ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించండి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు -నారి ఐలయ్య
నవతెలంగాణ – వలిగొండ రూరల్
35 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా పోరాడుతున్న ప్రజా నాయకుడు సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ఓటర్లను కోరారు. గురువారం మండల పరిధిలోని చిత్తపురం  గ్రామంలోసీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు వెతుక్కోకుండా వచ్చిన ఉద్యోగాలను పక్కకు పెట్టి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యార్థి,యువజన సమస్యలతో పాటు ప్రజా సమస్యల కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చి పనిచేస్తున్న పేదలబిడ్డ జహంగీర్ ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారని ప్రజలందరూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే పేదల అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రద్దు చేసే కుట్రలు చేస్తుందన్నారు. ఈ చట్టం వల్ల పనులు లేని అనేక పేద కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని పేదల నోటికాడి ముద్దను లేకుండా చేయాలని కుట్ట చేస్తున్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని, ఉపాధి హామీ చట్టరక్షణకై పోరాడే ఏకైక సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ ను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జహంగీర్ ఈ ప్రాంత అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నడిపారని మూసి జల కాలుష్య నివారణకై మూసీ ప్రాంతంలో గోదావరి జలాల సాధనకై, స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, భూమి లేని పేదలకు భూమి పంచాలని,ఇండ్లు,ఇండ్ల స్థలాల సాధన డిమాండ్ తో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. అందుకే ప్రజల కోసం పోరాడే అభ్యర్థిని గెలిపిస్తే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తారని ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు . ఈ ప్రచారంలో సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల నాయకులు ఏటెల్లి నర్సింహ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాచమల్ల అంజయ్య,లింగమ్మ, రేణుక,భూపతి పద్మ,వల్లమల్ల పావని తదితరులు పాల్గొన్నారు.