– టైటిల్ విజయాలపై భారత షట్లర్లు గురి
– లక్ష్యసేన్, ప్రణయ్, సాత్విక్ జోడీపై ఫోకస్
– నేటి నుంచి మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్
నవతెలంగాణ-కౌలాలంపూర్
కొత్త ఏడాదిలో సరికొత్త ప్రదర్శన చేసేందుకు భారత షట్లర్లు సిద్ధమవుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత భారత బ్యాడ్మింటన్‌లో తరం మార్పిడి జరుగుతోంది!. యువ షట్లర్లు టైటిల్ వేటలో ముందుకొస్తున్నారు. ఏడాది పాటు బిడబ్ల్యూఎఫ్ సిరీస్‌ల్లో నిలకడగా రాణించటంపై దృష్టి పెడుతున్నారు. సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ మాత్రమే ఏడాది పాటు నిలకడగా రాణిస్తున్నారు. ఇతర షట్లర్లు నిలకడ సాధించటంలో తేలిపోతున్నారు. సింగిల్స్ సర్క్యూట్‌లో లక్ష్యసేన్, హెచ్.ఎస్ ప్రణరు విరామం తర్వాత బరిలోకి దిగుతున్నారు. అగ్ర షట్లర్ పి.వి సింధు గైర్హాజరీలో మహిళల సింగిల్స్‌లో కొత్త తరం షట్లర్లు సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు. మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్ 1000 టోర్నమెంట్ మంగళవారం నుంచి ఆరంభం కానుంది.
లక్ష్యసేన్‌పై గురి
పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకం వేటలో అద్భుతంగా ఆడినా.. ఆఖర్లో చుక్కెదురైంది. 22 ఏండ్ల లక్ష్యసేన్ సూపర్ సిరీస్ టోర్నీల్లో టైటిల్ విజయాలపై గురి పెట్టాడు. 2025లో తొలి సూపర్ 1000 సిరీస్ మలేషియా ఓపెన్. రాకెట్‌తో లక్ష్యసేన్ సత్తాపై ఎవరికీ అనుమానం లేదు. కానీ అంతర్జాతీయ స్థాయిలో చాంపియన్‌గా నిలిచేందుకు ప్రతిభ ఒక్కటే సరిపోదు. మానసికంగా ఎంతో ధృడత్వం సాధించాలి. అప్పుడే అగ్రశ్రేణి షట్లర్లపై పైచేయి సాధించేందుకు మొగ్గు ఉంటుంది. మలేషియా ఓపెన్‌లో తొలి రౌండ్లో చి యు జెన్‌తో లక్ష్యసేన్ తలపడనున్నాడు. పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్ ప్రత్యర్థి విక్టర్ అక్సెల్సెన్ తర్వాతి రౌండ్లో ఎదురు కానున్నాడు. సహచర భారత షట్లర్లు హెచ్.ఎస్ ప్రణరు, ప్రియాన్షు రజావత్‌లు సైతం డ్రాలో లక్ష్యసేన్ పార్శ్యంలోనే నిలిచారు. 32 ఏండ్ల హెచ్.ఎస్ ప్రణరు నాలుగు నెలల విరామం తర్వాత బరిలోకి దిగుతున్నాడు. ఒకప్పుడు టాప్-10లో నిలిచిన ప్రణరు.. ప్రస్తుతం వరల్డ్ నం.26గా ఉన్నాడు. ఫిట్‌నెస్‌పై కఠోరంగా శ్రమించిన ప్రణరు.. కొత్త ఏడాదిలో మంచి ప్రదర్శనపై భారీ ఆశలతో ఉన్నాడు. కెనడా షట్లర్ బ్రియాన్ యాంగ్‌తో ప్రణరు తొలి రౌండ్లో పోటీపడనున్నాడు.
సాచి.. సరికొత్తగా
పురుషుల డబుల్స్‌లో భారత స్టార్స్ సాత్విక్, చిరాగ్ జోడీ. మలేషియా ఓపెన్‌లో ఏడో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సాత్విక్ చిరాగ్‌లు టైటిల్ ఫేవరేట్లలో ఒకరు. ఒలింపిక్స్ తర్వాత ఒక్క టోర్నీలో ఆడిన ఈ జోడీకి మ్యాచ్ ప్రాక్టీస్ పెద్దగా లేకపోవటం ప్రతికూలత. కానీ పాత కోచ్ టాన్ కిమ్ హర్ రాకతో ఈ జోడీలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఈ కోచ్ పర్యవేక్షణలో సాత్విక్ చిరాగ్‌లు సరికొత్త శిఖరాలు అధిరోహించారు. డ్రాలో సాత్విక్, చిరాగ్‌కు పెద్దగా పోటీ లేదు!. సెమీఫైనల్లోనే కఠిన సవాల్ ఎదురు కానుంది. గాయం, ఫిట్‌నెస్ పరంగా సమస్యలు లేకపోతే ఈ జోడీని టైటిల్ పోరులో చూడవచ్చు. ఇక మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు ఆడటం లేదు. మాళవిక బాన్సోద్, ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయలు పోటీలో ఉన్నారు.