ ఫామ్‌లోకి రావటం ఆసీస్‌కు కొండంత బలం. ఇప్పటివరకు బౌలర్లతో పోటీపడిన భారత్.. ఇక సిడ్నీలో బ్యాటర్లను ఎదుర్కొనేందుకు సైతం చెమటోడ్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ టెస్టును డ్రా చేసుకున్నా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసీస్ సొంతం కానుంది. కానీ భారత్ విజయం సాధిస్తే.. డిఫెండింగ్ విన్నర్‌గా ట్రోఫీని టీమ్ ఇండియా అట్టిపెట్టుకోనుంది. దీంతో విజయమే లక్ష్యంగా కంగారూలు సిడ్నీలో బరిలోకి దిగనున్నారు.
పిచ్, వాతావరణం
సిడ్నీ పిచ్ పేసర్లకు అనుకూలం. కానీ తొలి నాలుగు టెస్టులతో పోల్చితే ఇక్కడే ప్రతి వికెట్‌కు 34.85 పరుగుల చొప్పున సగటు నమోదైంది. ప్రస్తుతం పిచ్‌పై మంచి పచ్చిక కనిపిస్తోంది. పిచ్ నుంచి సీమర్లకు అదనపు సానుకూలత లభించనుంది. టెస్టులో చివరి రెండు రోజులు వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం మెండుగా ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ/శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ/హర్షిత్ రానా, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, శామ్ కాన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిశ్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, స్కాట్ బొలాండ్, నాథన్ లయాన్.
రోహిత్‌కు మొండిచేయి?!
భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సిడ్నీ టెస్టులో చోటు లేదా?. శుభ్‌మన్ గిల్ కోసం రోహిత్ శర్మను బెంచ్‌కు పరిమితం చేయనున్నారా? దీనికి సమాధానం అవుననే వస్తోంది. తుది జట్టులో రోహిత్ ఉంటాడా? అని విలేకరులు గౌతం గంభీర్‌ను అడుగగా.. ఉదయం పిచ్‌ను పరిశీలించి తుది జట్టుపై నిర్ణయానికి వస్తామని వెల్లడించాడు. దీంతో రోహిత్‌కు చోటు కష్టమేనని తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్లోనూ రోహిత్ చురుగ్గా కనిపించలేదు. ఆలస్యంగా గ్రౌండ్‌కు వచ్చిన రోహిత్ త్రో డౌన్స్ ఎదుర్కొంటూ సాధన చేశాడు. గత తొమ్మిది టెస్టుల్లో రోహిత్ బ్యాటింగ్ సగటు 10.93. తాజా సిరీస్‌లో బ్యాటింగ్ సగటు 6.20 మాత్రమే. సాధారణంగా ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు కెప్టెన్ హాజరవుతాడు. సిడ్నీలో చీఫ్ కోచ్ గౌతం గంభీర్ మీడియా సమావేశానికి వచ్చాడు. బ్రిస్బేన్‌లోనూ శుభ్‌మన్ గిల్ హాజరైనా.. అప్పుడు ప్రాక్టీస్ సెషన్‌కు రోహిత్ శర్మ హాజరు కాలేదు.
38 – టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయికి స్టీవ్ స్మిత్ 38 పరుగుల దూరంలో ఉన్నాడు. సిడ్నీలో 38 పరుగులు సాధిస్తే.. పది వేల క్లబ్‌లో ఆసీస్ దిగ్గజాలు అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్ సరసన స్మిత్ నిలువనున్నాడు.
24 – ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ సొంత మైదానం సిడ్నీ. కానీ ఈ గ్రౌండ్‌లో అతడికి మంచి గణాంకాలు లేవు. తొమ్మిది టెస్టుల్లో 44.16 సగటుతో 24 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
1- బోర్డర్ గవాస్కర్ సిరీస్ నిలుపుకోవటంపై దృష్టి నిలిపిన భారత్‌కు సిడ్నీ రికార్డు నిరాశ కలిగిస్తోంది. ఇక్కడ ఆడిన 13 టెస్టుల్లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.