
2024 ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొనాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం సూర్యాపేట లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (ఎ సి ఎల్ ) అధికారి యం మంజుల కు సమ్మె నోటీసు సంఘం సభ్యులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాట్ ఫాం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఐఎన్టియుసి, ఏఐటియుసి, సీఐటీయూ, హెచ్ఎంఎస్ ఇతర సంఘాలు, వివిధ రంగాల ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లు మరియు సంయుక్త కిసాన్ మోర్చా (రైతు-వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక) 2024 ఫిబ్రవరి 16న అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మెతో పాటు గ్రామీణ భారత్ బంద్ పాటించాలని నిర్ణయించాయని సీఐటీయూ అనుబంధ యూనియన్ గా ఉన్న మేము భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ జాతీయ సమ్మెతో పాటు గ్రామీణ బంద్ లో భాగస్వాములమౌతున్నామని తెలియజేస్తూ, పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్-22, సబ్ సెక్షన్ (1) అనుసరించి ఈ సమ్మె నోటీస్ ఇస్తున్నాం. 2024 ఫిబ్రవరి 16న జరుగనున్న దేశవ్యాపిత సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు కరిమల శేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి జెడ్ సుజాత, లకావత్ బాలాజీ నాయక్, జడ్డు బల శౌరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.