పల్లవి పల్లకిని ఎక్కి
చరణాల చేతులు పట్టుకొని
చామనపెల్లి నుండి
ఒక సుగంధం బయలుదేరేది
తెల్లని లాల్చి, పైజామా
మల్లె పువ్వులను మూటగట్టుకు వచ్చేది
నల్లని కోటు మేఘాల్లో దాగిన
మదంగ ద్వానాలను కిందికి దించేది
కంజెర ఆయన కలువ పిల్లలు
ఒకరిని విడిచి ఒకరుండరు
ప్రశాంతంగానే పెదవులు విప్పి
పరాకాష్టకు చేరేవాడు
ఎన్నీల ఏరువాకను
కన్నుల కొలనుల్లో పూయించిన
కలువల రేడు
అవకాశం ఇస్తేనే
వేదికకు వేడుక చేసేవాడు
గొంతు తంత్రులకు
గోరుముద్దలు పెట్టేవాడు
ఆలాపనలు ఎద ఎదలో దాగిన
ఎత్తు పల్లాల గుట్టు విప్పేవి
కంచు కంఠం కమనీయ రూపం
కాలి బూడిదయినవేళ కన్నీటి వీడ్కోలు
(యువకవి, గాయకుడు
రావుల పవన్ స్మతిలో)
– కందుకూరి అంజయ్య