తీరంలో తేల్చేస్తారా?

– సిరీస్‌ విజయంపై భారత్‌ గురి
– మధాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
– ఆసీస్‌తో రెండో వన్డే పోరు నేడు
నవతెలంగాణ-విశాఖపట్నం
వన్డే సిరీస్‌పై భారత్‌ కన్నేసింది. వాంఖడేలో విజయంతో బోణీ కొట్టిన భారత్‌ నేడు విశాఖ తీరంలో సిరీస్‌ విజయాన్ని తేల్చేం దుకు సిద్ధమవుతోంది. మరోవైపు కంగారూ సేన సైతం సిరీస్‌ ఆశలను చెన్నై చెపాక్‌కు తీసుకెళ్లేందుకు సర్వశక్తులూ ఒడ్డనుంది. విశాఖ
తీరంలో భారత్‌, ఆస్ట్రేలియా
రెండో వన్డే పోరు నేడు.

సుమారు మూడేండ్ల విరామం అనంతరం విశాఖపట్నానికి వన్డే క్రికెట్‌ ఉత్సాహం వచ్చింది. 2019లో ఇక్కడ చివర వన్డే జరుగగా.. నేడు భారత్‌, ఆస్ట్రేలియాలు 50 ఓవర్ల ఫార్మాట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అగ్రజట్ల నడుమ పోరుతో అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఎదురుచూ స్తున్నారు. 1-0తో విశాఖకు వచ్చిన టీమ్‌ ఇండియా నేడు రోహిత్‌ శర్మ సొంతగడ్డపై సిరీస్‌ను చుట్టేయా లని చూస్తోంది. స్మిత్‌ సారథ్యంలోని ఆసీస్‌ ఎప్పుడూ పోరాట స్ఫూర్తి కనబర్చుతుంది.వన్డేల్లోనూ కంగారూ జట్టు సిరీస్‌ను సమంచేసేందుకు బరిలోకి దిగుతోంది.
రోహిత్‌ వస్తున్నాడు
వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. అమ్మమ్మ ఊరు విశాఖపట్నం మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రాకతో టీమ్‌ ఇండియా మరింత ఉత్సాహంతో సిరీస్‌ వేట సాగించనుంది. టెస్టు సిరీస్‌లో ఫామ్‌ సాధిం చిన రోహిత్‌ శర్మ.. అదే జోరులో వైట్‌బాల్‌ ఫార్మా ట్‌లో చెలరేగుతాడని జట్టు భావిస్తోంది. రోహిత్‌ రాకతో ఇషాన్‌ కిషన్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. వన్డేల్లో నిరాశపరుస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. వాంఖడేలో డకౌట్‌ అయ్యాడు. విశాఖలో సూర్యకు మరో అవకాశం లభించనుంది. అతడు ఈ ఫార్మాట్‌లో వీలైనంత త్వరగా సత్తా చాటితేనే తుది జట్టులో నిలువగలడు. టెస్టుల్లో విఫలమైన కెఎల్‌ రాహుల్‌ తొలి వన్డేలో దంచి కొట్టాడు. రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యలు మెప్పించారు. ఇక సీమర్లు సిరాజ్‌, షమిలు అద్భుతంగా ఆసీస్‌ను కట్టడి చేశారు. చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ తన మ్యాజిక్‌కు పదును పెట్టాల్సి ఉంది. నేడు విశాఖ మ్యాచ్‌లో భారత్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
పుంజుకుంటారా?
వాంఖడే వన్డేలో ఆస్ట్రేలియా తేలిపోయింది. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని 50 ఓవర్ల పాటు వికెట్లను నిలుపుకోలేదు. మిచెల్‌ మార్ష్‌ ఒక్కడే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. టెస్టు సిరీస్‌లో రాణించిన ట్రావిశ్‌ హెడ్‌, మార్నస్‌ లబుషేన్‌, కామెరూన్‌ గ్రీన్‌లపై ఆసీస్‌ భారీ అంచనాలు పెట్టుకుంది. జోశ్‌ ఇంగ్లిశ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేస్తే ఆసీస్‌కు తిరుగుండదు. మిచెల్‌ స్టార్క్‌ పేస్‌ విభాగానికి సారథ్యం వహిస్తున్నాడు. సీన్‌ అబాట్‌తో కలిసి అతడు భారత టాప్‌ ఆర్డర్‌కు సవాల్‌ విసరాలని భావిస్తున్నాడు. ఆడం జంపా విశాఖలో స్పిన్‌ అనుకూలతను సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. విశాఖ వన్డేలో ఓడితే సిరీస్‌పై ఆశలు ఆవిరి కానున్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియా చావోరేవో తేల్చుకోనుంది.
వర్షం ముప్పు?
విశాఖ వన్డే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. నేడు విశాఖలో భారీ వర్షం సూచనలు కని పిస్తున్నాయి. మధ్యాహ్నాం వర్షం కురు వనుండగా.. సాయంత్రం 8 గంటల సమయంలో భారీ వర్ష సూచనలు ఉన్నాయి. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిని దృష్టిలో ఉంచుకుని టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోనుంది. ఇక్కడ జరిగిన 9 వన్డేల్లో 7 వన్డేల్లో ఫలితం తేలగా.. ఏడింట్లో భారత్‌ విజయాలు నమోదు చేసింది. చివరగా ఇక్కడ విండీస్‌తో జరిగిన వన్డేలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. నేటి మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారేలా పిచ్‌ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, కెఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి.
ఆస్ట్రేలియా : ట్రావిశ్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), మార్నస్‌ లబుషేన్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌, కామెరూన్‌ గ్రీన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, సీన్‌ అబాట్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడం జంపా.