దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి– ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్‌ (సీఐటీయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య
నవతెలంగాణ – ముషీరాబాద్‌
ఈ నెల 16న దేశవ్యాప్తంగా తలపెట్టిన రవాణారంగ కార్మికుల సమ్మె బంద్‌ను జయప్రదం చేయాలని ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్‌(సీఐటీయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య పిలుపునిచ్చారు. సోమవారం ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్‌ హైదరాబాద్‌ కార్యదర్శి అజరుబాబు అధ్యక్షతన సీఐటీయూ సిటీ కార్యాలయంలో ట్రాన్స్‌పోర్ట్‌ జేఏసీ రౌండ్‌ టేబుల్‌ జరిగింది. ఈ సమావేశంలో ఆర్‌.లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భారత న్యాయ సంహిత- 2023’ చట్టంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించిన సెక్షన్స్‌ 106(1),(2)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రవాణా కార్మికులు, గ్యాస్‌, ఆయిల్‌ ట్రక్కు డ్రైవర్లు వెంటనే ఉద్యమించిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ప్రస్తుతానికి ఇవి అమలు చేయడం లేదని, భవిష్యత్‌లో అమలు చేయబోయే ముందు ట్రాన్స్‌పోర్ట్‌, ట్రేడ్‌ యూనియన్స్‌తో చర్చించాకే అమలు చేస్తామని కేంద్ర హౌంశాఖ సెక్రటరీ అజరు బల్ల ప్రకటించారని గుర్తు చేశారు. అందువల్ల దాని ప్రమాదం ఇంకా పోలేదని హెచ్చరించారు. 2024 పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో 106(1),(2)ల సవరణను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
క్యాబ్‌ జేఏసీ కోకన్వీనర్‌ షేక్‌ సలావుద్దీన్‌ మాట్లాడుతూ.. భారత న్యాయ సంహిత చట్టంలోని ఈ సెక్షన్స్‌106 (1),(2) డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని, కేవలం హైవేలపై మాత్రమే గాక సిటీల్లో, గ్రామాల్లో కూడా వర్తిస్తాయని తెలిపారు. టూ వీలర్‌ నుంచి ఆటో, క్యాబ్‌, ట్రాలీ, బస్‌, స్కూల్‌ బస్‌, అంబులెన్స్‌ సహా అన్ని వాహనాల డ్రైవర్లకు వర్తిస్తాయని వివరించారు. ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్‌ మాట్లాడుతూ,, ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌, అనుబంధ ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్స్‌, జాతీయ స్థాయి సంఘాలన్నీ దేశవ్యాప్తంగా రవాణా రంగ సమ్మెకు పిలుపునిచ్చాయని.. ఈ సమ్మెకు రాష్ట్రంలో బీఆర్టీయూ, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఆర్టీసీ సంఘాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఐఎఫ్‌టీయూ నాయకులు జి.లింగంగౌడ్‌, ఐఎన్‌టీయూసీ నాయకులు దయానంద్‌ రామకృష్ణారెడ్డి, బీఆర్‌టీయూ క్యాబ్‌ సెక్టార్‌ నాయకులు నగేష్‌ కుమార్‌, టీఆర్సిపీటీయూ నాయకులు కె.సతీష్‌, టీడీఓఏ ప్రేమ్‌చంద్‌ రెడ్డి, సీసీడీఏ కిరణ్‌, తెలంగాణ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ యూనియన్‌ నాయకులు గోపాల్‌ రెడ్డి, బాల్‌రెడ్డి, తెలంగాణ ఆల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకుల జి.రాజు తదితరులు పాల్గొన్నారు.