– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రజా సమస్యలపై అవగాహన ఉండి.. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి కోరారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె ఎండీ.జహంగీర్‌తో కలిసి మాట్లాడారు. విద్యార్థి సంఘం నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై పోరాడుతున్న జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఆదరించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేయాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నో హామీలను ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి పేద ప్రజలపై అధిక భారాలు మోపుతోందన్నారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోన్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కమ్యూనిస్టు భావజాలంతో నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసే జహంగీర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
అభ్యర్థి ఎండీ.జహంగీర్ మాట్లాడుతూ.. తుంగతుర్తి గడ్డ తెలంగాణ సాయుధ పోరాటాలకు కేంద్ర బిందువు అని, రజాకార్లను గడగడలాడించిన ప్రాంతమని అన్నారు. కమ్యూనిస్టులకు పదవులు అంటే పోరాట ఆయుధమని తెలిపారు.
భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్ సమస్య కీలకంగా ఉందని, సాగు, తాగు నీరు, వైద్యంపై పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిందని చెప్పారు. గతంలో మల్లు స్వరాజ్యం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తుంగతుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారని.. ఇప్పటి వరకు డిగ్రీ కళాశాల ఏర్పాటు కాలేదని చెప్పారు. ప్రధాన పార్టీల నాయకులు డబ్బు సంచులతో ఎన్నికల బరిలో నిలిచారే తప్ప కనీసం పార్లమెంటు సరిహద్దులు కూడా తెలియదన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న తనను గెలిపిస్తే పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. తనకు ఓటేసి పార్లమెంట్ కు పంపించాలని ప్రజలను కోరారు. వందరోజుల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించారన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కోట గోపి, మట్టిపెళ్లి సైదులు, చేరుకు ఏకలక్ష్మి ఉన్నారు.