నిలబడతారా?!

Will you stand?!– భారత్‌ ముంగిట కేప్‌టౌన్‌ సవాల్‌
– ఇక్కడ ఒక్క విజయం దక్కని చెత్త రికార్డు
– సిరీస్‌ సమంపై రోహిత్‌సేన మల్లగుల్లాలు
దక్షిణాఫ్రికాలో భారత్‌ టెస్టు సిరీస్‌. 32 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించే తరుణం ఆసన్నమైందని అందరూ భావించిన పర్యటన ఇది. కానీ సెంచూరియన్‌లో మూడు రోజుల్లోనే టీమ్‌ ఇండియా కథ తేల్చేసిన బవుమాసేన.. టెస్టు సిరీస్‌లో ఎదురులేని 1-0 ఆధిక్యం సాధించింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను కోల్పోకుండా ఉండేందుకు భారత్‌ ఒక్క మార్గమే ఉంది. సఫారీ కంచుకోట కేప్‌టౌన్‌లో చారిత్రక విజయం సాధించాల్సిందే. ఆత్మవిశ్వాసంతో బరిలో నిలిచినా సెంచూరియన్‌లో ఓడిన భారత్‌… ఒత్తిడిలో కేప్‌టౌన్‌లో ఎలా ఆడుతుంది? సఫారీ పేస్‌ పదును ముంగిట మనోళ్లు నిలబడతారా? ఆసక్తికరం. భారత్‌, దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్‌ బుధవారం నుంచి ఆరంభం.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారీ అంచనాలతో సఫారీతో టెస్టు సవాల్‌ను మొదలెట్టిన టీమ్‌ ఇండియాకు సెంచూరియన్‌లో భారీ అవమానమే జరిగింది. ఆతిథ్య జట్టును కనీసం రెండోసారి బ్యాటింగ్‌కు రప్పించకుండానే టీమ్‌ ఇండియా చేతులెత్తేసింది. ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో భారత్‌ దారుణ పరాజయం చవిచూసింది. టెస్టు సిరీస్‌లో 0-1తో వెనుకంజ వేసింది. ఇక సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ అవకాశం టీమ్‌ ఇండియాకు ఇప్పటికి లేదు. కానీ ఇక్కడ మరో సిరీస్‌ పరాజయం నుంచి తప్పించుకునే మార్గం మాత్రం ఉంది. బుధవారం నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌ న్యూలాండ్స్‌ గ్రౌండ్స్‌లో చివరి టెస్టులో తలపడనున్నాయి. ఇక్కడ భారత్‌కు మంచి రికార్డు లేదు. సఫారీ జట్టు ఈ మైదానంలో టీమ్‌ ఇండియా చేతిలో ఓటమి చవిచూడలేదు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా 2-0 సిరీస్‌ విజయంపై కన్నేయగా.. భారత్‌ 1-1తో సిరీస్‌ను సమం చేయటంపై దష్టి సారిస్తోంది.
ఇక్కడ చెత్త రికార్డు : కేప్‌టౌన్‌ న్యూలాండ్స్‌లో భారత్‌కు అత్యంత చెత్త రికార్డు ఉంది. తొలి టెస్టు వేదిక సెంచూరియన్‌లో గత పర్యటనలో అద్భుత విజయం సాధించిన టీమ్‌ ఇండియా ఈసారి ఆ ప్రదర్శన పునరావతం చేయలేకపోయింది. కానీ కేప్‌టౌన్‌లో భారత్‌ ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. భారత్‌, దక్షిణాఫ్రికాలు ఇక్కడ ఆరు మ్యాచుల్లో తలపడ్డాయి. నాలుగు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా, రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. కేప్‌టౌన్‌లో టీమ్‌ ఇండియాకు అత్యుత్తమ ఫలితం డ్రా. విచిత్రంగా దక్షిణాఫ్రికాలో ఇతర పిచ్‌ల తరహాలో కాకుండా కేప్‌టౌన్‌ పేసర్లతో పాటు స్పిన్నర్లకూ అనుకూలం. ఇక్కడ భారత టర్బోనేటర్‌ హర్బజన్‌ సింగ్‌తో పాటు పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుత జట్టులో అశ్విన్‌, జడేజా రూపంలో ఇద్దరు ప్రపంచ శ్రేణి స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. బుమ్రాకు తోడు సిరాజ్‌ పేస్‌తో ఆకట్టుకుంటున్నాడు. స్పిన్‌తో ఒకరు, పేస్‌తో ఒకరు అంచనాలు అందుకుంటే కేప్‌టౌన్‌లో సారి కథ మారేందుకు అవకాశం లేకపోలేదు.
