– విజయంపై కన్నేసిన టీమ్ ఇండియా
– ఆధిక్యం కోసం ఆతిథ్య ఆసీస్ తహతహ
– నేటి నుంచి గబ్బాలో మూడో టెస్టు
– ఉదయం 5.50 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఆస్ట్రేలియా కంచుకోట గబ్బా. 2021లో భారత్ ఇక్కడ ఆడిన టెస్టులో చరిత్ర తిరగరాసింది. అసమాన విజయం అందుకుని ఔరా అనిపించింది. 2024లోనూ గబ్బా టెస్టు ముంగిట గతంలో తరహాలోనే ఒత్తిడిలో పడింది. సీనియర్ బ్యాటర్లు అంచనాలు అందుకోవటం లేదు. ఆడిలైడ్‌లో పేసర్లు ఆశించిన ప్రదర్శన చేయలేదు. మరి, ఇప్పుడు మనోళ్లు ఏం చేస్తారనేది ఆసక్తికరం. భారత్, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-బ్రిస్బేన్
భారత్, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమరం గబ్బాకు చేరుకుంది. 1-1తో సమవుజ్జీలుగా బ్రిస్బేన్‌లో అడుగుపెట్టిన ఇరు జట్లు.. ఇక్కడ ఆధిక్యం కోసం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. పెర్త్ టెస్టు ఓటమి నుంచి ఆసీస్ పుంజుకోగా.. ఆడిలైడ్ టెస్టు ఓటమి నుంచి పుంజుకునేందుకు టీమ్ ఇండియా ఎదురుచూస్తుంది. ఇరు జట్ల బ్యాటింగ్ లైనప్‌లు కాస్త బలహీనంగా కనిపిస్తున్నా.. కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్… బుమ్రా, సిరాజ్, ఆకాశ్ పేస్ త్రయం మెరుపులపైనే గబ్బా ఫలితం ఆధారపడి ఉంది.
రోహిత్ మెరిసేనా?
భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ నిలకడగా విఫలం అవుతున్నారు. పెర్త్ టెస్టులో కోహ్లి సెంచరీతో మెరువగా.. రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతుంది. ఈ ఏడాది మార్చిలో రోహిత్ టెస్టు శతకం సాధించాడు. ఆ తర్వాత 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 142 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 52 కాగా.. సగటు 11.83. నాయకుడిగా తనదైన మార్క్ చూపించే రోహిత్ శర్మ ఇప్పుడు ఆ మేనియా కోల్పోయినట్టు కనిపిస్తున్నాడు. నెట్స్‌లో డిఫెన్స్‌పై ఎక్కువ దృష్టి నిలిపిన హిట్‌మ్యాన్.. గబ్బాలో మళ్లీ ఓపెనర్‌గా కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విరాట్ కోహ్లి సైతం పెర్త్ జోరు కొనసాగిస్తే బ్రిస్బేన్‌లో భారత్‌కు తిరుగుండదు. యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై ఈ ఇద్దరు బ్యాటర్లు భారత్‌కు కీలకం కానున్నారు. రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తున్నారు. ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. టాప్ ఆర్డర్ మంచి ఆరంభం అందిస్తే.. చివర్లో పంత్, నితీశ్ తమదైన జోరు చూపించగలరు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, మూడో పేసర్‌గా హర్షిత్ రానా స్థానంలో ఆకాశ్ దీప్ తుది జట్టులోకి రానున్నారు. 2021 గబ్బా టెస్టులో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ ఈ టెస్టులోనూ ఆ ప్రదర్శన పునరావృతం చేస్తాడని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
జోరుమీదున్న ఆసీస్
ఆతిథ్య ఆస్ట్రేలియా జోరుమీదుంది. పెర్త్ టెస్టులో భారీ ఓటమి చవిచూసినా.. ఆడిలైడ్‌లో లెక్క సమం చేసింది. విధ్వంసక బ్యాటర్ ట్రావిశ్ హెడ్ రెండు టెస్టుల్లోనూ రాణించాడు. భారత బౌలర్లకు హెడ్ తలనొప్పిగా మారాడు. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌లను తేలిగ్గా పెవిలియన్‌కు చేర్చుతున్నా.. ట్రావిశ్ హెడ్ కొరకరాని కొయ్యగా మారాడు. గబ్బాలోనూ హెడ్ వికెట్ కోసం భారత బౌలర్లు చెమటోడ్చక తప్పదేమో!. ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ మంచి ఆరంభాలను అందించటం లేదు. మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీలు సైతం రాణించటం లేదు. బ్యాటింగ్ ఆసీస్‌కు ప్రధాన సమస్యగా మారింది. జోశ్ హాజిల్‌వుడ్ గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో గబ్బాలో కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్ త్రయం నిప్పులు చెరిగేందుకు సిద్ధమవుతోంది. ఆడిలైడ్ విజయం ఉత్సాహంలో ఆసీస్ బ్యాటర్లు సమిష్టిగా మెరిస్తే.. గబ్బాలో సైతం టీమ్ ఇండియాకు కష్టాలు తప్పవు.
పిచ్, వాతావరణం
బ్రిస్బేన్ పిచ్ సహజంగా పేసర్లకు అనుకూలం. టెస్టు మ్యాచ్ సమయంలో ఇక్కడ వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిరు జల్లులతో కూడి వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులతో పిచ్ నుంచి పేసర్లకు మరింత అనుకూలత లభించనుంది. చివరగా భారత్ ఇక్కడ ఆడిన టెస్టు మ్యాచ్‌లో చారిత్రక విజయం సాధించింది. 32 ఏండ్ల పాటు గబ్బాలో ఓటమెరుగని ఆస్ట్రేలియాకు నేలకు దించింది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జశ్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిశ్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, జోశ్ హాజిల్‌వుడ్.