– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య పిలుపు
నవతెలంగాణ – భువనగిరి
రానున్న పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలలో సిపిఎం గెలిపించి బీజేపీని ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజల దృష్టిని సమస్యల నుండి మరల్చడానికి మతం వైపు దేవుడి వైపు మోడీ తిప్పుతున్నాడని విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని మోడీ ప్రధానమంత్రి గద్దె మీద కూర్చోవడానికి ఇక ఏమాత్రం అర్హత లేదన్నారు. రానున్న ఎన్నికల్లో దేశంలో, తెలంగాణలో బిజెపిని ఓడించాలన్నారు. ప్రధానమంత్రి కాకుండా చూడవలసిన బాధ్యత దేశ ప్రజలపై ఉందన్నారు. తెలంగాణలో బిజెపికి ఒక సీటు రాకుండా, ఓట్ల శాతం పెరగకుండా చూడాలన్నారు. ఈ దేశంలో తెలంగాణలో మతోన్మాదులు బలపడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, రాజ్యాంగ విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో సిపిఎం పోటీ చేస్తుందని తెలిపారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని వివరించారు. సిపిఎం సుత్తి కొడవలి నక్షత్రం పై ప్రజలు ఓటు వేయాలని కోరారు. ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు లౌకిక శక్తులు, మేధావులు, ప్రజలు ఎర్రజెండాను ఆదరించాలని తమ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు పాల్గొన్నారు.