బ్యాటర్లు నిలవాలి : సెంచూరియన్‌ ఓటమికి ప్రధాన బాధ్యత పేసర్లు తీసుకున్నారు. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై సఫారీలకు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు కోల్పోయారు. అదే తొలి టెస్టులో టీమ్‌ ఇండియా కథ ముగియడానికి కారణమైంది. అయితే, బ్యాటర్లు అద్భుతంగా ఆడారని చెప్పడాకి ఏం లేదు. బ్యాటర్లు సైతం చెత్త ప్రదర్శనే చేశారు. టాప్‌ ఆర్డర్‌లో ఎవరూ మెప్పించలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో శుభారంభం అందించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి 17 పరుగులు చేయగా, రోహిత్‌ 5 పరుగులకు అవుటయ్యాడు. తొలి వికెట్‌ భాగస్వామ్యం 30 బంతుల్లో 13 పరుగులు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు 17 బంతుల్లో 5 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. యశస్వి 5 పరుగులు చేయగా, రోహిత్‌ శర్మ పరుగుల ఖాతా తెరువలేదు. శుభ్‌మన్‌ గిల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేశాడు. కీలక నం.3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్‌ కర్తవ్యం మరిచాడు. సహజంగా ఓపెనర్లు సహా నం.3 బ్యాటర్‌ ప్రధాన బాధ్యత.. కనీసం బంతి పాతబడే వరకు క్రీజులో పాతుకుని ఉండటం. కొత్త బంతిని ఎదుర్కొని నిలబడేందుకు మిడిల్‌ ఆర్డర్‌కు కష్టసాధ్యం. కనీసం 20 ఓవర్ల పాటు ప్రత్యర్థి పేసర్ల ఒత్తిడిని తట్టుకుని నిలబడాలి. అప్పుడే పాత బంతిపై మిడిల్‌ ఆర్డర్‌ స్వేచ్ఛగా పరుగులు చేయగలదు. కానీ 20 ఓవర్లు ముగిసే వరకు టెయిలెండర్లు బంతిని ఎదుర్కొనేందుకు వస్తున్నారు. ఇదే అతిపెద్ద సమస్య. దీన్ని టీమ్‌ ఇండియా అధిగమించాలి. తొలి ఇన్నింగ్స్‌లో కెఎల్‌ రాహుల్‌ ఒక్కడే శతక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి ఒక్కడే అర్థ సెంచరీతో ఎదురు నిలిచాడు. దీంతో భారత్‌ మళ్లీ పాత కాలంలోకి వెళ్లింది. ఒకరిద్దరు రాణిస్తేనే ఓ మోస్తరు స్కోరు సాధించే రోజులను గుర్తు చేసింది. జట్టులో అందరూ నాణ్యమైన బ్యాటర్లు అందుబాటులో ఉండగా.. కనీసం పోటీ ఇవ్వగల స్కోరు సాధించకపోతే ఇక అగ్రజట్టు హౌదాకు అర్థం ఏముంటుంది?
తొలి టెస్టు ఓటమి అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘ సఫారీ పిచ్‌లపై ఎలా బ్యాటింగ్‌ చేయాలో మాకు తెలుసు. ఎలా ఆడాలనే విషయం తెలియక కాదు’ అని విమర్శలకు ఘాటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు. నిజమే.. విదేశీ పిచ్‌లపై, సెంచూరియన్‌.. కేప్‌టౌన్‌ వంటి పిచ్‌లపై ఎలా బ్యాటింగ్‌ చేయాలనే విషయం క్రికెట్‌ విశ్లేషకులు కాదు ఆధునిక యుగంలో అభిమానులు సైతం చెప్పగలరు. కానీ క్రీజులో పరిస్థితులకు నిలబడి పరుగులు చేయాల్సింది బ్యాటర్లే కదా!. ఇక్కడ సమస్య ఎలా ఆడాలనే అంశం ఆటగాళ్లకు తెలియదు అనేది కాదు. స్థానిక పరిస్థితులు, పిచ్‌ స్వభావం, పేస్‌, బౌన్స్‌ను అంచనా వేయటంలో జరుగుతున్న పొరపాటు గురించే. ఈ చిన్న విషయంలో తప్పులు దిద్దుకుంటే మన బ్యాటింగ్‌ లైనప్‌లో భారీ శతకాలు నమోదు కావటం పెద్ద విషయం కాబోదు. విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌ తొలి టెస్టులో రాణించిన విశ్వాసంలో ఉన్నారు. రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ సెంచూరియన్‌లో విఫలమయ్యారు. ఈ ఇద్దరికి తోడు యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ బ్యాట్‌తో కదం తొక్కాలి. తొలి రోజు బ్యాటింగ్‌కు వచ్చనా.. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చినా భారీ స్కోరు లక్ష్యంగా కదం తొక్కాలి. ఈ జోరుకు పేసర్లు సైతం జతకలిస్తే.. కేప్‌టౌన్‌ కంచుకోట బద్దలు కొట్టడం సాధ్యమే!