ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రజెండాను గెలిపించండి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ-యాచారం
నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రజెండాను గెలిపించాలని ఓటర్లను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ కోరారు. బుధవారం యాచారం మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ (ఎం) మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్ని, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీం పట్నంలో పదేండ్లుగా నిరుపేదలకు కనీసం ఇండ్ల జాగాలు కూడా ఇవ్వలేదన్నారు. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం) ఎన్నో భూ పోరాటాలు చేసి, వందల ఎకరాల భూములు నిరుపేదలకు పంచిన ఘన చరిత్ర ఎర్రజెండాకే ఉందన్నారు. నిరంతరం ప్రజల కోసం పోరాడే సీపీఐ(ఎం) పార్టీ ఎర్రజెండాను గెలిపించాలని ప్రజలకు తెలియ జేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నడూ సీపీఐ(ఎం) అధికారం ఆశించి పనిచేయలేదని, ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తుందని వివరించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మూడుసార్లు సీపీఐ(ఎం) పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందారని గుర్తుచేశారు. అందుకే మరోసారి ప్రజలంతా ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) పారీకి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.మధుసూదన్‌ రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.