
అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ-ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి జరిగే నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని స్థానిక అంగన్వాడీ ఉద్యోగుల మండల అధ్యక్షురాలు పూనెం సుజాత పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని తహసీల్లో డిప్యూటీ తహశీల్దార్ సీ.హెచ్.అనుషకు అంగన్వాడీ ఉద్యోగులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పూనెం సుజాత మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.26,000/-లు ఇవ్వాలని, పెన్షన్, ఇఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షల ఇవ్వాలన్నారు. వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలని సూచించారు. 60 ఏండ్లు దాటిన అంగన్వాడీ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే బెనిఫిట్స్ కల్పించాలని చెప్పారు. ప్రమాద బీమా సౌకర్యం రూ.5 లక్షలు చెల్లించాలని కోరారు. సమ్మె నోటీసులో తెలియజేసిన ఇతర డిమాండ్స్ అన్నింటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, హెల్ప్ రైతులు కరకపల్లి మమత, జయశ్రీ, రజిత, బాయమ్మ, రాజ్యలక్ష్మి, రత్తమ్మ, రమణ, మల్లీశ్వరి, శిరీష, కోటమ్మ, తదితరులు పాల్గొన్నారు.