– రోడ్డు పాలైన మక్కలు. ఆందోళనలో రైతులు
– పిడుగుపాటుకు మహిళ మృతి
నవతెలంగాణ -మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి/ తిమ్మాజిపేట/ ఉప్పునుంతల
ఈదురు గాలులు, భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. అక్కడక్కడ కురిసిన వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన మొక్కజొన్న నీళ్ల పాలయింది. వరి, మామిడి రైతులు భారీగా నష ్టపోతున్నారు. తిమ్మాజీపట మండలం నేరళ్లపల్లిలో కురిసిన భారీ వర్షానికి 100 క్వింటాళ్ల మొక్కలు నీటిపాలయ్యాయి. వరి, మామిడి రైతులు విలవిలలాడుతున్నారు. ఈదురు గాలులకు తిమ్మాజిపేట, అచ్చంపేట ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటల్లో కాయలు నేలపాలయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో వివిధ గ్రామాల్లో శుక్రవారం కురిసిన వర్షానికి అక్కడక్కడ కల్లాల్లో, రోడ్లపై ఆరబెట్టిన వరి, మొక్కజొన్న పంట తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని సీపీఐ(ఎం) నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. పిడుగుపాటులో మరణించిన శ్యామలమ్మ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందివ్వాలని కోరారు.
కొట్టుకుపోయిన మొక్కజొన్న
మారేపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి రెండు ఎకరాలు మొక్కజొన్న సాగు చేయగా 80 క్వింటాల వరకు పంట పండింది. దీంతో అతను రెండు రోజులుగా మారేపల్లి – నేరాలపల్లి గ్రామాల మధ్యలో ఉన్న రహదారిపై మొక్కజొన్నను ఆరబెట్టగా శుక్రవారం కురిసిన వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పంట చేతికి రావడంతో వర్షానికి కొట్టుకపోవడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పిడుగు పడి మహిళ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం తాడూర్ గ్రామానికి చెందిన చెందిన మహిళా రైతు గుండమోని శ్యామలమ్మ (34) శుక్రవారం తన వ్యవసాయ పొలంలో పశువులకు నీరు తాపుతుండగా సాయంత్రం నాలుగు గంటల సమయంలో పడిన పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. శ్యామలమ్మకు భర్త పర్వతాలు, ముగ్గురు కుమారులు అశోక్, నరేష్, యశ్వంత్ ఉన్నారు.