– సీపీఐ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరిన రఘురాంరెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం
సెక్యులరిజం, ప్రజాస్వామ్య పరిరక్షణకు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు కోరారు. బిజెపి రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేసిందని, మరోమారు గెలిస్తే మరింత ప్రమాదమని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రామ సహయం రఘురాంరెడ్డి సోమవారం ఖమ్మంలోని సిపిఐ కార్యాలయంకు వెళ్లి ఆ పార్టీ నాయకులను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా అధ్యక్షతన జరిగిన సభలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టులతో తన స్నేహం ఐదేండ్లు కొనసాగుతుందని, ఈ బంధాన్ని నిరంతరం కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, జిల్లా అభివృద్ధికి తోడ్పడదామని పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రామ సహయం రఘురాంరెడ్డి కోరారు. తాను స్థానికుడినని, ఖమ్మం జిల్లా ప్రజల సమస్యలు తనకు తెలుసునని, ఎంపిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బిజెపి అభ్యర్థి అభివృద్ధి లేదంటున్నారని, కానీ బిజెపి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. బిజెపి గెలిస్తే ప్రమాదం తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది తప్ప అభివృద్ధి జరగదన్నారు. ఇక బిఆర్‌ఎస్, బిజెపి ఒకటేనని రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ఇక స్థానం లేదని ఆయన తెలిపారు. ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రాబాబు, ఎస్కె జానిమియా, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, కార్పొరేటర్ బిజి క్లెమెంట్, జిల్లా కార్యవర్గ సభ్యులు మహ్మద్ సలాం, కాంగ్రెస్ నాయకులు స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.