వింటారంటావా?

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. వాళ్లందర్నీ తలా ఓ దిక్కున ఇష్టమొచ్చినట్టు ఎక్కడపడితే అక్కడకు బదిలీ చేశారు. అప్పట్లో ‘దొర’కు వ్యతిరేకంగా గళ మెత్తే ధైర్యం లేక సర్దుకుపోయారు. మరీ అన్యాయంగా అప్పటివరకు రెవెన్యూ విభాగంలో వీఆర్‌ఓలుగా పదేండ్లకు పైగా పనిచేసిన వారి సర్వీసును కూడా రద్దుచేసి ఇతర విభాగాలకు పంపేశారు. కొలువుంటే సాలు దొరా.. అన్నట్టు 55 రోజులు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికుల లెక్కే వీఆర్‌ఓలు మనసుల్ని బండరాళ్లు చేసుకొని కొత్త కొలువుల్లో చేరారు. అప్పట్లో వీళ్ల సమస్యను కాంగ్రెస్‌పార్టీ భుజాని కెత్తుకుని, సీఎం కేసీఆర్‌ను ”గద్దెదిగు బిడ్డా… నీ సంగతి చెప్తాం…” అంటూ హూంకరించింది. ఉద్యమ నాయకుడే సీఎం అయినట్టు… అప్పటి పీసీసీ అధ్యక్షుడే ఇప్పుడు సీఎం అయ్యారు. వాళ్లకు వీఆర్‌ఓల సమస్యలు గుర్తున్నాయో లేదో అని సదరు ఉద్యోగులు గుబులు పడుతున్నారు. ”మా సర్వీసును మాకిచ్చి, మమ్మల్ని మళ్లీ రెవెన్యూ ఉద్యోగులుగా గుర్తించండి సారూ…” అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పుకోవాలని ఉన్నా… అన్నవస్త్రాలకు వెళ్తే… ఉన్న వస్త్రాలు పోతాయేమో అనే భయం వాళ్లను వెంటాడుతున్నది. సీఎం సారే పెద్ద మనసు చేసుకొని అందర్నీ పిలిపించుకొని మాట్లాడితే బాగుంటుంది కదన్నా… ఆయన వింటారంటావా?!!
– ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి