– భారత్, శ్రీలంక రెండో వన్డే నేడు
– విజయమే లక్ష్యంగా రోహిత్ సేన
మధ్యాహ్నం 2.30 నుంచి సోనీస్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-కొలంబో
ఆధునిక క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో అన్ని జట్లు ఇప్పుడు ఈ ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగానే టీమ్ ఇండియా సైతం శ్రీలంకతో వన్డే సిరీస్‌లో తలపడుతుంది. కొలంబోలో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌కు గట్టి షాక్ తగిలింది. అలవోకగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను కాస్త టై దాకా తీసుకు రావటంపై కచ్చితంగా డ్రెస్సింగ్‌రూమ్‌లో చర్చకు దారితీసి ఉంటుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలు ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు!. ప్రపంచ క్రికెట్‌లో అగ్రజట్టుగా వెలుగొందుతున్న టీమ్ ఇండియాను పసలేని శ్రీలంక జట్టు నిలువరించటం ఏమిటనే ప్రశ్న సగటు అభిమానులను కలిచి వేసింది. కానీ, అందుకు ప్రధాన కారణం పిచ్‌లు స్పిన్‌కు సహకరించటం. నాణ్యమైన స్పిన్నర్లు, స్పిన్ అనుకూల పిచ్‌లతో టీమ్ ఇండియాతో సమవుజ్జీగా శ్రీలంక పోటీపడుతోంది. అందులో భాగంగానే నేడు భారత్, శ్రీలంక రెండో వన్డే జరుగనుంది. స్పిన్‌కు సహకరించే పిచ్‌పై మ్యాచ్ కావటంతో రెండో వన్డేపై అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తుంది.
ఆ ఇద్దరు మెరిస్తే..! : టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీతో కదం తొక్కినా.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి అంచనాలను అందుకోలేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచీ విరాట్ కోహ్లి పరుగుల వేటలో వెనుకంజ వేస్తున్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలోనూ అదే కనిపించింది. శుభ్‌మన్ గిల్ జింబాబ్వే పర్యటనలో మెరిసినా.. ఆ దూకుడు ఇక్కడ చూపించలేకపోయాడు. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి దంచికొడితే శ్రీలంక బౌలర్లకు కష్టాలు తప్పవు. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ మంచి ఆరంభాలను దక్కించుకున్నా.. ఆఖరు వరకు నిలబడాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్‌లు గతంలో గంభీర్ ఐపీఎల్ ప్రాంఛైజీలకు మెంటార్‌గా పనిచేసిన జట్లకు కెప్టెన్లు. ఈ ఇద్దరు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు గంభీర్ మద్దతు ఉంది. శ్రేయస్ అయ్యర్ సమయోచితంగా పరుగుల వేటలో వేగం పెంచగలడు. కానీ కెఎల్ రాహుల్ స్ట్రయిక్‌రేట్ విషయంలో నిలకడగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆధునిక క్రికెట్‌లో మార్పునకు అనుగుణంగా రాహుల్ వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే, గంభీర్ ఎంతోకాలం తుది జట్టులో నిలిచేలా చూడలేదు. ఆల్‌రౌండర్‌గా శివం దూబె ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో లాంఛనం ముగిస్తే.. దూబెకు మరింత బాగుండేది. స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మరింత కీలక పాత్ర పోషించాలి. వాషింగ్టన్ సుందర్ నుంచి జట్టు మేనేజ్‌మెంట్ బ్యాట్‌తో, బంతితో ఉత్తమ ప్రదర్శన ఆశిస్తోంది. శ్రీలంకతో సిరీస్ కావటంతో సహజంగానే మహ్మద్ సిరాజ్ భారత్‌కు కీలక పేసర్. అర్షదీప్ సింగ్‌తో కలిసి సిరాజ్ పేస్ బాద్యతలు పంచుకోనున్నాడు.
తుది జట్లు (అంచనా) :
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివం దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.
శ్రీలంక: పతుం నిశాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), జానిత్ లియనాగె, డ్యునిత్ వెల్లలాగె, వానిందు హసరంగ, అఖిల ధనంజయ, మహ్మద్ షిరాజ్, అసిత ఫెర్నాండో.