– విజయంపై గురి పెట్టిన సూర్య సేన
– భారత్, దక్షిణాఫ్రికా మూడో టీ20 నేడు
– రాత్రి 8.30 నుంచి స్పోర్ట్స్18లో..
భారత్, దక్షిణాఫ్రికా టీ20 సమరం రసవత్తర దశకు చేరుకుంది. తొలి టీ20లో సూర్యసేన ఏకపక్ష విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో సఫారీలు ఉత్కంఠ విజయం అందుకున్నారు. నాలుగు మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది. నేడు మూడో టీ20లో నెగ్గిన జట్టు సిరీస్ కోల్పోయే అవకాశం లేదు. దీంతో సెంచూరియన్ ధనాధన్‌లో పైచేయి కోసం ఇరు జట్లు ఎదురుచూస్తున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా మూడో టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-సెంచూరియన్
టీమ్ ఇండియా రికార్డుల పరంపరకు ఇటీవల వరుసగా బ్రేక్ పడుతోంది. టీ20 ఫార్మాట్‌లో వరుసగా 11 విజయాలు సాధించిన భారత్‌కు గత మ్యాచ్‌లో చేదు ఫలితం ఎదురైంది. దీంతో పొట్టి ఫార్మాట్‌లో వరుస విజయాల పరంపరను సూర్యకుమార్ సేన మళ్లీ మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. సఫారీ శిబిరంలో భీకర బ్యాటర్లు ఫామ్‌లో లేకపోయినా.. సిరీస్‌ను ఆతిథ్య జట్టు సమం చేసింది. అదే ఉత్సాహంలో ఆధిక్యం సాధించాలనే తపన దక్షిణాఫ్రికాలో కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా టీమ్ ఇండియా నేడు సెంచూరియన్ బరిలోకి దిగుతోంది. ఆధిక్యం కోసం ఇరు జట్లు పోటీపడుతున్న తరుణంలో నేడు మూడో టీ20 పోరు రసవత్తరంగా సాగటం ఖాయమే!.
బ్యాటర్లపైనే ఫోకస్
భారత బ్యాటింగ్ లైనప్ ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. సంజు శాంసన్, తిలక్ వర్మ మినహా జట్టులో ఎవరూ నిలకడగా రాణించటం లేదు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరంభంలోనే వికెట్ పారేసుకుంటున్నాడు. అవకాశాలు వృథా అవుతున్న నేపథ్యంలో అభిషేక్‌పై ఒత్తిడి నెలకొంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. తిలక్ వర్మ వరుస ఇన్నింగ్స్‌ల్లో మంచి ఆరంభాలను దక్కించుకున్నా.. భారీ స్కోర్లు సాధించలేదు. హార్దిక్ పాండ్య, రింకు సింగ్‌లు దూకుడు చూపించటం లేదు. ఫలితంగా డెత్ ఓవర్లలో భారత్ పరుగుల వేట నత్తనడకన సాగుతోంది. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోరు మాయ చేస్తున్నారు. కానీ స్పిన్ మాయ నడిచిన రెండో టీ20లో అక్షర్ పటేల్‌కు బౌలింగ్ ఇవ్వకపోవటం కెప్టెన్సీ వైఫల్యాన్ని ఎత్తి చూపించింది. పేసర్లు అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్‌లు పరుగుల నియంత్రణలో విఫలమయ్యారు. నేడు పేస్‌కు అనుకూలించే పిచ్‌పై ఈ ఇద్దరి ప్రదర్శనపై ఫోకస్ ఉండనుంది.
ఉత్సాహంగా సఫారీలు
ఆతిథ్య దక్షిణాఫ్రికా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఆ జట్టులో కీలక బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డెవిడ్ మిల్లర్, ఎడెన్ మార్‌క్రామ్ ఫామ్ కోల్పోయారు. అయినా, కీలక మ్యాచ్‌లో సఫారీలు విజయం అందుకున్నారు. యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్, పేస్ ఆల్‌రౌండర్ గెరాల్డ్ కోయేట్జి పోరాటం ఆ జట్టులో స్ఫూర్తి నింపింది. దీంతో నేడు సఫారీ మరింత మెరుగైన ప్రదర్శన అవకాశం కనిపిస్తోంది. ఓపెనర్లు రికెల్టన్, హెండ్రిక్స్ సైతం జట్టులో స్థానానికి న్యాయం చేయాల్సి ఉంది. క్లాసెన్, మిల్లర్ మెరిస్తే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కష్టాలకు తెర పడనుంది. భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు క్లాసెన్, మిల్లర్ ఏం చేస్తారో చూడాలి. మార్కో జాన్సెన్, కోయేట్జిలు బంతితో అదరగొడుతున్నారు. యువ స్పిన్నర్ పీటర్ తోడుగా కేశవ్ మహరాజ్ మాయ చేయగలుగుతున్నాడు.
పిచ్, వాతావరణం
సెంచూరియన్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలం. సీమర్లకు వికెట్ల వేటలో పిచ్ అనుకూలత ఉండనుంది. అదనపు బౌన్స్‌తో స్పిన్నర్లు సైతం బ్యాటర్లకు సవాల్ విసరవచ్చు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మ్యాచ్ ముందు రోజు చిరు జల్లులు కురిసినా.. మ్యాచ్ సమయంలో ఎటువంటి వర్షం సూచనలు లేవని వాతావరణ శాఖ తెలిపింది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోరు, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అవేశ్ ఖాన్.
దక్షిణాఫ్రికా : రికెల్టన్, హెండ్రిక్స్, ఎడెన్ మార్‌క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డెవిడ్ మిల్లర్, సిమెలానె, గెరాల్డ్ కోయేట్జి, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్.